Share News

Kaleshwaram Project: నామినేషన్‌పైనే డీపీఆర్‌ పనులు

ABN , Publish Date - Oct 27 , 2024 | 04:54 AM

కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ రూపకల్పన పనులను టెండర్లు పిలవకుండా నామినేషన్‌పైనే అప్పగించామని రామగుండం చీఫ్‌ ఇంజనీర్‌ కె.సుధాకర్‌రెడ్డి.. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌కు తెలిపారు.

Kaleshwaram Project: నామినేషన్‌పైనే డీపీఆర్‌ పనులు

నాటి ఇరిగేషన్‌ మంత్రి వల్లే ఇచ్చాం.. వరద ప్రవాహ వేగానికి అనుగుణంగా కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లు జరగలేదు

  • జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌కు తెలిపిన రామగుండం చీఫ్‌ ఇంజనీర్‌ సుధాకర్‌రెడ్డి

హైదరాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ రూపకల్పన పనులను టెండర్లు పిలవకుండా నామినేషన్‌పైనే అప్పగించామని రామగుండం చీఫ్‌ ఇంజనీర్‌ కె.సుధాకర్‌రెడ్డి.. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌కు తెలిపారు. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావే ఇందుకు కారణమన్నారు. బ్యారేజీల డిజైన్లు.. వరద ప్రవాహ వేగానికి అనుగుణంగా జరగలేదన్నది వాస్తవమని చెప్పారు. కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ శనివారం సుధాకర్‌రెడ్డిని క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసింది. ఈ సందర్భంగా నిర్మాణ పనులు జరిగాయో, లేదో చూసుకోకుండానే సబ్‌స్టాన్షియల్‌ కంప్లీషన్‌ సర్టిఫికెట్‌(ఎ్‌సఎ్‌ససీసీ)పై కౌంటర్‌ సంతకాలు చేస్తారా?


ఏయే కాంపోనెంట్‌లలో ఏ మేరకు పని జరిగిందనే వివరాలు చూసుకోకుండా, బ్యారేజీలను కూడా పరిశీలించకుండా సంతకాలు చేస్తారా? అంటూ ప్రశ్నించింది. స్పృహ కోల్పోయి రబ్బరు స్టాంపులా వ్యవహరించారా? పనులు సంపూర్ణంగా జరిగాయో, లేదో పరిశీలించుకోవాల్సిన బాధ్యత లేదా? అని కమిషన్‌ నిలదీసింది. దీనికి సుధాకర్‌రెడ్డి బదులిస్తూ, ‘‘నాకున్న స్పృహతో పనులన్నీ జరిగాయనే కౌంటర్‌ సంతకం చేశాను. జీవో 94 ప్రకారం కౌంటర్‌ సంతకం చేసే ముందు తనిఖీలు చేయాలని ఎక్కడా లేదు. ఆ జీవోను అనుసరించే ఎస్‌ఎ్‌ససీసీపై కౌంటర్‌ సంతకాలు చేశాను’’ అని చెప్పారు. దాంతో కమిషన్‌ జోక్యం చేసుకుంటూ, ‘మీకు మీరుగా ఉచ్చులో పడుతున్నారు’ అని చురక అంటించింది.


కమిషన్‌: మేడిగడ్డ బ్యారేజీ పూర్తయిన తర్వాత కాఫర్‌ డ్యామ్‌, సంబంధిత షీట్‌పైల్స్‌ పూర్తిగా తొలగించకపోవడంతో వరద ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి బ్యారేజీ దెబ్బతిన్నది. ఇది నిర్లక్ష్యం కాదా?

సుధాకర్‌రెడ్డి: ‘పాక్షికంగా నిజమే.

కమిషన్‌: నిర్మాణసంస్థ కాఫర్‌ డ్యామ్‌ను ఎందుకు తొలగించలేదు? ఆ పనులకు తొలి సవరణ అంచనాల్లో 61.21 కోట్లు కేటాయించారా?

సుధాకర్‌రెడ్డి: కొన్నిచోట్ల కాఫర్‌ డ్యామ్‌ కోసం వినియోగించిన షీట్‌పైల్స్‌ను పూర్తిగా తొలగించలేదు.

కమిషన్‌: 2019లో వచ్చిన వరదలతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలకు నష్టం జరిగిందా?నిర్మాణ సంస్థలు మరమ్మతులు చేశాయా?

సుధాకర్‌రెడ్డి: అన్నారం, సుందిళ్లకు మరమ్మతులు జరిగినా.. మేడిగడ్డలో మరమ్మతులు జరగలేదు.

