Schools buses seize: హైదరాబాద్ పరిధిలో 86 స్కూల్ బస్సులు సీజ్
ABN, Publish Date - Jun 13 , 2024 | 03:47 AM
ఫిట్‌నెస్, అనుమతి పత్రాలు లేని స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో బుధవారం విద్యార్థులను స్కూళ్లకు చేరవేస్తున్న బస్సులను ఆపి విస్తృత స్థాయిలో తనిఖీ చేశారు. పదుల సంఖ్యలో బస్సు లు ఫిట్‌గా లేవని, ఇంకొన్నింటికి అనుమతి లేదని, మరికొన్నింటిని పన్ను చెల్లించకుండా తిప్పుతున్నారని గుర్తించారు.
రవాణా శాఖ తనిఖీల్లో ఫిట్‌నెస్,
పర్మిట్లు లేని వాహనాల గుర్తింపు
తనిఖీలకు ప్రత్యేక బృందాల ఏర్పాటు
డ్రైవర్ల అనుభవం, అర్హత పరిశీలన
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, జూన్ 12(ఆంధ్రజ్యోతి): ఫిట్‌నెస్, అనుమతి పత్రాలు లేని స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో బుధవారం విద్యార్థులను స్కూళ్లకు చేరవేస్తున్న బస్సులను ఆపి విస్తృత స్థాయిలో తనిఖీ చేశారు. పదుల సంఖ్యలో బస్సు లు ఫిట్‌గా లేవని, ఇంకొన్నింటికి అనుమతి లేదని, మరికొన్నింటిని పన్ను చెల్లించకుండా తిప్పుతున్నారని గుర్తించారు. హైదరాబాద్ జిల్లాలో 25, రంగారెడ్డిలో 46, మేడ్చల్‌లో 15 మొత్తం 86 బస్సులు సీజ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 23 వేలకు పైగా ఉన్న స్కూల్ బస్సుల్లో ఇప్పటి వరకు సగం బస్సులకు కూడా యాజమాన్యాలు ఫిట్‌నెస్ పరీక్షలు చేయించలేదని తెలిసింది. ఫిట్‌నెస్, పర్మిట్లపై ఆయా జిల్లాల్లో రవాణా శాఖ అధికారులు లేఖలు రాసినా యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో రవాణా శాఖ ప్రత్యేక తనిఖీ బృందాలు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ జిల్లాలో జాయింట్ కమిషనర్ సీ రమేష్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో డిప్యూటీ కమిషనర్ మామిడ్ల చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ బృందాలు తనిఖీలు నిర్వహించాయి.
హైదరాబాద్ జిల్లాలో 19 బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేదని, మరో ఆరు బస్సులకు పన్ను చెల్లించలేదని, అనుమతి లేదని రమేష్ తెలిపారు. ఇక ముందు కూడా తనిఖీలు కొనసాగుతాయని చంద్రశేఖర్‌గౌడ్ చెప్పారు. 15 సంవత్సరాలు దాటిన వాహనాలు రోడ్లపైకి రావొద్దని, 60 యేళ్లలోపు వయస్సు ఉండి, అర్హత ఉన్న వారినే డ్రైవర్లుగా నియమించాలని సూచించారు. పన్ను చెల్లించని బస్సులకు త్రైమాసికం ముగింపు నెల కావడంతో పెనాల్టీగా రెట్టింపు పన్ను విధించామని ఉప్పల్ ఆర్టీవో వాణి తెలిపారు.
కాలంచెల్లిన వాహనాలూ..!
గ్రేటర్‌లోని మూడు జిల్లాల్లో అధికారిక లెక్కల ప్రకారం 12,631 విద్యా సంస్థల బస్సులున్నాయి. ఇప్పటివరకు 9,578 బస్సులు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోగా మరో 2,873 వాహనాలు ఇప్పటి వరకు దరఖాస్తు చేయలేదు. 8 వాహనాల దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు.
Updated Date - Jun 13 , 2024 | 03:47 AM