కొత్త హైకోర్టుకు నేడు శంకుస్థాపన
ABN, Publish Date - Mar 27 , 2024 | 05:08 AM
హైకోర్టు నూతన భవన నిర్మాణ పనుల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల వద్ద కేటాయించిన 100 ఎకరాల స్థలంలో నిర్మాణ పనులకు.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చేతుల మీదుగా..
హాజరు కానున్న సుప్రీం, హైకోర్టు జడ్జిలు
హైదరాబాద్, రాజేంద్రనగర్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు నూతన భవన నిర్మాణ పనుల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల వద్ద కేటాయించిన 100 ఎకరాల స్థలంలో నిర్మాణ పనులకు.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ బుధవారం సాయంత్రం 5.30కు శంకుస్థాపన చేయనున్నారు. పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, ఇతర న్యాయమూర్తులు హాజరుకానున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ నాయకులు ఎవరూ పాల్గొనే అవకాశం లేదు. కాగా, హైకోర్టు నూతన భవనాన్ని వందేళ్లపాటు పటిష్ఠంగా ఉండేవిధంగా నిర్మించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రూ.వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్‌తో 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైకోర్టుకు కేటాయించిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 42 కాగా.. భవిష్యత్తులో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని కోర్టు హాళ్లను నిర్మించాల్సి ఉంటుంది. జడ్జిల నివాస భవనాలు, రాష్ట్ర బార్ కౌన్సిల్, హైకోర్టు బార్ అసోసియేషన్, ఆడిటోరియం, లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఫైలింగ్ సెక్షన్‌లు, రికార్డుల గదులు, పార్కింగ్ తదితర అనేక అవసరాలకు తగిన విధంగా నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. కాగా, హైకోర్టు నూతన భవనం వరకు మెట్రోరైలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే పేర్కొంది.
19 ఆర్కిటెక్ట్ కంపెనీల ఆసక్తి
హైకోర్టు నూతన భవనం నిర్మాణ డిజైన్లను అందించేందుకు 19 ఆర్కిటెక్ట్ కంపెనీలు ముందుకొచ్చాయి. శంకుస్థాపన తర్వాత హైకోర్టు బిల్డింగ్ కమిటీ.. నిర్మాణానికి ఒకటి రెండు కంపెనీలను ఎంపిక చేయనున్నట్టు సమాచారం. ఎంపికైన కంపెనీలు డిజైన్లను రూపొందించి బిల్డింగ్ కమిటీకి అందిస్తాయి. వాటిలో నుంచి ఒక డిజైన్‌ను కమిటీ సెలెక్ట్ చేసి ప్రభుత్వానికి అందజేస్తుంది. అనంతరం నిర్మాణానికి టెండర్లను ఆహ్వానిస్తారు. నిర్మాణ బాధ్యతలను రోడ్లు, భవనాల శాఖ నిర్వహించనుంది.
1919లో ప్రస్తుత హైకోర్టు నిర్మాణం
ప్రస్తుతం మూసీ నది ఒడ్డున మదీన వద్ద ఉన్న హైకోర్టు భవనాన్ని ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో 1919లో నిర్మించారు. భారత్‌లో హైదరాబాద్ విలీనం కాకముందు హైదరాబాద్ హైకోర్టుగా దీనిని వ్యవహరించేవారు. 1956లో ఏపీ హైకోర్టుగా మార్పు చెందింది. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కావడంతో, 2019 జనవరి 1న తెలంగాణ హైకోర్టుగా రూపాంతరం చెందింది. వందేళ్ల కిందట నిర్మించిన భవనం కావడంతో.. కొంతకాలంగా పార్కింగ్ సమస్య, మౌలిక సదుపాయాల కొరత ఎదురవుతోంది. అగ్నిప్రమాదాలు, లీకేజీలు సమస్యగా మారాయి. ఏటా రిపేర్లు చేయాల్సి వస్తోంది. దీంతో కొత్త భవనాన్ని నిర్మించాలని, ఇందుకోసం 100 ఎకరాలు కేటాయించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నా అది నెరవేరలేదు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే చొరవ తీసుకొని సీఎం రేవంత్‌రెడ్డితో పలు సందర్భాల్లో భేటీ అయిన నేపథ్యంలో.. నూతన భవనం డిమాండ్ సాకారం దిశగా అడుగులు పడ్డాయి.
Updated Date - Mar 27 , 2024 | 05:08 AM