Share News

CM Revanth Reddy: హిందూ ముస్లింలు 2 కళ్లు

ABN , Publish Date - Nov 12 , 2024 | 03:28 AM

హిందూ, ముస్లిములు తెలంగాణ ప్రభుత్వానికి రెండు కళ్లు వంటివారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. మీరంతా అండగా ఉంటే.. విద్య, వైద్యం, ఉపాధి విషయాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళతానని చెప్పారు.

CM Revanth Reddy: హిందూ ముస్లింలు 2 కళ్లు

  • వైషమ్యాలు రెచ్చగొడుతున్న మోదీ పరివార్‌

  • సమైక్యతకు కృషి చేస్తున్న గాంధీ పరివార్‌

  • ఎవరు కావాలో మైనారిటీలే తేల్చుకోవాలి

  • ముస్లింలు మాకు ఓటర్లు కాదు.. కుటుంబం

  • జాతీయ విద్యా, మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): హిందూ, ముస్లిములు తెలంగాణ ప్రభుత్వానికి రెండు కళ్లు వంటివారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. మీరంతా అండగా ఉంటే.. విద్య, వైద్యం, ఉపాధి విషయాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళతానని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంలో మైనారిటీలు కీలక పాత్ర పోషించారని చెప్పారు. జాతీయ విద్యా, మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకలను సోమవారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెబ్‌సైట్‌, ఆన్‌ లైన్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ సెంటర్‌ ప్రారంభించారు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఉన్నవి రెండే పరివార్‌లు. ఒకటి మోదీ పరివార్‌.. రెండోది గాంధీ పరివార్‌. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు మోదీ పరివార్‌ పని చేస్తోంది. దేశ సమైక్యతకు గాంధీ పరివార్‌ కృషి చేస్తోంది’’ అని వివరించారు.


ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా మైనారిటీలకు కాంగ్రెస్‌ పార్టీ అవకాశం ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రాంతీయ పార్టీలకు ఓట్లు వేస్తే... కేంద్రంలో మోదీకి మద్దతు ఇస్తాయని చెప్పారు. మోదీ పరివార్‌తో ఉండాలో గాంధీ పరివార్‌తో ఉండాలో నిర్ణయించుకోవాలని మైనారిటీలకు సూచించారు. ముస్లిములు అప్పుడప్పుడు కాంగ్రెస్‌ పార్టీపై అలుగుతారని, వారిని తాము ఓటర్లుగా చూడటం లేదని, సోదరులుగా, కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మైనారిటీని కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోలేదని, అందుకే మైనారిటీ మంత్రి ఇచ్చే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. అయినా, షబ్బీర్‌ అలీని ప్రభుత్వ సలహాదారుగా చేశామని, నాలుగు ఎమ్మెల్సీల్లో ఒకటి అమీర్‌ అలీ ఖాన్‌కు ఇచ్చామని గుర్తు చేశారు. ఎనిమిది కార్పొరేషన్లలో మైనారిటీలకు అవకాశాలు ఇచ్చామని, వైఎస్‌ తర్వాత మళ్లీ ఇప్పుడు సీఎంవోలో మైనారిటీ అధికారిని నియమించామని తెలిపారు.

Updated Date - Nov 12 , 2024 | 03:28 AM