Share News

Adilabad: మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ హఠాన్మరణం..

ABN , Publish Date - Jun 30 , 2024 | 04:08 AM

ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేశ్‌ రాథోడ్‌(59) శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

Adilabad: మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ హఠాన్మరణం..

  • ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ.. రమేశ్‌ రాథోడ్‌ హఠాన్మరణం

  • గుండెపోటుతో తీవ్ర అస్వస్థత

  • హైదరాబాద్‌ తీసుకెళుతుండగా మృతి

  • సాధారణ కుటుంబం నుంచి ఎదిగిన నేత

  • ఎంపీ, ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్‌గా సేవలు

ఆదిలాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేశ్‌ రాథోడ్‌(59) శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో రమేశ్‌ భౌతిక కాయాన్ని ఉట్నూర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. ఆదివారం 10.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రమేశ్‌ రాథోడ్‌ సాధారణ కుటుంబం నుంచి అంచలంచెలుగా రాజకీయాల్లో ఎదిగారు.


1999లో తొలిసారి టీడీపీ తరఫున ఖానాపూర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2006 నుంచి 2009 మధ్య కాలంలో ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2009లో టీడీపీ నుంచి ఆదిలాబాద్‌ ఎంపీగా విజయం సాధించారు. ఆ సమయంలోనే ఆయన భార్య సుమన్‌ రాథోడ్‌ ఖానాపూర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం తర్వాత టీడీపీని విడిచి టీఆర్‌ఎ్‌సలో చేరిపోయారు. ఆ తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రె్‌సలో చేరి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2021లో బీజేపీ అగ్రనేత ఈటల రాజేందర్‌తో కలిసి కమలం గూటికి చేరి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్‌ నియోజక వర్గంలో బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.


ఆ వెంటనే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా.. బీజేపీ నుంచి టికెట్‌ దక్కలేదు. రమేశ్‌ రాథోడ్‌ మృతిపట్ల సీఎం రేవంత్‌ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఎంపీ లక్ష్మణ్‌, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రాజకీయ నేతలు, ప్రముఖులు సంతాపం తెలిపారు.

Updated Date - Jun 30 , 2024 | 04:08 AM