Viral: రీల్స్ మోజు.. యజమానికే ఎసరు.. ఓ పని మనిషి నిర్వాకం తెలిస్తే..
ABN , Publish Date - Jul 21 , 2024 | 08:00 PM
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పుణ్యమా అని.. ఈరోజుల్లో చాలామంది రాత్రికి రాత్రే ఫేమస్ అవుతున్నారు. ఏదైన ఒక రీల్ వైరల్ అయితే చాలు.. లక్షల్లో ఫాలోవర్లు వచ్చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది..
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ (Instagram Reels) పుణ్యమా అని.. ఈరోజుల్లో చాలామంది రాత్రికి రాత్రే ఫేమస్ అవుతున్నారు. ఏదైన ఒక రీల్ వైరల్ అయితే చాలు.. లక్షల్లో ఫాలోవర్లు వచ్చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సెలెబ్రిటీ స్టేటస్‌ని కూడా దక్కించుకున్నారు. ఓ పని మనిషి సైతం అలాగే ఫేమస్ అవ్వాలని ఆశపడింది. రెగ్యులర్‌గా రీల్స్ చేసి.. సోషల్ మీడియా సెన్సేషన్ అవ్వాలని కోరుకుంది. కానీ.. ఇందుకోసం ఆమె తప్పుడు మార్గాన్ని ఎంచుకుంది. తన యజమానికే ఎసరు పెట్టింది. చివరికి కటకటాలపాలయ్యింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో నీతూ యాదవ్ (30) అనే ఓ మహిళ నివసిస్తోంది. ఈమె స్థానికంగా ఓ బంగ్లాలో పని చేస్తోంది. చాలీచాలని జీతంతో బతుకీడ్చడం ఆమెకు కష్టమైపోయింది. దీంతో ఆమె సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అవ్వాలని నిర్ణయించుకుంది. ముందుగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పోస్టు చేయడం ప్రారంభించింది. అయితే.. మొబైల్ కెమెరా అంత నాణ్యతగా లేకపోవడంతో, ఆమె రీల్స్ పెద్దగా వైరల్ అవ్వలేదు. ఈ నేపథ్యంలోనే.. యూట్యూబ్‌లో ఓ ఛానల్ పెట్టి తరచుగా వీడియోలు పోస్ట్ చేస్తే, డబ్బులు బాగా వస్తాయని తెలుసుకుంది. కానీ.. ఇందుకోసం డీఎస్ఎల్ఆర్ కెమెరా కొనుగోలు చేస్తే బాగుంటుందని ఆమెకు కొందరు సిఫార్సు చేశారు. దీంతో.. ఆ కెమెరా కొనాలని నిర్ణయించుకుంది.
అయితే.. ఆ కెమెరా చాలా ఖరీదైంది కావడంతో, అది కొనుగోలు చేసేంత డబ్బు నీతూ వద్ద లేదు. బంధవులను అడిగినా ఎవరూ సహకరించలేదు. దీంతో.. తన యజమాని ఇంట్లోనే దొంగతనం చేయాలని నిర్ణయించుకుంది. సరైన సమయం చూసుకొని.. బంగారం, వెండి సహా విలువైన వస్తువులు తీసుకొని పరారైంది. యజమాని ఇంటికి తిరిగొచ్చి చూడగా.. నగలు కనిపించలేదు. పని మనిషికి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని వచ్చింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమె ఫోన్‌కి కాల్ చేశారు. అది స్విచ్చాఫ్ అని రావడంతో, ఆమె ఇచ్చిన ఇంటి అడ్రస్ వద్దకు వెళ్లారు. చివరికి అది కూడా ఫేక్ అని తేలడంతో.. పోలీసులు ఖంగుతిన్నారు.
అప్పుడు ఇరుగుపొరుగు వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. నీతూ ఢిల్లీ వదిలి వెళ్లిపోయేందుకు ముందుగానే ప్రణాళికలు రచించుకున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో.. సీసీటీవీ కెమెరాలు పరిశీలించడం మొదలుపెట్టారు. అప్పుడే నీతూ ఎక్కడుందో ఆచూకీ తెలియడంతో.. పోలీసులు అప్రమత్తమై ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఫైనల్‌గా ఆమెను అదుపులోకి తీసుకొని, పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చారు. దొంగతనం ఎందుకు చేశావని ప్రశ్నించగా.. యూట్యూబ్ ఛానల్ నడిపేందుకు డీఎస్ఎల్ఆర్ కొనాలని కొందరు సిఫార్సు చేయడంతో.. తన దగ్గర డబ్బుల్లేక ఈ దోపిడీకి పాల్పడినట్లు తెలిపింది.
Read Latest Viral News and Telugu News