TIMS: కరోనాను జయించిన 'టిమ్స్' కనుమరుగు
ABN, Publish Date - Oct 06 , 2024 | 11:27 AM
కరోనా సమయంలో వైద్య సేవలు అందించేందుకు గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టీమ్స్ ఆస్పత్రి మూన్నాళ్ల ముచ్చటగా మారింది. గచ్చి బౌలి స్టేడియంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కొవిడ్ చికిత్స అందించేందుకు 2020లో ఏర్పాటు
ఇతర వైద్య సేవలపై దృష్టిపెట్టని కేసీఆర్ ప్రభుత్వం
కరోనా అనంతరం నిలిచిపోయిన వైద్య సేవలు
తిరిగి స్పోర్ట్స్ అథారిటీకి అప్పగించేందుకు చర్యలు ముమ్మరం
హైదరాబాద్: కరోనా సమయంలో వైద్య సేవలు అందించేందుకు గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టీమ్స్ ఆస్పత్రి మూన్నాళ్ల ముచ్చటగా మారింది. గచ్చి బౌలి స్టేడియంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో మళ్లీ అక్కడ స్పోర్ట్ అథారిటీ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇక్కడ కరోనా బాధితులకు చికిత్సలు తప్ప పూర్తి స్థాయిలో అన్ని విభాగాల వైద్య సేవలు అందించే విధంగా ఏర్పాటు చేయకపోవడంతో రోగులకు మెరుగైన చికిత్సలు అందించలేకపోయారు. కొవిడ్ రోగుల ప్రాణాల మీదకు వస్తే స్పెషాల్టీ విభాగాలకు చెందిన వైద్యులు లేకపోవడంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మెడికల్ ఆఫీసర్ స్థాయి వైద్యులు మాత్రమే ఉండటం, ఇతర విభాగాలకు చెందిన వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు రావడం తగ్గిపోయారు. కేవలం జలుబు, దగ్గు వంటి వాటికి మాత్రమే వైద్యం అందిస్తుండటంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయికి చేరుకుంది టిమ్స్ పరిస్థితి. దీంతో దీనిని ఆరోగ్యశాఖ నుంచి మళ్లీ స్పోర్ట్స్ అథారిటీకి బదిలీ చేయనున్నారు.
దృష్టి సారించని బీఆర్ఎస్ ప్రభుత్వం
నగరానికి నలువైపులా మల్టీ సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులను నిర్మిస్తున్నామని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా అల్వాల్, ఎర్రగడ్డ, కొత్తపేట సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులకు భూమిపూజ చేసి నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ టిమ్స్‌పై దృష్టి సారించలేదు. దీంతో రెండెళ్ల నుంచి ఇక్కడ వైద్య సేవలు దాదాపుగా నిలిచిపోయాయి. క్రమేణా ఇక్కడి వైద్యులు, నర్సులు, సిబ్బందిని నిలోఫర్, గాంధీ, ఉస్మానియా, చెస్ట్, సుల్తాన్ బజార్‌లోని ప్రసూతి ఆస్పత్రులకు తరలించారు.
యుద్ధ ప్రాతిపాదికన సౌకర్యాలు..
బీఆర్ఎస్ ప్రభుత్వం కొవిడ్ మొదటి వేవ్‌లో అత్యవసర వైద్య సేవలు అందించడానికి యుద్ధ ప్రాతిపదికన వైద్య సిబ్బంది, ఆధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేసి 2020 ఏప్రిల్ 20న టిమ్స్‌ను ప్రారంభించింది. 3వ అంతస్తులో 1500 పడకలు, ఐసీయూలో 50 పడకలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక వార్డులు, వైద్య పరికరాలు, వెంటిలేటర్ సదుపాయాలు కల్పించారు. కాంట్రాక్ట్ పద్ధతిలో మెడికల్ ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని నియమించారు. కరోనా రెండో వేవ్‌లోనూ ఈ ఆస్పత్రిలో వైద్య సేవలందించారు.
Updated Date - Oct 06 , 2024 | 11:36 AM