జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్ల నిలిపివేత
ABN , Publish Date - Nov 11 , 2024 | 01:20 AM
పత్తి రైతులను కష్టాలు వీడడం లేదు. ఇప్పటికే మద్దతు ధర దక్కక ఇబ్బంది పడుతున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా తేమ శాతంపై నిబంధనలు పెట్టడడంతో నామమాత్రంగా కొనుగోళ్లు సాగుతున్నాయి.
- సీసీఐ నిబంధనలపై మిల్లర్ల నిరసన
- అకస్మాత్తుగా నోటీస్ ఇవ్వడంతో రైతుల ఆందోళన
పత్తి రైతులను కష్టాలు వీడడం లేదు. ఇప్పటికే మద్దతు ధర దక్కక ఇబ్బంది పడుతున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా తేమ శాతంపై నిబంధనలు పెట్టడడంతో నామమాత్రంగా కొనుగోళ్లు సాగుతున్నాయి. జిన్నింగ్ మిల్లుల యజమానులు తాము సోమవారం నుంచి పత్తిని కొనుగోళ్లు నిలిపివేస్తున్నామని మార్కెట్ అధికారులకు ఆదివారం సాయంత్రం నోటీస్ ఇచ్చారు. అప్పటికే రైతులు సోమవారం మార్కెట్‌కు తీసుకొచ్చేందుకు వాహనాల్లో నింపారు. ఇప్పుడు కొనుగోళ్లు నిలిపివేయడంతో పత్తి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జమ్మికుంట, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): జిన్నింగ్ మిల్లుల్లో సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు మిల్లర్లు మార్కెట్ అధికారులకు ఆదివారం నోటీస్ అందజేశారు. ఎల్-1, ఎల్-2, ఎల్-3 పేరిట సీసీఐ కఠిన నిబంధనలు పెడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని మిల్లర్లు నోటీసులో తెలిపారు. జమ్మికుంటలో మొత్తం ఏడు జిన్నింగ్ మిల్లులను సీసీఐ నోటిఫై చేసింది. ఒక మిల్లుకు కేటాయించిన పత్తి పూర్తిగా వచ్చిన తర్వాతనే మరో మిల్లుకు పత్తి పంపిస్తామని సీసీఐ అధికారులు అంటున్నారు. ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకుంటే తర్వాత మిల్లులకు పత్తి తగ్గుతుందని, అలా చేయడం వల్ల తమకు నష్టం వాటిల్లుతుందని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లకు రాష్ట్ర స్థాయి బంద్ పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగానే జమ్మికుంటలో సోమవారం పత్తి కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి.
ఫ మార్కెట్‌కు వచ్చేందుకు సిద్ధమైన రైతులు
శని, ఆదివారాలు మార్కెట్ యార్డుకు సాధారణ సెలవు దినాలు కావడంతో సోమవారం పత్తి విక్రయించుకునేందుకు రైతులు సన్నద్దం అయ్యారు. మిల్లర్లు సాయంత్రం నోటీస్ అందజేయడంతో మార్కెట్ అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమై అడ్తీదారుల ద్వారా రైతులకు సందేశం పంపించినట్లు తెలిసింది. రైతులు అప్పటికే వాహనాలు అద్దెకు తీసుకుని పత్తి తొక్కి పెట్టుకుని మార్కెట్ యార్డుకు తీసుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. సోమవారం కొనుగోళ్లు నిలిపి వేస్తే తమ పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతికూల పరిస్థితులతో దిగుబడి లేక రైతులు సతమతమవుతున్నారు. ఇప్పుడు ఆకస్మికంగా కొనుగోళ్లు నిలిపివేస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. తొక్కి పెట్టిన పత్తి మసక బారి పోయే అవకాశాలు ఉన్నాయి. కొనుగోళ్లు యథావిధిగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.