Kaleshwaram: ఇతరుల తప్పుల్ని భుజాన వేసుకోవద్దు
ABN, Publish Date - Oct 26 , 2024 | 04:03 AM
వేరెవరో చేసిన తప్పులను మీ భుజాన వేసుకోవద్దని కాళేశ్వరం కమిషన్ రామగుండం మాజీ ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లును హెచ్చరించింది. ‘‘‘ఇతరులు చేసిన తప్పిదాలను భుజాన వేసుకునే ప్రయత్నం చేయొద్దు.
సమస్యలు కొని తెచ్చుకోవద్దు!.. మౌఖిక వివరాలిస్తే చర్యలు తప్పవు
మాజీ ఈఎన్‌సీ వెంకటేశ్వర్లుకు కాళేశ్వరం కమిషన్ హెచ్చరిక
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో రూ.14 వేల కోట్ల వ్యయం
రూ.13,250 కోట్లు కాళేశ్వరంలో వినియోగం.. వృథా 750 కోట్లే!
2019-22 దాకా బ్యారేజీల్లో సమస్యలు: వెంకటేశ్వర్లు
మహారాష్ట్రలో చెక్‌డ్యామ్‌లకు సీకెంట్‌పైల్స్ వాడారు: సీఈ చంద్రశేఖర్
హైదరాబాద్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): వేరెవరో చేసిన తప్పులను మీ భుజాన వేసుకోవద్దని కాళేశ్వరం కమిషన్ రామగుండం మాజీ ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లును హెచ్చరించింది. ‘‘‘ఇతరులు చేసిన తప్పిదాలను భుజాన వేసుకునే ప్రయత్నం చేయొద్దు. అఫిడవిట్‌లో ఇచ్చిన వివరాలకు, కమిషన్ ముందు చెప్పే వివరాలకు సారూప్యత ఉండాలి. రికార్డుల్లేకుండా కమిషన్ ముందు మౌఖిక సమాధానాలిచ్చి తప్పించుకోవాలని చూస్తే చర్యలు తప్పవు. సమస్యలను మీ అంతట మీరే కొనితెచ్చుకోవద్దు’’ అని కమిషన్ పేర్కొంది. మూడో రోజైన శుక్రవారం జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందు వెంకటేశ్వర్లు విచారణకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలు అంశాల్లో కమిషన్ ఆయన్ను గట్టిగా హెచ్చరించింది. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ వచ్చాక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి పథకం కింద రూ.14వేల కోట్లను వెచ్చించగా.. అందులో రూ.13250కోట్ల పనులను కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో వినియోగించుకున్నామని మాజీ ఈన్‌ఎసీ తెలిపారు. రూ.750కోట్ల పనులు వృథా అయ్యాయని గుర్తుచేశారు. 2019 జూన్ 21న బ్యారేజీల పనులన్నీ పూర్తయి, వాడుకలోకి రాగా అదే ఏడాది నవంబరులో వచ్చిన వరదలతో బ్యారేజీ దెబ్బతిందన్నారు. 2019-22 దాకా వరసగా బ్యారేజీల్లో సమస్యలు ఉత్పన్నం అయ్యాక 2023లో ఎనర్జీ డిసిపేషన్ స్టడీ చేయాలని తెలంగాణ ఇంజనీరింగ్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (టీజీఈఆర్‌ఎల్)ను కోరినట్లు చెప్పారు.
ఫ్లడ్ బ్యాంకుల ఉద్దేశమేంటి?
భూసేకరణ, ముంపును తగ్గించడమే వాటి ఉద్దేశం. రైతుల ప్రతిఘటనతో ఫ్లడ్ బ్యాంకుల నిర్మాణానికి పూనుకున్నాం. అందువల్లే వాస్తవిక అంచనాల్లో వాటిని చేర్చలేదు.
కాఫర్‌డ్యామ్ డిజైన్లు, డ్రాయింగ్‌లు సవరించారా?
మేడిగడ్డలో తొలుత 96 మీటర్లతో కాఫర్ డ్యామ్ కట్టాలని ప్రతిపాదించాం. ప్రతిపాదిత నిర్మాణం వరదలతో మునిగిపోవడంతో తట్టుకోవడం కష్టమని, 100-101మీటర్లకు పెంచాం. మేడిగడ్డ బ్యారేజీ పెరెన్నియల్ రివర్ ప్రదేశంలో ఉంది. మిగతా బ్యారేజీల్లేవు.
డ్రాయింగ్‌ల ప్రక్రియ ఏ దశలోనైనా ఆలస్యమైందా?
(అఫిడవిట్‌కు భిన్నంగా ఉంటే చర్యలు తప్పవని కమిషన్ హెచ్చరిక). రికార్డులన్నీ పరిశీలించి, సోమవారం కల్లా చెబుతా.
2019-22 మధ్యే బ్యారేజీలు దెబ్బతిన్నాయా?
బ్యారేజీల్లో 2019-2022దాకా సమస్యలు వచ్చాయి. వీటిపై 2020 ఫిబ్రవరిలో ఈఎన్‌సీ సి.మురళీధర్ నేతృత్వంలో, ఆ తర్వాత నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో సమావేశమై చర్చించారు. దెబ్బతినడానికి గల కారణాలపై నమూనా అధ్యయనాలు చేయాలని ఆదేశాలిచ్చాం.
వాస్తవిక అంచనాలెంత? మళ్లీ సవరించారా?
2016 మార్చి 1న మేడిగడ్డ బ్యారేజీ రూ.2591 కోట్లు, అన్నారం బ్యారేజీ 1785 కోట్లు, సుందిళ్ల బ్యారేజీకి 1437కోట్లు వాస్తవిక నిర్మాణ అంచనా వ్యయంగా ఉంది. తర్వాత అంచనాలను రూ.4613 కోట్లు, రూ.2700కోట్లు, రూ.2200కోట్లుగా సవరించాం.
అంచనాలను సవరించడానికి కారణాలేంటి?
డిజైన్, డ్రాయింగ్‌లతో ప్రధాన కాంపోనెంట్ల ప్రకారం వాస్తవిక నిర్మాణ అంచనాలను తయారు చేశాం. ఫ్లడ్‌బ్యాంకులు, డైవర్షన్ చానళ్లను చేర్చడంతో పాటు మారిన పన్నుల శ్లాబులతో అంచనాలను సవరించాల్సి వచ్చింది.
సవరణ అంచనాలను ఎవరు ఆమోదించారు?
నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి/ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆమోదించారు.
పనుల పూర్తికి నిర్మాణ సంస్థలు గడువు కోరాయా?
అవును.. కోరాయి. 2016 మే 2న మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్ నిర్మాణ పనులకు సీఎంగా ఉన్న కేసీఆర్ భూమి పూజ చేశారు. అన్నారం, సుందిళ్ల పనులు పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇస్తే, మేడిగడ్డకు సబ్‌స్టాన్షియల్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చాం. ఒప్పంద నిబంధనల ప్రకారం బ్యారేజీ పనులు దాదాపు పూర్తయ్యాయని నిర్ధారిస్తూ ఇచ్చేదే సబ్‌స్టాన్షియల్ కంప్లీషన్ సర్టిఫికెట్.
కాళేశ్వరం ప్రాజెక్టుకు నోడల్ అధికారి ఉన్నారా?
నోడల్ అధికారిగా బి.హరిరామ్ ఉన్నారు.
నేడు విచారణకు సీఈ సుధాకర్‌రెడ్డి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన టెండర్ల ప్రక్రియతో పాటు పలు అంశాల్లో భాగస్వామిగా ఉన్న రామగుండం ఇన్‌చార్జీ సీఈ సుధాకర్‌రెడ్డిని శనివారం కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది.
సీకెంట్ పైల్స్ నిర్ణయం ఎల్‌అండ్‌టీదే: సీఈ చంద్రశేఖర్
‘జలాశయాల నిర్మాణంలో సీకెంట్ పైల్స్ వాడరు. మేడిగడ్డలో ఎందుకు వాడారు?’ అని కమిషన్ సీఈ చంద్రశేఖర్‌ను ప్రశ్నించింది. దేశంలో ఇలాంటి నిర్మాణాల్లో సీకెంట్ పైల్స్ వినియోగించినట్లు అప్పట్లో తమ వద్ద సమాచారం లేదని సీఈ బదులిచ్చారు. ఇన్‌ఫ్రా, సముద్రపు తీర ప్రాజెక్టుల్లో, మహారాష్ట్రలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణంలో వీటిని వినియోగిస్తున్నారని, వీటి డిజైన్లకు మార్గదర్శకాలు లేకపోవడంతో బ్రిటిష్ కోడ్‌ను అనుసరించామని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీలో ఆర్‌సీసీ కటాఫ్, షీట్‌పైల్స్‌కి బదులు సీకెంట్ పైల్స్‌తో కటాఫ్ వాల్ నిర్మించాలని ప్రాజెక్టు క్షేత్ర స్థాయి ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ నిర్ణయం తీసుకుందని చెప్పారు.
సీడీవో విభాగం సరైన డిజైన్లు ఇవ్వకపోవడంతోనే మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ కుంగిందనే ఆరోపణల్లో వాస్తవం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. డిజైన్ల రూపకల్పన సందర్భంగా.. మేడిగడ్డ బ్యారేజీ నుంచి విడుదలయ్యే వరద వేగాన్ని సరైన రీతిలో పరిగణనలోకి తీసుకోలేదని, వరద నేలను తాకే చోట మట్టికోతకు గురికాకుండా దిగువన సరిపడ నీటి నిల్వలతో టెయిల్‌పాండ్ ఉండాలన్న ఆలోచన కూడా చేయలేదని కమిషన్ అడగ్గా.. అందులో వాస్తవం లేదని చంద్రశేఖర్ అన్నారు. అధిక షూటింగ్ వెలాసిటీ ఉండనుందని క్షేత్ర స్థాయి ఇంజనీర్ల నుంచి తమకు లెక్కలు అందలేదన్నారు.
Updated Date - Oct 26 , 2024 | 04:03 AM