MS Dhoni: 2018లో అనూహ్య సంఘటన.. ఆ రోజు ధోనీ ఏం చేశాడంటే?
ABN , Publish Date - Jan 04 , 2024 | 06:10 PM
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి చాలాకాలమే అవుతున్నా.. అతని క్రేజ్‌కి ఏమాత్రం తగ్గకపోగా...
Mahendra Singh Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి చాలాకాలమే అవుతున్నా.. అతని క్రేజ్‌కి ఏమాత్రం తగ్గకపోగా, ఇంకా పెరుగుతూనే ఉంది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి నాయకత్వం వహిస్తున్న ధోనీ.. ఇప్పటికీ అభిమానుల చేత కీర్తింపబడుతున్నాడు. తాను బ్యాటింగ్ చేయకపోయినా పర్వాలేదు.. కేవలం మైదానంలో కనిపిస్తే చాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారంటే.. అతడ్ని ఎంతలా అభిమానుస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కెప్టెన్ కూల్‌గా ప్రతీ భారతీయుడి మనసులో అతడు వేసిన ముద్ర అలాంటిది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం కూడా.. అతడ్ని మరింత అభిమానించేలా చేసింది. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమే.. ఈ తాజా సంఘటన. ఎంఎస్ ధోనీ వ్యక్తిత్వం ఎలాంటిదో, ఎంత వినయంగా ఉంటాడో.. సురేశ్ పిల్లై అనే చెఫ్ ఎక్స్ వేదికగా పంచుకున్నాడు.
‘‘అది 2018 అక్టోబర్ 31వ తేదీ. అప్పుడు త్రివేండ్రంలో భారత జట్టు వెస్టిండీస్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు ‘ద లీలా కోవలం’ హోటల్‌లో బస చేసింది. ఆ సమయంలో నేను అదే హోటల్‌లో పని చేస్తున్నాను. జట్టు సభ్యులందరూ బస్సు నుంచి కింద దిగే క్షణం నుంచి.. నా కళ్లు కేవలం ఒక వ్యక్తిని వెతుకుతున్నాయి. అతడే ఎంఎస్ ధోనీ. చివరికి అతడు బస్సు నుంచి దిగిన తర్వాత.. తన ట్రేడ్‌మార్క్ చిరునవ్వుతో అందరినీ పలకరించాడు. అందరూ విశ్రాంతి తీసుకున్న తర్వాత.. సాయంత్రం 7 గంటల నుంచి ఆటగాళ్లందరూ ఒక్కొక్కరు తమ డిన్నర్‌ని ఆర్డర్ చేయడం మొదలుపెట్టారు. 9:30 వరకు ఆటగాళ్ల డిన్నర్ వాళ్ల రూమ్‌కి చేరుకుంది. దాదాపు ప్రతిఒక్కరూ సీఫుడ్ ఆర్డర్ చేశారు. కానీ.. నేను మాత్రం ధోనీ పిలుపు కోసమే వేచి చూస్తున్నాను. ఎట్టకేలకు రాత్రి 10 గంటలకు ధోనీ నుంచి పిలుపు రానే వచ్చేసింది. ‘‘చెఫ్, మిమ్మల్ని ధోనీ పిలుస్తున్నారు’’ అని నాకు సందేశం అందింది. అప్పుడు నేను ఒక క్షణం వరకూ స్తంభించిపోయాను. ఆ తర్వాత తేరుకొని, నా చేతిలో ఉన్నవన్నీ పడేసి, మూడో ఫ్లోర్‌కి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాను’’.
‘‘ధోనీ రూమ్‌కి చేరుకున్న తర్వాత తలుపు తట్టాను. ధోనీ డోర్ తీసి ‘హై చెఫ్! ఎలా ఉన్నారు? డిన్నర్‌లో ఏం చేశారు?’ అని అడిగారు. అప్పుడు నేను సీఫుడ్ లిస్ట్ చూపించగా.. ‘నేను సీఫుడ్ తినను, అది నాకు అలెర్జీ. నాకు చికెన్ కూర, అన్నం దొరుకుతుందా? గొంతు నొప్పిగా ఉంది కాబట్టి, కొంచెం కారం రసం కూడా కావాలి’ అని ధోనీ బదులిచ్చారు. దాదాపు 20 నిమిషాల్లో నేను మొత్తం సిద్ధం చేసి, ఫుడ్ తీసుకొని ధోనీ రూమ్‌కి వెళ్లాను. చెట్టినాడ్ చికెన్, బాస్మతి రైస్, కాల్చిన పప్పడం, కారం రసాన్ని ఆయనకు వడ్డించాను. మరుసటి రోజు ఉదయం ధోనీ జిమ్‌కి వెళ్తున్నప్పుడు.. నా వద్దకు వచ్చి ‘డిన్నర్ బాగుంది’ అని చెప్పాడు. అప్పుడు నేను ఆకాశంలో తేలియాడుతున్నట్టు అనిపించింది. అలాంటి అనుభూతిని నేనెప్పుడూ ఆస్వాదించలేదు. నా బిగ్గెస్ట్ ఐడల్స్‌లో ఒకరికి భోజనం తినిపించి, సంతోషపెట్టగలిగాను. ఈ అనుభూతి నా కెరీర్‌లోనే హైలైట్‌గా ఉండిపోయింది’’ అంటూ సురేశ్ పిల్లై తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. మరోసారి ధోనీకి సేవ చేసే అవకాశం కోసం తాను వేచి చూస్తున్నానని ఆయన చెప్పుకొచ్చాడు.