TS Assembly: గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ డుమ్మా?
ABN , Publish Date - Feb 08 , 2024 | 11:22 AM
హైదరాబాద్: తెలంగాణ శాసన సభ, శాసన మండలి సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలనూ ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. అనంతరం ఉభయ సభలూ శుక్రవారానికి వాయిదా పడతాయి.
హైదరాబాద్: తెలంగాణ శాసన సభ, శాసన మండలి సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలనూ ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. అనంతరం ఉభయ సభలూ శుక్రవారానికి వాయిదా పడతాయి. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరవుతారు. అయితే ఈరోజు గవర్నర్ ప్రసంగం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ హాజరుకాకపోయినా.. రేపు (శుక్రవారం) ధన్యవాద తీర్మానం చేయడానికి ఆయన హాజరయ్యే అవకాశమున్నట్లు సమాచారం. శస్త్ర చికిత్స చేయించుకున్న కారణంగా గత అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరుకాలేదు. ఈరోజు అసెంబ్లీలో రాష్ట్ర గీతాన్ని ఆలపించే అవకాశముంది. నాలుగు రోజుల క్రితం జరిగిన సమావేశంలో రాష్ట్ర గీతంగా ‘జయ జయహే తెలంగాణను’ నిర్ణయించారు. దీంతో గవర్నర్ ప్రసంగం అనంతరం జాతీయ గీతం ఆలాపణ ఉంటుంది. అయితే ఈసారి బడ్జెట్ సమావేశాలు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్‌గా మారే అవకాశముంది.
కాగా.. 10వ తేదీన (శనివారం) ప్రభుత్వం శాసనసభలో ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్తు శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టవచ్చని తెలిసింది. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా శాసనసభా వ్యవహారాల మంత్రిగా వేముల ప్రశాంత్‌రెడ్డి మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. దుద్దిళ్ల ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తారని సమాచారం. 11న ఆదివారం శాసన సభకు సెలవు ప్రకటించి, బడ్జెట్‌పై సభ్యులకు అధ్యయనం చేసే అవకాశమిస్తారని తెలిసింది. తిరిగి 12న అసెంబ్లీ ప్రారంభమయ్యాక బడ్జెట్‌పై చర్చ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ చర్చ ఎన్ని రోజులపాటు జరిగేదీ శాసన సభా వ్యవహారాల కమిటీ(బీఏసీ) సమావేశంలో నిర్ణయించనున్నారు. ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ సమావేశాలు 17వ తేదీ వరకూ కొనసాగుతాయని తెలిసింది. ప్రభుత్వం ఈ సెషన్స్‌లోనే సాగునీటి పారుదల శాఖపై శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టనుంది. దీనిపై ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్‌రెడ్డి, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడే అవకాశముంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడంపై చర్చ జరిగే అవకాశముంది. ఇది కాకుండా... కుల గణనపైనా ప్రభుత్వం ఈ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది.