Share News

Police Incident: ఎక్సైజ్‌ సిబ్బంది నుంచి తప్పించుకోబోయి..

ABN , Publish Date - Aug 06 , 2024 | 04:26 AM

ఓ అవగాహన కార్యక్రమం కోసం బస్తీలోకి పోలీసులు రావడం చూసి.. తననే పట్టుకునేందుకు వచ్చారని భయపడ్డాడో ఆటోడ్రైవర్‌! అంతే.. పరుగు లంఘించుకున్నాడు.

Police Incident: ఎక్సైజ్‌ సిబ్బంది నుంచి తప్పించుకోబోయి..

  • నాలుగో అంతస్తు నుంచి పడ్డ ఆటోడ్రైవర్‌

  • తీవ్ర గాయాలు.. చికిత్స పొందుతూ మృతి

  • గంజాయి తాగిన తనను పట్టుకునేందుకే వచ్చారన్న భయంతోనే పరుగులు

  • సైదాబాద్‌లో ఘటన

సైదాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఓ అవగాహన కార్యక్రమం కోసం బస్తీలోకి పోలీసులు రావడం చూసి.. తననే పట్టుకునేందుకు వచ్చారని భయపడ్డాడో ఆటోడ్రైవర్‌! అంతే.. పరుగు లంఘించుకున్నాడు. అసలే పోలీసులు కదా..? డౌటొచ్చేసింది. ఎందుకు పారిపోతున్నాడో తెలుసుకునేందుకు అతడిని అనుసరించారు. చూస్తుండగానే ఓ భవనంపై ఎక్కేసిన ఆ ఆటోడ్రైవర్‌ అక్కడి నుంచి ప్రమాదవశాత్తు కింద పడి మృతిచెందాడు. సైదాబాద్‌ పరిధిలోని సింగరేణి వాంబే కాలనీలో ఈ ఘటన జరిగింది.


మృతుడు అదే కాలనీకి చెందిన ఆటో డ్రైవర్‌ ఖలీం పాషా(28). శనివారం మధ్యాహ్నం ఖలీం పాషా ఇంటి సమీపంలో కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో అతడు గంజాయి మత్తులో ఉన్నట్లు సమాచారం. ఎక్సైజ్‌ పోలీసులు డ్రగ్స్‌ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించేందుకు అక్కడికి వచ్చారు. వారిని చూసిన ఖలీం భాషా, భయంతో పరుగెత్తి సమీపంలోని బిల్డింగ్‌ ఎక్కాడు. ఖలీంపాషా ఎందుకు పరుగులు తీశాడో ఆర్థం కాని పోలీసులు అతడిని పట్టుకునేందుకు ఒక ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ను భవనంపైకి పంపారు.


ఆ కానిస్టేబుల్‌ తనను పట్టుకుంటాడన్న ఆందోళనతో ఖలీం పాషా నాలుగో అంతస్తు నుంచి డ్రైనేజీ పైప్‌ లైన్‌ పట్టుకుని కిందకు దిగేందుకు యత్నించాడు. పట్టు తప్పడంతో కిందపడ్డాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కాగా సింగరేణి కాలనీలో విచ్చలవిడిగా కొనసాగుతున్న గంజాయి అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చంపాపేట ప్రధాన రహదారిపై మహిళలు బైఠాయించారు ఫలితంగా అక్కడ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Updated Date - Aug 06 , 2024 | 04:26 AM