Viral: అతిగా తినింది.. లైవ్‌లో చనిపోయింది.. పోస్టుమార్టం రిపోర్టులో..
ABN , Publish Date - Jul 21 , 2024 | 04:48 PM
డ్రాగన్ కంట్రీ చైనాకు చెందిన ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అతిగా ఆహారం తిని తన ప్రాణాలు పోగొట్టుకుంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 10 గంటలపైనే రకరకాల వంటకాలు..
డ్రాగన్ కంట్రీ చైనాకు (China) చెందిన ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ (Social Media Influencer) అతిగా ఆహారం తిని తన ప్రాణాలు పోగొట్టుకుంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 10 గంటలపైనే రకరకాల వంటకాలు తినడం వల్ల ఆమె మృతి చెందింది. కుటుంబ సభ్యులు ఎంత వారించినా వినకుండా.. ఈటింగ్ ఛాలెంజ్‌ని స్వీకరించి మరీ పరిమితికి మించి ఎక్కువ ఆహారం తినేసింది. అది జీర్ణం కాకపోవడంతో ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ పేరు పాన్ జియోటింగ్. ఆమె వయసు 24 సంవత్సరాలు. రకరకాల ఆహారాలు తింటూ.. ఆ వీడియోలను నెట్టింట్లో పోస్టు చేయడమే ఆమె పని. ఆ వీడియోలు బాగా వైరల్ అవ్వడంతో.. ఆమెకు లక్షల్లో ఫాలోవర్లు వచ్చిపడ్డారు. దీంతో ఆమె రెగ్యులర్‌గా అలాంటి పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకుంది. అంతేకాదు.. ఇతరులతో పోలిస్తే తాను ఎక్కువ ఆహారం తినగలనని పేర్కొంటూ.. ఈటింగ్ ఛాలెంజ్‌లో పాల్గొనేది. ఒకే పూటలో 10 కిలోలకు పైగా ఫుడ్ తినేది. రీసెంట్‌గా మరోసారి ఈ పోటీలో పాల్గొన్న ఆమె.. ఈసారి తాను 10 గంటల పాటు నిర్విరామంగా ఫుడ్ తింటానని సవాల్ చేసింది. అంత ఫుడ్ తింటే మంచిది కాదని కుటుంబ సభ్యులు హెచ్చరించినా.. ఆమె పట్టించుకోలేదు.
ఈ సవాల్‌లో భాగంగా.. లైవ్ స్ట్రీమింగ్ ఆన్ చేసి, భోజనం తినడం స్టార్ట్ చేసింది పాన్. మొదట్లో ఆకలి మీద ఉండటంతో గబగబా తినేసింది. కొద్దిసేపటికే కడుపు నిండిపోయినా.. ఛాలెంజ్ కోసం ఆపకుండా తినడం కంటిన్యూ చేసింది. ఇలా తింటుండగానే ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే.. అప్పటికే పాన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించగా.. ఆమె కడుపులో జీర్ణం కాని ఆహారం ఎక్కువ మోతాదులో ఉన్నట్లు తేలింది. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. అసలు ఈటింగ్ ఛాలెంజ్‌లు ఎందుకు నిర్వహిస్తున్నారంటూ నెటిజన్లు ప్రశ్నలు రేకెత్తుతున్నారు.
Read Latest Prathyekam News and Telugu News