ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: సమీకృత గురుకులాలు కార్పొరేట్‌ తరహాలో!

ABN, Publish Date - Jun 25 , 2024 | 04:25 AM

రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలు కొత్త శోభను సంతరించుకోనున్నాయి. అరకొర వసతులు, అద్దె భవనాలు, శిథిలావస్థలో కొనసాగుతున్న గురుకులాల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ‘సమీకృత గురుకులాల (ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌)’ విధానాన్ని తీసుకురానుంది.

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ.. అన్నీ ఒకేచోట

  • 20-25 ఎకరాల్లో.. రూ.22 కోట్లతో నిర్మాణం

  • బోధన, బోధనేతర సిబ్బందికి క్వార్టర్లు

  • క్రీడా స్థలం, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌

  • సీఎం పరిశీలనలో 2 డిజైన్లు.. త్వరలో ఆమోదం పైలట్‌ ప్రాజెక్టు కింద కొడంగల్‌, మధిరలో ఏర్పాటు

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ.. అన్నీ ఒకేచోట.. 20-25 ఎకరాల్లో దాదాపు 22 కోట్లతో నిర్మాణం

హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలు కొత్త శోభను సంతరించుకోనున్నాయి. అరకొర వసతులు, అద్దె భవనాలు, శిథిలావస్థలో కొనసాగుతున్న గురుకులాల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ‘సమీకృత గురుకులాల (ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌)’ విధానాన్ని తీసుకురానుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సాధారణ గురుకులాలన్నింటినీ ఒకే చోట ఏర్పాటు చేయనుంది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున సమీకృత గురుకులాలను ఏర్పాటు చేయనుంది. ఒక్కోటి సుమారు 20-25 ఎకరాల్లో, దాదాపు రూ.22 కోట్లతో.. కార్పొరేట్‌ తరహాలో భవనాలను నిర్మించనుంది. వీటి ఏర్పాటు కోసం ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టితో కలిసి అధికారులతో సమీక్షించారు.


సమీకృత గురుకులాలకు సంబంధించిన రెండు డిజైన్లను అధికారులు సీఎంకు అందించారు. వాటిలో ఒకదాన్ని ఆయన ఆమోదించనున్నారు. ఈ గురుకులాలను పైలట్‌ ప్రాజెక్టు కింద రేవంత్‌ సొంత నియోజకవర్గం కొడంగల్‌, భట్టి నియోజకర్గం మధిరలో ప్రారంభించనున్నారు. జీ+3 అంతస్తుల్లో తరగతి గదులు, జీ+3 అంతస్తులతో మరో భవనంలో కల్చరల్‌ సెంటర్‌, జీ+8 అంతస్తుల్లో హాస్టల్‌, మెస్‌; క్రీడా మైదానం సహా విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలిగేలా ఈ భవన సముదాయాలను నిర్మించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 1022 గురుకులాలు ఉన్నాయి. వీటిలో 394 మాత్రమే సొంత భవనాల్లో ఉండగా.. 628 అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి.


ప్రభు త్వ భవనాల్లో కొనసాగుతున్న వాటిలోనూ కొన్ని భవనా లు వినియోగానికి అనువుగా లేవు. దీంతో గురుకులాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో సీఎం వీటిపై దృష్టి సారించారు. సమీకృత గురుకులాల నిర్మాణాలకు బ్యాంకుల నుంచి రుణాలను సేకరించనున్నట్లు తెలిసింది. మరోవైపు కేంద్ర సాయం అందుతుందా అనేదానిపైనా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు సమీకృత గురుకులాల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలు, 20-25 ఎకరాల స్థలాన్ని చూడాలని, ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం సూచించారు.


నూతన భవనాలు ఇలా..

ఈ గురుకుల భవనాలు కార్పొరేట్‌ తరహాలో రూపుదిద్దుకోనున్నాయి. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లను కూడా ఈ నిర్మాణాల్లో భాగం చేస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని లచ్చగూడెం దగ్గర నిర్మించాలని భావిస్తున్న గురుకులం డిజైన్‌ను సీఎం పరిశీలించారు. ఈ సమీకృత గురుకులం బ్లాకుల వారీగా నిర్మాణం కానుంది. వీటిలో అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, తరగతి గదులు, ఉద్యోగుల గదులు, ప్రయోగశాల, అథ్లెటిక్‌ ట్రాక్‌, ఫుట్‌బాల్‌ , టెన్నిస్‌, బాస్కెట్‌బాల్‌ కోర్టులతో పాటు ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ కూడా ఏర్పాటు చేయనున్నారు. తరగతి గదుల్లో విద్యార్థులకు అవసరమైన మేర వెలుతురు ఉండేలా డిజైన్‌ చేశారు. జీ+8 అంతస్తుల్లో బాలికలు, బాలుర హాస్టళ్లను వేర్వేరుగా ఏర్పాటు చేయనుండగా, ఈ రెండు హాస్టళ్ల మధ్యలో జీ+3 అంతస్తులతో బోధన, బోధనేతర సిబ్బందికి నివాస సముదాయాన్ని నిర్మించనున్నారు.


ఇదీ ప్రస్తుత పరిస్థితి..

ప్రస్తుతం తెలంగాణ రెసిడెన్షియల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ట్రైస్‌)కు మాత్రమే 35 సొంత భవనాలున్నాయి. ఎస్సీ గురుకులాలు 163 సొంత భవనాల్లో ఉండ గా.. 105 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. గిరిజన గురుకులాలు 145 సొంత, 43 అద్దె భవనాల్లో ఉన్నాయి. బీసీ గురుకులాలు 21 సొంత, 306 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మైనారిటీ గురుకులాలు 30 సొంత, 174 అద్దె భవనాల్లో ఉన్నాయి.


కేంద్రం సాయం కూడా పొందేలా..

సమీకృత గురుకులాల ఏర్పాటుకు అవసరమయ్యే నిధుల్లో కొంతమేర కేంద్రం నుంచి కూడా తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ గురుకుల భవనాలను కేంద్రం నిర్ణయించిన నమూనాలో నిర్మిస్తే, గ్రాంట్ల రూపంలో కొంత మేరకు నిధులు అందించేందుకు అవకాశం ఉన్నట్లు సమాచారం. భవనాలను నిర్మించే ప్రాంతాలు, నిర్మాణ నమూనాలు సహా పలు వివరాలను కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి సాయం అందకపోతే.. బ్యాంకుల నుంచి రుణం తీసుకుని నిర్మాణం చేపట్టనున్నారు.

Updated Date - Jun 25 , 2024 | 04:25 AM

Advertising
Advertising