ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత కరెంట్‌!

ABN, Publish Date - Jun 24 , 2024 | 03:32 AM

రాష్ట్రంలోని ప్రభుత్వ విద్య, వైద్య సంస్థలన్నింటికీ త్వరలో ఉచితంగా విద్యుత్తు సరఫరా కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలతోపాటు జూనియర్‌ కాలేజీలు, ఐటీఐలు, డిగ్రీ, పీజీ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, పాలిటెక్నిక్‌లు, గురుకులాలు, హాస్టళ్లు,

  • ఇతర సర్కారు విద్య, వైద్య సంస్థలన్నింటికి కూడా.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలో ఉత్తర్వులు

  • వచ్చే బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు

  • సంస్థల విభాగాధిపతులకు బిల్లులు

  • నెలనెలా చెల్లింపుల బాధ్యత వీరిదే

హైదరాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ విద్య, వైద్య సంస్థలన్నింటికీ త్వరలో ఉచితంగా విద్యుత్తు సరఫరా కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలతోపాటు జూనియర్‌ కాలేజీలు, ఐటీఐలు, డిగ్రీ, పీజీ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, పాలిటెక్నిక్‌లు, గురుకులాలు, హాస్టళ్లు, నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌)కు కూడా ఉచితంగా విద్యుత్తు సరఫరా చేయాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద వర్గాలకు 200 యూనిట్ల దాకా ఉచితంగా విద్యుత్తు అందిస్తున్న విషయం తెలిసిందే. రానున్న బడ్జెట్‌లో ప్రభుత్వ విద్య, వైద్య సంస్థలకు కూడా ఉచిత విద్యుత్తుకు సంబంధించి కేటాయింపులు చేసే అవకాశం ఉంది.


ఈ సంస్థలకు ఉచిత విద్యుత్తు కల్పించేందుకుగాను ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్గదర్శకాలపై ఇంధనశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే ఉచిత విద్యుత్తు అమల్లోకి రానుంది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకు సకాలంలో నిధులు విడుదల కాకపోతుండడంతో కరెంట్‌ బిల్లులు చెల్లించకలేక అవి ఇబ్బంది పడుతున్నాయి. తాజా నిర్ణయంతో ఆ సమస్య తీరనుంది. ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తు సరఫరా కోసం డిస్కమ్‌లు(దక్షిణ, ఉత్తర డిస్కమ్‌లు) ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను డిజైన్‌ చేస్తున్నాయి. విద్యాసంస్థలు ఏ విభాగాధిపతి (హెచ్‌వోడీ) పరిధిలోకి వస్తే ఆ విభాగాధిపతి ఆ పోర్టల్‌లోకి లాగిన్‌ అయి.. తమ శాఖ పరిధిలోని విద్యాసంస్థల వివరాలను వెబ్‌పోర్టల్‌లో చేర్చడం/తొలగించడంవంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.


నెలనెలా బిల్లులు ఇన్‌చార్జులకే..

విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తు సరఫరా చేసినా.. ప్రతినెలా క్రమం తప్పకుండా మీటర్‌ రీడింగ్‌ తీసి బిల్లులను ఆ సంస్థల ఇన్‌చార్జులకు అందజేస్తారు. ప్రాథమిక/ప్రాథమికోన్నత/ఉన్నత పాఠశాలలకు అయితే మండల విద్యాధికారి (ఎంఈవో)కి కరెంట్‌ బిల్లులు అందజేస్తారు. ఉచిత విద్యుత్తు దుర్వినియోగం కాకుండా అరికట్టేందుకు వీలుగా వీరు పర్యవేక్షించనున్నారు. కాగా, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు సంబంధించిన బిల్లులను ఆయా విభాగాధిపతులు తమ శాఖ బడ్జెట్‌ నిధుల నుంచి ప్రతి నెలా డిస్కమ్‌లకు చెల్లిస్తారు.


వీరు తమ శాఖ పరిధిలోని విద్యా సంస్థల విద్యుత్తు వినియోగం, బిల్లుల మొత్తం, గత కాలానికి సంబంధించిన వినియోగ చరిత్ర, జారీ అయిన బిల్లులు, జరిపిన చెల్లింపులు, చెల్లించాల్సిన బకాయిలు వంటి సమాచారంతో కూడిన నివేదికలను వెబ్‌పోర్టల్‌లో చూసుకునే వీలుంటుంది. విద్యాసంస్థ, మండలం, జిల్లా వారీగా కూడా ఈ నివేదికలు ఆన్‌లైన్‌లో జనరేట్‌ కానున్నాయి. సంబంధిత విభాగాధిపతులు బడ్జెట్‌ కేటాయింపుల నుంచి విద్యుత్తు బిల్లులు చెల్లించడానికి వీలుగా పోర్టల్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖతో అనుసంధానం చేయనున్నారు. మొత్తంగా 30,200 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 450 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, 268 దాకా ఎస్సీ గురుకులాలు, 183 దాకా ఎస్టీ గురుకులాలు, 265 బీసీ గురుకులాలు, 204 మైనారిటీ గురుకులాలు, 26 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు ఉచిత విద్యుత్తు అందనుంది.


విద్యా సంస్థ కరెంట్‌ బిల్లులు చెల్లించే అధికారి

ప్రభుత్వ పాఠశాలలు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు

జూనియర్‌ కాలేజీలు ఇంటర్‌ బోర్డు డైరెక్టర్‌

డిగ్రీ/పీజీ కాలేజీలు కళాశాల విద్య కమిషనర్‌

ఐటీఐలు ఉపాధి కల్పన, శిక్షణ శాఖ కమిషనర్‌

విశ్వవిద్యాలయాలు ఉపకులపతులు

వైద్య కళాశాలలు వైద్య విద్యశాఖ డైరెక్టర్‌

పాలిటెక్నిక్‌ కళాశాలలు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌

బీసీ వసతి గృహాలు బీసీ సంక్షేమశాఖ సంచాలకులు

బీసీ గురుకులాలు బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ

ఎస్సీ హాస్టళ్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు

ఎస్సీ గురుకులాలు ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ

ఎస్టీ హాస్టళ్లు గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు

ఎస్టీ గురుకులాలు ఎస్టీ గురుకుల విద్యాలయాల సంస్థ

మైనారిటీ గురుకులాలు మైనారిటీ విద్యాలయాల సంస్థ

నిమ్స్‌ డైరెక్టర్‌ నిమ్స్‌

Updated Date - Jun 24 , 2024 | 03:32 AM

Advertising
Advertising