Share News

Kaleshwaram: కాళేశ్వరం డిజైన్లకు సీడబ్ల్యూసీ ఆమోదం లేదు

ABN , Publish Date - Dec 21 , 2024 | 04:13 AM

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం డిజైన్లకు కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) ఆమోదం లేదని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారుడు వెదిరె శ్రీరామ్‌ స్పష్టం చేశారు. ఏ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలన్నా తొలుత సరైన ఇన్వెస్టిగేషన్లు జరగాలని, ఆ ఫలితాల ఆధారంగా డిజైన్లు/డ్రాయింగ్‌లు పూర్తయ్యాక నిర్మాణం జరగాల్సి ఉంటుందని తెలిపారు.

Kaleshwaram: కాళేశ్వరం డిజైన్లకు సీడబ్ల్యూసీ ఆమోదం లేదు

  • పరీక్షలు చేయకుండానే బ్యారేజీ నిర్మాణం

  • కాళేశ్వరం కమిషన్‌ ఎదుట వెదిరె శ్రీరామ్‌

  • అఫిడవిట్‌ దాఖలు చేసే విధానం ఇదేనా?

  • కోదండరామ్‌కు కమిషన్‌ చురకలు

హైదరాబాద్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకం డిజైన్లకు కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) ఆమోదం లేదని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారుడు వెదిరె శ్రీరామ్‌ స్పష్టం చేశారు. ఏ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలన్నా తొలుత సరైన ఇన్వెస్టిగేషన్లు జరగాలని, ఆ ఫలితాల ఆధారంగా డిజైన్లు/డ్రాయింగ్‌లు పూర్తయ్యాక నిర్మాణం జరగాల్సి ఉంటుందని తెలిపారు. కానీ, కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో ఇవేమీ జరగలేదని గుర్తు చేశారు. కాళేశ్వరం కమిషన్‌ ఎదుట శుక్రవారం ఆయన మరోసారి విచారణకు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల కోసం కేంద్ర జల వనరుల సంఘాని(సీడబ్ల్యూసీ)కి సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌(సీడీవో) రాసిన లేఖను సాక్ష్యంగా గతంలో వెదిరె శ్రీరామ్‌ సమర్పించగా... ఆ లేఖలో వ్యత్యాసాలు ఉన్నట్లు కమిషన్‌ గుర్తు చేసింది. ఏ అధికారంతో అధికారిక పత్రాలను సంపాదించారని ప్రశ్నించగా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల్లో భాగంగా సంపాదించానని, అవన్నీ పబ్లిక్‌ డాక్యుమెంట్లేనని ఆయన చెప్పారు. డిజైన్లకు అవరమైన వివరాలను అప్పటి ప్రభుత్వం సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌(సీడీవో)కు ఇవ్వలేదని, సరైన వివరాలు లేకుండా డిజైన్లు రూపొందించారని ఆరోపించారు. ‘‘బ్యారేజీల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించిన దాఖలాలు కనిపించడం లేదు.


నిర్మాణం తర్వాత ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌(ఓఅండ్‌ఎం) పనులు జరగలేదు. 2019లో వరదలు తగ్గుముఖం పట్టాక మేడిగడ్డ బ్యారేజీ దిగువ భాగంలో సీసీ బ్లాకులు చెల్లాచెదురైనట్టు గుర్తించారు. వాటిని అప్పుడే సరిచేయాల్సి ఉండ గా.. చేయలేదు. ఈ విషయమై నిర్మాణ సంస్థ, అధికారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినా.. పనులు చేపట్టలేదు. జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ నివేదిక ప్రకారం 3 బ్యారేజీల్లోనూ ఓ అండ్‌ ఎం నిధులు వెచ్చించిన దాఖలాల్లేవు. పునాదుల నుంచి ఇసుకంతా జారి... మేడిగడ్డ కుంగింది. అన్నారం, సుందిళ్లలో సీపేజీలు ఏర్పడ్డాయి. ప్రతిపాదిత ప్రదేశాలకు 2.2కిలోమీటర్ల దూరంలో సుందిళ్ల, 5.4 కి.మీ దూరంలో అన్నారం బ్యారేజీని కట్టారు. పరీక్షలు ఒకచోట జరిగితే... బ్యారేజీలు ఒక చోట కట్టారు. తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత ఉందని సీడబ్ల్యూసీ చెప్పినా.. అప్పటి సీఎం నిర్ణయం మేరకే తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టలేదు. హడావుడిగా కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం చేపట్టారు. ప్లానింగ్‌, డిజైనింగ్‌, నిర్మాణంలో తొందరపాటు చర్యలకు పాల్పడ్డారు. డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించడానికి ముందే నిర్మాణం ప్రారంభించారు’’ అని శ్రీరామ్‌ తెలిపారు.


అఫిడవిట్‌.. ఇలాగేనా దాఖలు చేసేది?

‘‘అఫిడవిట్‌ దాఖలు చేసే విధానం ఇదే నా? సమగ్ర సమాచారంతోపాటు అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలకు సాక్ష్యాలు సమర్పించాల్సి ఉండగా.. ఆ పని చేయలేదు. మీరు పేర్కొంటున్న పత్రాలు గతంలోనే సేకరించామని, మళ్లీ ఇచ్చే పత్రాలు చెత్తబుట్టలో పడేయడానికి తప్ప, దేనికీ పనికి రావు’’ అని ఎమ్మెల్సీ కోదండరామ్‌కు కాళేశ్వరం కమిషన్‌ చురకలు అంటించింది. విచారణ అనంతరం కోదండరామ్‌ మాట్లాడుతూ తొందరపాటుతో కాళేశ్వరం కట్టారని, ఇది తెలంగాణకు గుదిబండగా మారిందని దుయ్యబట్టారు. కాగా, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో తన పాత్ర లేదని, కొంత కాలం మాత్రమే నీటిపారుదల శాఖ బాధ్యతలు చూశానని రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌ రాజ్‌ వెల్లడించారు. కమిషన్‌ ముందు హాజరైన ఆయన.. అప్పట్లో మైనర్‌ ఇరిగేషన్‌, భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణ బాధ్యతలు చూశానని వివరించారు.

Updated Date - Dec 21 , 2024 | 04:13 AM