Telangana: జూన్‌లో స్థానిక ఎన్నికలు..
ABN , Publish Date - Apr 11 , 2024 | 10:24 AM
రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామపంచాయతీలకు(Local Body Elections) జూన్ నెలలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revath Reddy) వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) క్షేత్రస్థాయి నేతల పనితీరును బట్టి ఆ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.
హైదరాబాద్, ఏప్రిల్ 11: రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామపంచాయతీలకు(Local Body Elections) జూన్ నెలలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revath Reddy) వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) క్షేత్రస్థాయి నేతల పనితీరును బట్టి ఆ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. బుధవారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నివాసంలో జరిగిన భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ ముఖ్యనాయకుల సమావేశానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాయకులంతా సమిష్టిగా పనిచేసి చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని భువనగిరి ఎంపీగా గెలిపించాలని సూచించారు. బూత్ స్థాయి నుంచి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి వరకు మూడంచెల సమన్వయ కమిటీల వ్యవస్థను త్వరితగతిన ఏర్పాటు చేసుకుని సమిష్టిగా పని చేయాలన్నారు.
ఇటు డీసీసీ అధ్యక్షులు, అటు మండల, బూత్ స్థాయి కమిటీనూ సమన్వయం చేసుకుని పోల్ మేనేజ్‌మెంట్ పకడ్బందీగా నిర్వహించాలంటూ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమన్వయకర్తలకు సూచించారు. ప్రతి పది బూత్‌లను కలిసి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేయాలని, వంద రోజుల్లో ప్రభుత్వ పనితీరును, రాహుల్‌గాంధీ ప్రకటించిన పాంచ్‌న్యాయ్ గ్యారెంటీలను, పార్టీ మేనిఫెస్టోను ప్రతి ఓటరు వద్దకూ వెళ్లి వివరించాలని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బూత్ కమిటీల్లో చురుకుగా పనిచేసిన వారికి గ్రామ వలంటీర్ల నియామకంలో ప్రాధాన్యం ఇస్తామని సీఎం చెప్పినట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల మందికి పైగా వలంటీర్లతో వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ఇందులో మహిళలకు ఎక్కువగా అవకాశం కల్పిస్తామని, రూ.6 వేల గౌరవ వేతనం ఇస్తామని చెప్పినట్లు సమాచారం.
ఇక ఈ నెల 21న భువగిరిలో చామల కిరణ్‌కుమార్‌రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమం పెట్టుకుందామని, అక్కడే సభనూ నిర్వహిద్దామని సీఎం రేవంత్ చెప్పారు. ఈ కార్యక్రమాల్లో తాను కూడా పాల్గొంటానన్నారు. కాగా, మే నెల మొదటి వారంలో నల్లగొండ, చౌటుప్పల్‌లో ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకగాంధీ రోడ్‌షోలు ఉంటాయని తెలిపారు.
రేవంత్ వ్యూహాత్మక భేటీ!
భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ సమీక్షను కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నివాసంలో నిర్వహించడం ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలంతా ఒక్క తాటిపై ఉన్నారని, పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి సమిష్టిగా కృషి చేస్తున్నారనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపారు. ఈ నియోజకవర్గం నుంచి సీఎం రేవంత్‌రెడ్డి సన్నిహితుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రాజగోపాల్‌రెడ్డి భార్య లక్ష్మి కూడా భువనగిరి టికెట్ కోసం చివరి వరకూ పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని నేతల మధ్య విభేదాల్లేవని చెప్పేందుకు.. సీఎం రేవంత్‌రెడ్డి ముందుగా వారి ఐక్యతపై దృష్టి సారించారు. ఇప్పటివరకు జరిగిన నిజామాబాద్, సికింద్రాబాద్, వరంగల్ నియోజకవర్గాల సమీక్షలను తన నివాసంలోనే నిర్వహించిన సీఎం.. భువనగిరి సమీక్షను మాత్రం రాజగోపాల్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేశారు. తన నివాసానికి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డిని.. రాజగోపాల్‌రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మందుల సామేలు, వేముల వీరేశం, మల్‌రెడ్డి రంగారెడ్డి, బీర్ల అయిలయ్య, నియోజకవర్గ ముఖ్యనాయకులు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, బాలలక్ష్మి, చనగాని దయాకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సామాజిక ఉద్యమ కెరటం ఫూలే
మహాత్మా జ్యోతిబా ఫూలే స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలను చేపడుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సామాన్యుడిగా మొదలై ఒక సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన ఫూలే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. సామాజిక కార్యకర్తగా, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘసంస్కర్త ఫూలే భావితరాలకు సైతం మార్గదర్శకుడని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల జనోద్ధరణకు ఆయన ఎంచుకున్న బాట, అనుసరించిన మార్గం సమాజ శ్రేయస్సును కాంక్షించే వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ప్రగతి భవన్‌కు మహాత్మా జ్యోతిబా ఫూలే పేరు పెట్టి ప్రజాభవన్‌గా మార్చిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు.
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇండియా టీవీ నిర్వహిస్తున్న ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో పాల్గొనేందుకే ఆయన వెళుతున్నారు. అనంతరం సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు వస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.