Share News

CM Revanth Reddy: సర్కారు బడుల్లో .. సెమీ రెసిడెన్షియల్‌!

ABN , Publish Date - Jun 11 , 2024 | 02:52 AM

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సెమీ రెసిడెన్షియల్‌ విధానాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రెసిడెన్షియల్‌ స్కూళ్ల వల్ల తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధాలు బలహీనపడుతున్నట్లుగా ఒక అధ్యయనంలో తేలిందని, అందుకే దీనిపై ఆలోచిస్తున్నామని అన్నారు.

CM Revanth Reddy: సర్కారు బడుల్లో .. సెమీ రెసిడెన్షియల్‌!

  • కొత్త విధానాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం

  • రెసిడెన్షియల్‌ స్కూళ్ల వల్ల తల్లిదండ్రులు,

  • పిల్లల మధ్య బంధాలు బలహీనపడుతున్నాయి

  • ఇది సామాజిక సమస్యగా మారే ప్రమాదం

  • మోదీ, బాబు, నేను సర్కారు బడుల్లోనే చదువుకున్నాం

  • సింగిల్‌ టీచర్‌ స్కూళ్లను కొనసాగిస్తాం: సీఎం రేవంత్‌

  • పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు..

  • వందేమాతరం ఫౌండేషన్‌ ప్రతిభా పురస్కారాల ప్రదానం

రవీంద్రభారతి, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సెమీ రెసిడెన్షియల్‌ విధానాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రెసిడెన్షియల్‌ స్కూళ్ల వల్ల తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధాలు బలహీనపడుతున్నట్లుగా ఒక అధ్యయనంలో తేలిందని, అందుకే దీనిపై ఆలోచిస్తున్నామని అన్నారు. విద్యార్థులు గురుకుల స్కూళ్ల కంటే గ్రామాల్లోని పాఠశాలల్లో చదువుకుంటేనే తల్లిదండ్రులకు దగ్గరగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ.. మట్టిలో మాణిక్యాల్లా రాణించే విద్యార్థులు తెలంగాణకు గర్వకారణమన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో, ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవారేనని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబుతోపాటు తాను కూడా సర్కారు బడిలో చదువుకున్న వాళ్లమేనని తెలిపారు.


దేశంలోని 90 శాతం మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యనభ్యసించి పట్టుదలతో ఉన్నతస్థాయికి ఎదిగారని అన్నారు. సోమవారం.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన 230 మంది విద్యార్థులకు వందేమాతరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌ చేతులమీదుగా ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణలో ప్రైవేట్‌ స్కూళ్లలో చదివే పిల్లలతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీపడి ఎదుగుతుండడం సంతోషం కలిగిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల ద్వారానే తెలంగాణ పునర్నిర్మాణం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చాటి తమ ప్రభుత్వ గౌరవాన్ని పెంచారని ప్రశంసించారు. నిజానికి ఈ సత్కారం తామే అధికారికంగా చేస్తే బాగుండేదని, వందేమాతరం ఫౌండేషన్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తమ బాధ్యతను గుర్తు చేసిందని అన్నారు.


యథావిధిగా సింగిల్‌ టీచర్‌ స్కూళ్లు

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏకోపాధ్యాయ పాఠశాలలను విద్యార్థులు లేరనే సాకుతో మూసివేసిందని సీఎం రేవంత్‌ విమర్శించారు. మౌలిక వసతులపై దృష్టి పెట్టనందునే అలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. తమ ప్రభుత్వం ఆ స్కూళ్లను యథావిధిగా కొనసాగించేందుకు చర్యలు తీసుకుందని తెలిపారు. ప్రతి గ్రామం, ప్రతి తండాలోని పిల్లలకు విద్యనందించడమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో శిథిలావస్థకు చేరిన అన్ని ప్రభుత్వ పాఠశాలల భవనాలను పునర్‌నిర్మించేందుకు రూ.2 వేల కోట్లతో పనులు ప్రారంభించామని వెల్లడించారు. బడి బయటి విద్యార్థులను బడిలో చేర్పించేందుకు ఈ నెల 9 నుంచి 20వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.


ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను కూడా గత ప్రభుత్వానికి భిన్నంగా మహిళా సంఘాలకు అప్పగించామని సీఎం పేర్కొన్నారు. మహిళా సంఘాల సభ్యులతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను నియమించి వారికి స్కూల్‌ నిర్వహణ, మధ్యాహ్న భోజనం, విద్యార్థుల స్కూల్‌ డ్రెస్సుల బాధ్యతను అప్పగించామని తెలిపారు. కమిటీలకు గ్రీన్‌ చానల్‌ ద్వారా నిధులు విడుదల చేయాలని అధికారులకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. విద్యపై ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదు.. పెట్టుబడి అని సీఎం అన్నారు. ఈ పెట్టుబడి మన సమాజానికి లాభాన్ని చేకూరుస్తుందని, విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు సొంత గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసేందుకు ఉత్సాహం చూపించడమే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. విద్యారంగం, వ్యవసాయ రంగానికి త్వరలో ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌ ప్రకటించారు.


తద్వారా ఆయా రంగాల్లోని సమస్యలను పరిష్కరించే వెసులుబాటు కలుగుతుందన్నారు. తమ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని, ఎవరు సలహాలు, సూచనలు ఇచ్చినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో స్టేట్‌ ర్యాంకులు సాధించాలని, భవిష్యత్తులో ఐఏఎస్‌, ఐపీఎఎ్‌సలుగా రాణించాలని సూచించారు. 10 జీపీఏ వచ్చిన విద్యార్థుల అడ్మిషన్లపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. మెగా డీఎస్సీతో ప్రభుత్వ పాఠశాలలను కాపాడే ప్రయత్నం చేస్తామన్నారు. సత్కారం అందుకున్న విద్యార్థుల్లో కామారెడ్డి జిల్లా మాంధపూర్‌ గ్రామానికి చెందిన సాయి క్రిష్‌, నిజామాబాద్‌ జిల్లా దోమకుండకు చెందిన శ్రీశాంత్‌, వరంగల్‌ లోని కృష్ణ కాలనీకి చెందిన భువన కృతి, నిజామాబాద్‌ జిల్లా మచ్చుకురం గ్రామానికి చెందిన మాసం శ్రీవల్లి, నిర్మల్‌ జిల్లా కొరిటికల్‌ గ్రామానికి చెందిన సరిత తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 11 , 2024 | 02:52 AM