Viral News: ‘ఉద్యోగం’ పెట్టిన ఫిట్టింగ్.. భర్తకు భార్య వింత కండిషన్.. చివరకు?
ABN , Publish Date - Jun 28 , 2024 | 03:56 PM
ఈరోజుల్లో మహిళలు పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా అన్ని రంగాల్లోనూ సమర్థవంతంగా రాణిస్తున్నారు. ఆర్థిక అవసరాల కోసం తమ పార్ట్‌నర్‌పై ఆధారపడకుండా.. ఉపాధి మార్గాలు చూసుకుంటున్నారు. తాము భర్తల్లో..
ఈరోజుల్లో మహిళలు పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా అన్ని రంగాల్లోనూ సమర్థవంతంగా రాణిస్తున్నారు. ఆర్థిక అవసరాల కోసం తమ పార్ట్‌నర్‌పై ఆధారపడకుండా.. ఉపాధి మార్గాలు చూసుకుంటున్నారు. తాము భర్తల్లో సగభాగమే కాదు.. బాధ్యతల్లోనూ సగభాగం మోయగలమని నిరూపిస్తున్నారు. అయితే.. కొందరు భర్తలకు మాత్రం తమ భార్యలు ఉద్యోగానికి వెళ్లడం ఇష్టం ఉండదు. ఇంట్లోనే హౌస్‌వైఫ్‌గా ఉండాలని కోరుకుంటారు. ఓ భర్త కూడా అదే కోరిక కోరగా.. భార్య అతనికి ఊహించని షాక్ ఇచ్చింది. ఓ వింత కండిషన్ పెట్టింది. అది ఒప్పుకుంటేనే ఉద్యోగం మానేస్తానంటూ తేల్చి చెప్పింది. కానీ.. ఆ తర్వాత ఆమెకు అనుకోని అనుభవం ఎదురైంది. దీంతో ఏం చేయాలో తెలియక.. సోషల్ మీడియాలో తన విషయాలను పంచుకొని, ఏం చేయాలో సలహా ఇవ్వాలని నెటిజన్లను కోరింది.
ఇంతకీ ఆ మహిళ తన పోస్టులో ఏం రాసుకొచ్చిందంటే.. ‘‘నాకు పెళ్లయి 6 సంవత్సరాలు అవుతోంది. మాకు ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం నేను గర్భిణిని. నా భర్త నడుపుతున్న కంపెనీలోనే నేను ఉద్యోగం చేస్తున్నాను. అయితే.. పిల్లల బాగోగులు చూసుకోవడం కోసం నన్ను ఉద్యోగం మానేసి ఇంట్లోని హౌస్‌వైఫ్‌గా ఉండమని నా భర్త చెప్పారు. ఆ మాట వినగానే నేను మానసికంగా కుంగిపోయాను. ఎందుకంటే.. ఎంతో కష్టపడి నేను ఈ ఉద్యోగం సంపాదించాను. భర్త మాట విని ఇప్పుడు ఉద్యోగం వదలుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ.. భవిష్యత్తులో అనుకోకుండా విడాకులు తీసుకోవాల్సి వస్తే, అప్పుడు నాకు ఏ ఆధారం ఉండదు. అందుకే.. బాగా ఆలోచించి, కంపెనీలో సగం వాటా ఇస్తేనే ఉద్యోగం మానేస్తానని చెప్పాను. దాంతో ఆయన ఆశ్చర్యపోయారు. నా స్నేహితులకు కూడా ఈ విషయం చెప్పాను. అప్పుడు వాళ్లు ‘భర్తతో ఇలాగేనా ప్రవర్తించేది’ అంటూ మందలించారు. నేనేమైనా తప్పుగా ఆలోచించానా? సరైన దారిలోనే వెళ్తున్నానా? అని తేల్చుకోలేకపోతున్నా. మీరే నాకు సలహా ఇవ్వాలి’’ అని కోరింది.
సోషల్ మీడియాలో ఈ పోస్టు వైరల్ అవ్వగా.. దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే.. వారిలో చాలామంది ఆమెకు మద్దతు తెలిపారు. నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదేనని, కంపెనీలో వాటా అడగడంలో ఏమాత్రం తప్పు లేదని, నీ భర్తలాగే నీక్కూడా సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తు చాలా అవసరమని కామెంట్లు చేస్తున్నారు. భవిష్యత్తులో అనుకోని కారణాల వల్ల విడాకులు తీసుకుంటే ఓ ఆధారం తప్పనిసరి అని పేర్కొంటున్నారు. ఆమె పెట్టిన ఈ పోస్టు వైరల్ అయ్యిందో లేదో.. ఇంతలోనే మరో పోస్టు పెట్టింది. మొత్తానికి తన భర్త తనకు కంపెనీలో 49% వాటా ఇచ్చేందుకు అంగీకరించారని శుభవార్త తెలిపింది. దీంతో.. నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
Read Latest Viral News and Telugu News