NEET RESULTS: నీట్‌పై నీలినీడలు...
ABN, Publish Date - Jun 08 , 2024 | 05:37 AM
24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంతో ముడివడిన నీట్-2024 పరీక్ష నిర్వహణ, వెల్లడైన ఫలితాలు తీవ్ర వివాదం సృష్టిస్తున్నాయి. అనేక మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరీక్షను మళ్లీ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
పరీక్ష నిర్వహణ, ఫలితాలపై తీవ్ర ఆరోపణలు
ప్రశ్నాపత్రం లీకేజీ, మార్కుల్లో అవకతవకలు
ఎన్నడూ లేని విధంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్
వారిలో 8 మందిది ఒకే పరీక్షా కేంద్రం
కొందరు విద్యార్థులకు అదనపు మార్కులు
పది రోజుల ముందే ఎన్నికల ఫలితాల నాడు రిజల్ట్స్
పరీక్ష మళ్లీ నిర్వహించాలంటున్న తల్లిదండ్రులు
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలి: ఖర్గే
నీట్ రద్దుకు అందరం కలిసి ఉద్యమిద్దాం: స్టాలిన్
ఎన్‌టీఏకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
(సెంట్రల్ డెస్క్)
24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంతో ముడివడిన నీట్-2024 పరీక్ష నిర్వహణ, వెల్లడైన ఫలితాలు తీవ్ర వివాదం సృష్టిస్తున్నాయి. అనేక మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరీక్షను మళ్లీ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తున్నారు. నీట్‌ఫ్రాడ్, నీట్‌పేపర్‌లీక్, నీట్‌స్కామ్, నీట్‌రీకండక్ట్ వంటి హ్యాష్‌ట్యాగ్‌లు సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. ప్రశ్నాపత్రాల లీకేజీలతో విద్యార్థుల జీవితాలతో మోదీ సర్కార్ ఆడుకుంటోందని విపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. మే 5న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నీట్ యూజీ-2024 పరీక్షను నిర్వహించింది. 24 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్ష రాశారు. అయితే, పరీక్ష నిర్వహణకు కేవలం రెండు రోజుల ముందే ఓ స్కామ్ బయటపడింది. పరశురామ్‌రాయ్ అనే ఓ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ యజమాని, తుషార్‌భట్ అనే ఓ టీచర్ కలిసి గుజరాత్‌కు చెందిన 16 మంది విద్యార్థులను నీట్‌లో అక్రమంగా పాస్ చేయించటానికి ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షలు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి.
ఇక పరీక్ష జరిగిన రోజున నీట్‌పై నీలినీడలు ప్రశ్నాపత్రం లీకైందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. లీకైన ప్రశ్నాపత్రం ఇదేనంటూ కొన్ని ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో నీట్‌ను మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్ అదే రోజున మొదలైంది. అనంతరం దీనిపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఫలితాలను విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని, పరీక్షను మళ్లీ నిర్వహించాలని పిటిషన్‌దార్లు కోరారు. ఫలితాల వెల్లడిని నిలిపివేయటానికి సుప్రీంకోర్టు నిరాకరించినప్పటికీ.. ఈ వ్యవహారాన్ని సమీక్షించటానికి అంగీకరించింది. కాగా, నీట్ ఫలితాలను జూన్ 14వ తేదీన విడుదల చేయాల్సి ఉండగా.. ఎన్‌టీఏ హఠాత్తుగా లోక్‌సభ ఫలితాలు వెలువడిన జూన్ 4వ తేదీన అంటే పది రోజుల ముందే విడుదల చేసింది. యావత్ మీడియా, దేశప్రజానీకం దృష్టి లోక్‌సభ ఎన్నికల ఫలితాల మీద ఉన్న సమయంలో ఎన్‌టీఏ ఇలా చేయటం లక్షలాది మంది విద్యార్థులను, తల్లిదండ్రులను దిగ్ర్భాంతి పరిచింది. ఎన్నికల ఫలితాల హడావిడిలో ఎవరూ నీట్ పరీక్ష నిర్వహణలో, ఫలితాల్లో జరిగిన అక్రమాలను పట్టించుకోరనే ఉద్దేశంతోనే ఎన్‌టీఏ ఇలా చేసిందన్న ఆరోపణలు వచ్చాయి.