కమిషన్‌: దేశంలో జలాశయాల నిర్మాణంలో సీకెంట్‌పైల్స్‌ వినియోగించడం లేదు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో వాటిని ఎందుకు వాడాల్సి వచ్చింది?

సుధాకర్‌రెడ్డి: ఆర్‌సీసీ కటాఫ్‌ లేదా సీకెంట్‌ పైల్స్‌ వాడాలని సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌(సీడీవో) సిఫారసు చేయగా... ఆర్‌సీసీ కటాఫ్‌ వాల్‌ కన్నా ఖర్చు తక్కువ అని సీకెంట్‌ పైల్స్‌ను వినియోగించాం. బ్యారేజీల వైఫల్యంపై ఎన్‌డీఎ్‌సఏ ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదు.

కమిషన్‌: కోల్‌బెడ్‌పై మేడిగడ్డ నిర్మాణం జరిగిందా? జాదవ్‌పూర్‌ వర్సిటీ నివేదికలో ఉంది కదా?

సుధాకర్‌రెడ్డి: బ్యారేజీ కోసం వేసిన పలు బోర్‌హోల్స్‌లో ఒక్కదాంట్లోనే చిన్న మోతాదులో బొగ్గు లభ్యమైంది. ఇతర హోల్స్‌లో దొరకలేదు.

కమిషన్‌: గేట్ల ఆపరేషన్‌ షెడ్యూల్‌కు విరుద్ధంగా గేట్లు ఎత్తడంతోనే బ్యారేజీ దిగువ భాగంలో అఫ్రాన్‌, సీసీ బ్లాకులు దెబ్బతిన్నాయా?

సుధాకర్‌రెడ్డి: బ్యారేజీల్లో పూర్తిస్థాయిలో నీటి నిల్వ ఉన్న సమయంలో గేట్లను ఎత్తే క్రమంలో వరద ప్రవాహ వేగం పెరిగి.. దిగువ భాగంలో అఫ్రాన్‌, సీసీ బ్లాకులు దెబ్బతిన్నాయి. వరద ప్రవాహానికి అనుగుణంగా డిజైన్లు జరగలేదనేది వాస్తవం.

కమిషన్‌: సబ్‌స్టాన్షియల్‌ కంప్లీషన్‌ సర్టిఫికెట్‌కు కంప్లీషన్‌ సర్టిఫికెట్‌కు ఉన్న తేడాలేంటి?


సుధాకర్‌రెడ్డి: ఇంజనీరింగ్‌ ఇన్‌చార్జి(ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌) తృప్తి మేరకు పనులు జరిగి.. వినియోగానికి సిద్ధంగా ఉండేలా పనులు జరిగితే సబ్‌స్టాన్షియల్‌ కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు. ప్రాజెక్టులోని అన్ని కాంపోనెంట్ల పనులు పూర్తిగా, అగ్రిమెంట్‌కు అనుగుణంగా జరిగితే కంప్లీషన్‌ సర్టిఫికెట్‌(సీసీ) ఇస్తారు. 2019లో మేడిగడ్డకు ఎస్‌ఎ్‌ససీసీ ఇస్తే, 2021లో సుందిళ్లకు సీసీ ఇచ్చాం. మేడిగడ్డకు ఈఈగా ఉన్న బీవీ రమణారెడ్డి జారీ చేస్తే... నేను కౌంటర్‌ సంతకం చేశాను. సుందిళ్లకు ఈఈ తిరుపతిరావు సీసీ ఇస్తే... కౌంటర్‌ సంతకం ఎస్‌ఈగా ఉన్న బీవీ రమణారెడ్డి పెట్టారు.

కమిషన్‌: కాళేశ్వరం కార్పొరేషన్‌ను ఎప్పుడు ఏర్పాటుచేశారు? ఆ సమయంలో మంత్రి ఎవరు?

సుధాకర్‌రెడ్డి: కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎస్పీవీగా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశాం. ఆ సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగాహరీశ్‌రావు ఉన్నారు.

కమిషన్‌: బ్యారేజీల వాస్తవిక నిర్మాణ అంచనా వ్యయం ఎంత? ఎవరు ఆమోదించారు?

సుధాకర్‌రెడ్డి: బ్యారేజీల అంచనాలను రెండుసార్లు సవరించారు. సవరణ అంచనాలను స్టేట్‌ లెవల్‌ స్టాండింగ్‌ కమిటీలో చర్చించిన తర్వాత ప్రభుత్వానికి పంపిస్తే.. అప్పటి నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆమోదం తెలిపారు.

Updated Date - Oct 27 , 2024 | 04:54 AM