Viral: హోటల్ కొంపముంచిన ‘ఊరగాయ’.. ఏకంగా రూ.35 వేల ఫైన్.. అసలేమైందంటే?
ABN , Publish Date - Jul 28 , 2024 | 09:30 PM
ఈమధ్య కాలంలో కొన్ని హోటళ్లు తమ కస్టమర్లకు సరైన సర్వీస్ అందించడం లేదు. ఒక ఒక లోపం ఉండనే ఉంటోంది. నాణ్యత లేని ఆహారం ఇవ్వడం, ఐటమ్స్ మిస్ అవ్వడం...
ఈమధ్య కాలంలో కొన్ని హోటళ్లు తమ కస్టమర్లకు సరైన సర్వీస్ అందించడం లేదు. ఒక ఒక లోపం ఉండనే ఉంటోంది. నాణ్యత లేని ఆహారం ఇవ్వడం, ఐటమ్స్ మిస్ అవ్వడం, ఇంకా రకరకాల తప్పులు చేస్తూనే ఉన్నాయి. తాము ఏం చేసినా చెల్లుతుందనే ధీమాతోనే రెస్టారెంట్లు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఓ హోటల్ కూడా అలాంటి పనే చేసింది. ఓ పార్శిల్‌లో ఊరగాయ ఇవ్వలేదు. దీంతో.. కోర్టు ఆ హోటల్‌కు మొట్టికాయలు వేసింది. రూ.35 వేలు జరిమానా విధించాల్సిందేనని జరిమానా విధించింది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అది 2022 నవంబర్ 28వ తేదీ. విల్లుపురం జిల్లాలోని వలుదారెడ్డి పట్టణానికి చెందిన టై. ఆరోకియాసామి అనే వ్యక్తి.. చనిపోయిన తన బంధువు మొదటి వర్ధంతి సందర్భంగా వృద్ధులకు ఆహారం పంచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అతను బాలమురుగన్ హోటల్‌లో 25 మీల్స్ ఆర్డర్ ఇచ్చాడు. అతనికి మొత్తం బిల్లు రూ.2 వేలు అయ్యింది. అయితే.. ఆ హోటల్ అతనికి చేతిరాతతో ఒక బిల్లు ఇచ్చింది. అందులో.. ఒక్కో ఊరగాయ ప్యాకెట్‌కు రూ.1 చొప్పున డబ్బులు వసూలు చేసినట్లు కూడా రాశారు. తీరా ఇంటికి వెళ్లి చూడగా.. ఊరగాయ మిస్ అయినట్లు అతను గుర్తించాడు. వెంటనే అతను హోటల్ యజమాన్యాన్ని సంప్రదించగా.. తమ సిబ్బంది ఊరగాయ ప్యాకెట్లు వేయడం మర్చిపోయారని తెలిపింది. మరి.. ప్యాకెట్‌కి రూ.1 చొప్పున వసూలు చేసిన రూ.25 తిరిగి ఇవ్వాలని కోరాడు. అందుకు హోటల్ నిరాకరించింది.
దీంతో తీవ్ర కోపాద్రిక్తుడైన కస్టమర్.. దీనిపై విల్లుపురం వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. ఊరగాయ కోసం హోటల్ యాజమాన్యం అదనంగా రూ.25 తీసుకుందని.. అయితే ప్యాకెట్లు ఇవ్వకపోగా తనకు డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన కోర్టు.. హోటల్ యాజమాన్యాన్నే తప్పు పట్టింది. ఊరగాయ ఇవ్వకపోవడం సర్వీసు లోపాలకు సమానమని.. ఇది కస్టమర్‌కు శారీరక, మానసిక కష్టాలను మిగిల్చిందని న్యాయస్థానం తెలిపింది. ఇందుకు పరిహారంగా రూ.30,000, న్యాయపరమైన ఖర్చులకు రూ.5,000లతో పాటు ఊరగాయ ప్యాకెట్ల రూ.25 కలిపి మొత్తం రూ.35,025 కస్టమర్‌కు చెల్లించాలని కోరింది. 45 రోజుల్లోగా ఆ మొత్తం చెల్లించాలని.. లేకపోతే రోజుకు 9 శాతం చొప్పున వడ్డీతో సహా కట్టాల్సి ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
Read Latest Viral News and Telugu News