Hyderabad: డ్రగ్స్ నిర్మూలనకు దైవ ఆశీర్వాదమే కావాలి
ABN, Publish Date - Nov 12 , 2024 | 03:26 AM
ఇప్పుడు చదువుకున్న యువత, డాక్టర్లు, ఇంజినీర్లు సైతం డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని, ఈ వ్యసనాలను ప్రోత్సహించే వారిని శిక్షించాలని ముఖ్యమంత్రిగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని, అయినా సరిపోవడం లేదని, వీటి నిర్మూలనకు ఇక దైవ ఆశీర్వాదమే కావాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
సీఎంగా తీవ్రంగా శ్రమిస్తున్నా కావట్లేదు
చెడు వ్యసనాలపై అవగాహన కల్పించాలి
మత వివక్ష, దాడులకు పాల్పడితే కఠిన చర్యలు: సీఎం
హైదరాబాద్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఇప్పుడు చదువుకున్న యువత, డాక్టర్లు, ఇంజినీర్లు సైతం డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని, ఈ వ్యసనాలను ప్రోత్సహించే వారిని శిక్షించాలని ముఖ్యమంత్రిగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని, అయినా సరిపోవడం లేదని, వీటి నిర్మూలనకు ఇక దైవ ఆశీర్వాదమే కావాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు, కల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడు సతీశ్ కుమార్ జన్మదిన వేడుకలు సోమవారం ఎల్బీ స్టేడియంలో జరిగాయి. వీటికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ మాట్లాడుతూ.. డ్రగ్స్ వంటి వ్యసనాలకు వ్యతిరేకంగా ప్రతి ఆదివారం టెంపుల్‌లో ప్రచారం చేయాలని, సామాజిక బాధ్యతగా సందేశాల్లో దీనిని ప్రస్తావించాలని కోరారు.
అన్నం పెట్టారనో, దుప్పట్లు ఇచ్చారనో తరతరాలుగా ఆచరిస్తున్న మతాన్ని వదిలి ఇతర మతాల్లోకి మారేంత బలహీనులు మన భారతీయులు కాదని చెప్పారు. విశ్వాసాన్ని ఆచరించడం, మతాన్ని స్వీకరించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని కాపాడే బాధ్యతను పాలకులుగా తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎవరూ మత వివక్షకు గురికాకుండా, మత వివక్ష దాడులు జరగకుండా కట్టడి చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని, అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరుగుతున్నా.. దాడులకు పాల్పడే వారిని శిక్షించే బాధ్యతను తీసుకుంటున్నామని చెప్పారు.
Updated Date - Nov 12 , 2024 | 03:26 AM