Share News

CM Revanth Reddy: దళిత బిడ్డను అధ్యక్షా అనలేకే కేసీఆర్‌ గైర్హాజరు

ABN , Publish Date - Aug 02 , 2024 | 04:16 AM

దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మోసగించిన, దళితుడిని ఉప ముఖ్యమంత్రి చేసి బర్తరఫ్‌ చేసిన ఘనత కేసీఆర్‌దైతే.. సోనియాగాంధీ నేతృత్వంలో దళిత బిడ్డను స్పీకర్‌ను చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీది అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

CM Revanth Reddy: దళిత బిడ్డను అధ్యక్షా అనలేకే కేసీఆర్‌ గైర్హాజరు

  • కాంగ్రెస్‌ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు

  • నన్ను నమ్ముకున్న అక్కలు.. మంత్రులు అయ్యారు

  • మీరు నమ్ముకున్న వ్యక్తి.. సొంత చెల్లెలు జైల్లో ఉంది

  • మమ్మల్ని లోపలెయ్యొద్దు.. కావాలంటే మా చెల్లెల్ని

  • మరో ఏడాది జైల్లోనే ఉంచాలన్న నీచులు వాళ్లు

  • సబిత, సునీత నిరసన సందర్భంగా సీఎం వ్యాఖ్య

హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మోసగించిన, దళితుడిని ఉప ముఖ్యమంత్రి చేసి బర్తరఫ్‌ చేసిన ఘనత కేసీఆర్‌దైతే.. సోనియాగాంధీ నేతృత్వంలో దళిత బిడ్డను స్పీకర్‌ను చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీది అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దళిత బిడ్డను అధ్యక్షా అని సంబోధించడం ఇష్టం లేకే ఆయన సభకు గైర్హాజరవుతున్నారని మండిపడ్డారు. స్పీకర్‌ అక్కడ కూర్చుంటే ఆయన కింద కూర్చోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే సభకు రావడం లేదని ఆరోపించారు. దళితుల్ని మోసం చేసిన కేసీఆర్‌ అసెంబ్లీలో మాట్లాడాలంటే... అధ్యక్షా మైక్‌ ఇవ్వండంటూ అడ్డుక్కునే పరిస్థితికి తీసుకువచ్చామని పేర్కొన్నారు. కేసీఆర్‌కు కాంగ్రెస్‌ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.


అసెంబ్లీలో స్కిల్‌ వర్సిటీ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. అక్కలను అడ్డం పెట్టుకుని బీఆర్‌ఎస్‌ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. సభలో అంశాల వారీగా మాట్లాడకుండా... అన్నీ కలగాపులగం చేస్తోందని మండిపడ్డారు. రైతు రుణ మాఫీ రెండో విడత నిధులు విడుదల చేస్తే... సభలో ఆ చర్చే జరగకుండా చేసిందని విమర్శించారు. ‘‘సబిత, సునీతా లక్ష్మారెడ్డిని నా సొంత అక్కలుగా భావించా. ఒక అక్క నడిబజారులో వదిలేసినా నేను ఏం అనలే. ఇంకో అక్క ఎన్నికల ప్రచారానికి వెళ్తే రెండు కేసులు అయినయి. ఈ రోజుకు కోర్టుల చుట్టు తిరుగుతున్నా. ఆదివాసీ బిడ్డ సీతక్క గురించి సోషల్‌ మీడియాలో మీమ్స్‌ చూస్తే.. అలా పెట్టిన వాళ్లను సబిత, సునీతలే చెప్పుతో కొడతారు.


ఇదేనా నీతి.. ఇంత నీచ రాజకీయాలకు పాల్పడతారా? ఎవరి ఉచ్చులో పడి మీరు తప్పుదోవ పడుతున్నారో వాళ్ల సొంత చెల్లే తీహార్‌ జైల్లో ఉంది. మమ్మల్ని మాత్రం లోపలెయ్యద్దు.. అవసరమైతే మా చెల్లెల్ని మరో ఏడాది లోపల పెట్టండని బేరసారాలు చేసుకున్న నీచులు వాళ్లు. ఈ తమ్ముడ్ని నమ్ముకున్న అక్కలు మంత్రులై ముందు వరుసలో ఉన్నారు. ఆ దిక్కుమాలిన తమ్ముడ్ని నమ్ముకున్న అక్కల పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసు’’ అని వ్యాఖ్యానించారు. అక్కల్ని అవమానించేంత నీచ సంస్కృతి తనది కాదని అన్నారు. దొర పన్నిన కుట్రలో చిక్కుకున్న అక్కలు.. అక్కడ ఉండలేక, బయటకు రాలేక ఇబ్బంది పడుతున్నారని, మీరైనా దారి చూపాలని స్పీకర్‌ను కోరారు.

Updated Date - Aug 02 , 2024 | 04:16 AM