ఫలితాల్లో గందరగోళం
ఇక వెల్లడైన ఫలితాలు కూడా పెద్ద ఎత్తున వివాదాన్ని సృష్టించాయి. ఏకంగా 67 మంది విద్యార్థులు ఈసారి వందశాతం మార్కులు (720) సాధించి దేశంలో నంబర్ వన్ ర్యాంకును తెచ్చుకున్నారని ఫలితాలు వెల్లడించాయి. నీట్ చరిత్రలోనే ఇంతమంది విద్యార్థులకు నంబర్‌వన్ ర్యాంకు ఎన్నడూ రాలేదు. ఈ 67 మందిలో 8 మంది హరియాణాలోని ఒకే పరీక్షకేంద్రానికి చెందిన వారు కావటం మరో విశేషం. అంతేకాదు, వీరి హాల్‌టికెట్ నెంబర్లు ఒకే సిరీ్‌సతో ఉన్నాయి. ఇక 67 మంది టాపర్లకు ఫస్ట్ ర్యాంకు ఇచ్చిన ఎన్‌టీఏ.. కౌన్సెలింగ్ ర్యాంకులను మాత్రం దశాంశ (డెసిమల్) పద్ధతిలో వేర్వేరుగా ఇచ్చింది. దేని ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించారన్నది వెల్లడించలేదు. ఫలితాల్లో చోటు చేసుకున్న మరో విచిత్రం ఏమిటంటే.. కొందరు విద్యార్థులకు 717, 718, 719 మార్కులు వచ్చాయి. నీట్ పరీక్ష మూల్యాంకన పద్ధతి ప్రకారం ఇలా రావటానికి వీల్లేదని విద్యార్థులు అంటున్నారు. ఎందుకంటే, నీట్ పరీక్షలో సరైన జవాబుకు 4 మార్కులు ఇస్తారు. తప్పు జవాబుకు ఒక మైనస్ మార్కు ఉంటుంది. మొత్తం 180 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసిన వారికి 720 మార్కులు (ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు చొప్పున) వస్తాయి.
ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా వదిలేసిన విద్యార్థికి 4 మార్కులు తగ్గి, మొత్తం స్కోరు 716 లభిస్తుంది. లేదా ఒక ప్రశ్నకు తప్పు సమాధానం రాస్తే.. మరో మార్కు తగ్గి 715 అవుతుంది. అంతేగానీ 719, 718, 717 వంటి మార్కులు రావటానికి అవకాశం లేదని, నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకు ఇది పెద్ద ఉదాహరణ అని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఎన్‌టీఏ గురువారం వివరణ ఇస్తూ.. కొన్ని పరీక్ష సెంటర్లలో విద్యార్థులకు పరీక్ష సమయం వివిధ కారణాల వల్ల వృథా అయినట్లు తమ విచారణలో తేలిందని, దీంతో 1563 మంది విద్యార్థులకు వృథా అయిన సమయం, వారి ప్రతిభ ఆధారంగా అదనపు మార్కులు కలిపామని తెలిపింది. అందువల్లే 719, 718 మార్కులు కొందరికి వచ్చాయని పేర్కొంది. అయుతే, ఒక్కో విద్యార్థికి ఎంత సమయం వృథా అయ్యింది అన్నది ఎలా నిర్ణయించారన్న దానిపై స్పష్టత లేదని విద్యార్థులు అంటున్నారు.
నిజంగానే, కొందరికి పరీక్ష సమయం వృథా అయి ఉంటే, వారికి అదనపు సమయం కేటాయిస్తే సరిపోయేదని, అదనపు మార్కులు ఎలా కలుపుతారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇక 67 మందికి ఫస్ట్‌ర్యాంక్ రావటంపై ఎన్‌టీఏ తన వివరణలో.. గత ఏడాది నీట్ పరీక్షను 20,38,596 మంది రాస్తే ఈసారి 23,33,297 మంది రాశారని, విద్యార్థుల సంఖ్య పెరగటం వల్ల అత్యధిక స్కోరు చేసిన వారి సంఖ్య కూడా పెరిగిందని తెలిపింది. 720 మార్కులు సాధించిన 67 మందిలో 44 మందికి.. ఫిజిక్స్ ఆన్సర్‌కీలో చేసిన రివిజన్ ప్రకారం ఆ మార్కులు లభించాయని పేర్కొంది. ఒకే ప్రశ్నకు రెండు సరైన సమాధాలు ఉన్నాయని నిపుణులు చేసిన సిఫార్సు మేరకు ఈ రివిజన్ జరిగిందని స్పష్టం చేసింది. మరో ఆరుగురు అదనపు మార్కులు కలపటం వల్ల 720 మార్కులను సాధించారని పేర్కొంది. ఫలితాలను పది రోజుల ముందే ప్రకటించటంపై స్పందిస్తూ.. ఆన్సర్ కీ ఛాలెంజ్ గడువు ముగిసిన తర్వాత వీలైనంత త్వరగా వెల్లడిస్తుంటామని, ఈసారి కూడా అదే విధంగా అన్ని ప్రక్రియలు పూర్తి చేసి నిబంధనల మేరకే ఫలితాలు వెల్లడించామని తెలిపింది.
Updated Date - Jun 08 , 2024 | 05:37 AM