చిట్టీల పేరిట జెన్‌కో ఉద్యోగి చీటింగ్
ABN , Publish Date - Nov 11 , 2024 | 12:31 AM
తమ పిల్లల భవిష్యత్తు కోసం, ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, ఇతర కుటుంబ అవసరాల కోసం డబ్బులు దాచుకోవాలని వారంతా చిట్టీలు వేశారు.
రూ.93.18లక్షలు ఎగవేత
నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి ఎస్‌ఈ వరకు బాధితులే
నాగార్జునసాగర్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): తమ పిల్లల భవిష్యత్తు కోసం, ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, ఇతర కుటుంబ అవసరాల కోసం డబ్బులు దాచుకోవాలని వారంతా చిట్టీలు వేశారు. నెలంతా కష్టపడి సంపాదించిన సొమ్మును ఉద్యోగులందరూ కలిసి తోటి ఉద్యోగికి నమ్మకంతో ఇచ్చారు. చిట్టీ కట్టిన ఉద్యోగులకు సదరు వ్యక్తి తన భార్య పేరిట కోర్టు ద్వారా ఐపీ నోటీసులు(దివాలా దరఖాస్తు) పంపించడంతో పోలీసులను ఆశ్రయించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.... నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలో జెన్‌కో కార్యాలయ ఆర్జిజన్ తుర్క శ్రీనివాస్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో ఫైర్ అండ్ సేఫ్టీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. 2017లో అడవిదేవుపల్లిలోని టెయిల్‌పాండ్ జలవిద్యుత్ కేంద్రం నుంచి సాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి బదిలీపై వచ్చాడు. టెయిల్‌పాండ్ వద్ద పనిచేసిన సమయంలోనూ స్థానికంగా చిట్టీలు నిర్వహించాడు. అదే విధంగా సాగర్‌లో కూడా నాలుగో తరగతి ఉద్యోగి నుంచి ఎస్‌ఈ వరకు రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు చిట్టీలు వేయించాడు. చిటీలు పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా అప్పు తీసుకున్నట్లు ఏడాదిగా ప్రామిసరీ నోట్లు రాసిస్తూ వచ్చాడు. సాగర్ జెన్‌కో కార్యాలయంలో పనిచేస్తున్న మొత్తం 40 మంది వద్ద సుమారు రూ.కోటి మేరకు చిట్టీలు వేయించాడు. చిట్టీ డబ్బులు ఇవ్వకుండా రెండు నెలలుగా కాలం వెలిబుచ్చుతుండటం, మాటలు మారుస్తుండటంతో తోటి ఉద్యోగులకు అనుమానం వచ్చింది. తమకు ఇవ్వాల్సిన నగదు త్వరగా చెల్లించాల్సిన గత నెలలో నిలదీశారు. దీంతో శ్రీనివాస్ సదరు ఉద్యోగి నాలుగు రోజులు విధులకు హాజరు కాకపోవడం, ఫోన్ స్విచ్‌ఆఫ్‌చేసి ఉండటం, స్థానికంగా లేకపోవటంతో సాగర్ హిల్‌కాలనీ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆచూకీ తెలుసుకుని సాగర్‌కు రావాలని చెప్పటంతో ఈ నెల 1వ తేదీన పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. అందరి డబ్బులు ఇస్తానని ఎస్‌ఐ సంపత్ ఎదుట అంగీకరించాడు. ఈ నెల 5వ తేదీనుంచి చిట్టీ కట్టిన చిరుద్యోగి నుంచి ఎస్‌ఈ వరకు మొత్తం 37 మందికి రూ.93.18 లక్షలకు కోర్టు ద్వారా తన భార్య లక్ష్మీపద్మావతి పేరిట ఐపీ నోటీసులు (దివాలా దరఖాస్తు) పంపించాడు. దీంతో బాధితులు తమ గోడును విలేకరుల ఎదుట వెళ్లబోసుకున్నారు. తాము కట్టిన చిట్టీ డబ్బుతో తుర్క శ్రీనివాస్ ఆయన భార్య లక్ష్మీపద్మావతి పేరిట ఆంధ్రప్రదేశ్‌లో భూములు కొన్నాడని బాధితులు చెబుతున్నారు. డబ్బులు ఇవ్వకుండా ఉండాలనే భార్య పేరున ఐపీ నోటీసులు పంపించాడని ఆరోపిస్తున్నారు. తమను మోసం చేసిన శ్రీనివా్‌సపై చట్టపరంగా చర్యలు తీసుకుని తమ డబ్బులు ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు.