Share News

CM Revanth Reddy: గుడెందొడ్డి రిజర్వాయర్‌ సామర్థ్యం పెంపు

ABN , Publish Date - Sep 27 , 2024 | 03:10 AM

జవహర్‌ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో కట్టిన గుడెందొడ్డి రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 1.5 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచే ప్రతిపాదనలు పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిఅధికారులను ఆదేశించారు.

CM Revanth Reddy: గుడెందొడ్డి రిజర్వాయర్‌ సామర్థ్యం పెంపు

  • 1.5 టీఎంసీల నుంచి 15 టీఎంసీల మేర పెంపునకు సీఎం అంగీకారం

  • ప్రాధాన్య ప్రాజెక్టులకు ప్రతీనెల నిధులు: సీఎం రేవంత్‌.. 240 కోట్లు అవుతాయని అంచనా

హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జవహర్‌ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో కట్టిన గుడెందొడ్డి రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 1.5 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచే ప్రతిపాదనలు పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిఅధికారులను ఆదేశించారు. జూరాల రిజర్వాయర్‌ ప్రాజెక్టుపై ఉన్న 7 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంలో భాగంగా గుడెందొడ్డి రిజర్వాయర్‌ సామర్థ్యం పెంపునకు తగిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. రిజర్వాయర్‌ సామర్థ్యం పెంపునకు రూ.4500 కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల దాకా ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేశారు. నీటిపారుదల శాఖ కార్యాలయంలోని జలసౌధలో రేవంత్‌రెడ్డి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి, ప్రాధాన్య ప్రాజెక్టులపై సమీక్ష చేశారు.


రేలంపాడు రిజర్వాయర్‌లో సీపేజీ భారీగా ఉండటంతో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఉందని, దీనికి కర్టైన్‌ గ్రౌటింగ్‌ చేస్తే సీపేజీ తగ్గుముఖం పడుతుందని అధికారులు గుర్తు చేయగా మరమ్మతులు చేసి, రిజర్వాయర్‌ సామర్థాన్ని 2 టీఎంసీల నుంచి 4 టీఎంసీలకు పెంచాలని ఆదేశించారు. శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంకు కెనాల్‌లో భాగంగా 7.5 టీఎంసీల సామర్థ్యం కలిగిన నక్కలగండి రిజర్వాయర్‌కు అటవీ భూమి సేకరణతో పాటు పునరావాసం, పునర్‌నిర్మాణ సమస్యలున్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. సమస్యలను పరిష్కరించి, పనులను వేగిరం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి చెందిన ఐదు మోటార్లు నడవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.


ప్రతీనెల రూ.240 కోట్లను ప్రాధాన్య ప్రాజెక్టుల కోసం విడుదల చేస్తామని, దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న మేజర్‌, మీడియం ప్రాజెక్టులలో పూడికతీతపై ఇతర రాష్ర్టాలు అనుసరిస్తున్న విధానాలు పరిశీలించాలని సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. చిన్న కాళేశ్వరం, మోడికుంటవాగు, లోయర్‌ పెన్‌గంగా, చనఖా కొరటా, జేచొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం, ఎల్లంపల్లి ప్రాజెక్టు, కోయిల్‌ సాగర్‌ లిఫ్ట్‌, జవహర్‌ నెట్టెంపాడు లిఫ్ట్‌, రాజీవ్‌ భీమా లిఫ్ట్‌, ఎలిమినేటి మాధవరెడ్డి ఎస్‌ఎల్‌బీసీ, డిండి లిఫ్ట్‌, ఎస్సారెస్పి-2, నీల్వాయి, సదర్‌మట్‌ బ్యారేజీ, పాలెంవాగు ప్రాజెక్టులను వీలైనంత తొందరగా పూర్తి చేసేందుకు అవకాశాలున్నాయని ఈ సమావేశంలో ఇరిగేషన్‌ అధికారులు పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు.

Updated Date - Sep 27 , 2024 | 03:10 AM