CM Revanth Reddy: ధైర్యం ఉంటేనే ఎదుగుతాం..
ABN, Publish Date - Oct 21 , 2024 | 03:45 AM
ధైర్యం ఉండి, త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉంటే.. ఏదైనా సాధించవచ్చని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం ప్రజలతో నిత్యం సంబంధాలు పెట్టుకోవాలని,
గొప్ప పనులు చేయాలంటే రిస్క్ తీసుకోవాలి
త్యాగానికి సిద్ధపడితే ఏదైనా సాధించవచ్చు
ట్రిలియన్ డాలర్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
న్యూయార్క్, లండన్, టోక్యోతో హైదరాబాద్ పోటీ పడాలి
ఎక్కడికి వెళ్లినా ఏ హోదాలో ఉన్నా.. రెండేళ్లు తెలంగాణకు కేటాయించండి
కార్పొరేట్ స్థాయి జీతం ఇవ్వలేకపోవచ్చు గొప్ప అవకాశాలు మాత్రం కల్పిస్తాం
ఐఎస్‌బీ లీడర్‌షిప్ సమ్మిట్‌లో సీఎం రేవంత్
హైదరాబాద్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ధైర్యం ఉండి, త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉంటే.. ఏదైనా సాధించవచ్చని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం ప్రజలతో నిత్యం సంబంధాలు పెట్టుకోవాలని, పేదలు-ధనికులు, బలవంతుడు-బలహీనుడు, చిన్నా-పెద్దా అన్న భేదం లేకుండా అందరికీ సమాన గౌరవం ఇస్తూ అందరిని కలుపుకొని పోవాలని చెప్పారు. గొప్ప నాయకులు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు. ఆదివారం గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎ్‌సబీ)లో నిర్వహించిన లీడర్‌షిప్ సమిట్‌లో ముఖ్యమంత్రి పాల్గొని ‘లీడర్‌షిప్ ఇన్ న్యూ ఇండియా’ అనే అంశంపై ప్రసంగించారు.
‘‘కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన వారసత్వం ఉంది. మహాత్మా గాంధీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్‌సింగ్ వంటి నాయకులే దీనికి ఉదాహరణ. వీరందరి నుంచి మనం చాలా నేర్చుకోగలం. ఎంతటి గొప్ప నాయకుడికైనా ధైర్యం చాలా ముఖ్యం. తెలివితేటలు, నైపుణ్యం, కష్టపడి పనిచేయడంతోపాటు కొన్నిసార్లు అదృష్టం కూడా అవసరం. గొప్ప పనులు చేయడానికి రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోకుండా కొన్ని సాధించలేం. మన పోరాటంలో మనం చాలా కోల్పోవచ్చు.
దేశంలోని గొప్ప కాంగ్రెస్ నాయకులు, ప్రజల కోసం తమ వృత్తిని, డబ్బును, సుఖాలను, స్వేచ్ఛతో పాటు వారి జీవితాన్ని కూడా త్యాగం చేశారు’’ అని ముఖ్యమంత్రి వివరించారు. హైదరాబాద్ నగరం దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడటం తనకు ఇష్టం లేదని, ప్రపంచస్థాయి నగరాలతో పోటీ పడాలని అన్నారు. న్యూయార్క్, లండన్ పారిస్, టోక్యో, సియోల్ లాంటి అంతర్జాతీయ నగరాలతో హైదరాబాద్ పోటీపడాలన్నది తన ఆకాంక్ష అని తెలిపారు. ఇది కష్టం కావచ్చునేమో గానీ.. అసాధ్యం కాదని పేర్కొన్నారు.
ఎక్కడికెళ్లినా తెలంగాణ గురించి చెప్పండి..
‘‘ఐఎ్‌సబీ విద్యార్థులుగా మీరు తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌లు. తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల జీడీపీ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నదే మా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే హైదరాబాద్‌ను 600 బిలియన్ డాలర్ల నగరంగా మార్చాలి. దీనికి మీలాంటి అందరి సహకారం కావాలి. తెలంగాణను ప్రపంచంలోని ప్రతి భాగానికి తీసుకెళ్లడానికి మీ సహాయం కావాలి. మీరు ఎక్కడికి వెళ్లినా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, సామాన్య ప్రజలతో తెలంగాణ గురించి, హైదరాబాద్ గురించి మాట్లాడండి. మీరు ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల్లో పనిచేయవచ్చు. సొంతంగా కంపెనీలు స్థాపించవచ్చు. ఎక్కడికెళ్లినా, ఏ హోదాలో ఉన్నా.. జీవితంలో రెండు మూడేళ్లు తెలంగాణకు కేటాయించండి.
తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయండి. కార్పొరేట్ కంపెనీల్లాగా ప్రభుత్వం మీకు పెద్ద పెద్ద వేతనాలు ఇవ్వకపోవచ్చు. కానీ, మీలాంటి యువ మేధస్సులకు గొప్ప సవాళ్లు, అనేక అవకాశాలు మాత్రం ఇవ్వగలను’’ అని రేవంత్ చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. దీనికి ప్రముఖ పారిశ్రామికవేత ఆనంద్ మహీంద్ర చైర్మన్‌గా, శ్రీనిరాజు కో చైర్మన్‌గా ఉన్నారని చెప్పారు. అలాగే ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు సాధించడమే లక్ష్యంగా స్పోర్ట్స్ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌ను రాష్ట్రంలోని ఇతర నగరాలకు ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నదే తన ఆలోచన అని, దీనికి అందరి సహాయ సహకారాలు కావాలని కోరారు.
Updated Date - Oct 21 , 2024 | 03:45 AM