కుష్ఠు నివారణకు ఇంటింటా సర్వే
ABN , Publish Date - Mar 16 , 2024 | 12:43 AM
కుష్ఠు వ్యాధి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. 2027 వరకు కుష్ఠు వ్యాధి కేసులను జీరోకు తగ్గించాలని ఏటా ఇంటింటి సర్వే చేస్తోంది. ముందస్తుగానే లక్షణాలు గుర్తించి వైద్య సేవలు అందిస్తోంది.
(ఆంఽధ్రజ్యోతి సిరిసిల్ల)
కుష్ఠు వ్యాధి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. 2027 వరకు కుష్ఠు వ్యాధి కేసులను జీరోకు తగ్గించాలని ఏటా ఇంటింటి సర్వే చేస్తోంది. ముందస్తుగానే లక్షణాలు గుర్తించి వైద్య సేవలు అందిస్తోంది. కుష్ఠు వ్యాధి ప్రాణాంతకమైనది కాకపోయిన నిర్లక్ష్యం చేస్తే శాశ్వత వైకల్యానికి గురవుతారు. ఆ పరిస్థితులు రాకుండా జాతీయ ఆరోగ్య మిషన్ ప్రత్యేక సర్వేను ఏటా చేపడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొవిడ్ సమయంలో 2020లో సర్వే నామమాత్రంగా సాగింది. 2021లో సర్వే చేపట్టలేదు. ఈ క్రమంలో కుష్ఠు వ్యాధి లక్షణాలు ఎక్కువ మందిలో కనిపిస్తున్నాయని భావించి సర్వేను 2022లో డిసెంబరులో 6 నుంచి 22 వరకు సర్వే చేపట్టారు. 2023లో ఆగస్టు 16 నుంచి 31 వరకు ఇంటింటా లెప్రసీ సర్వే నిర్వహించారు. సర్వేలో లక్షణాలు కనిపించిన వారికి పరీక్షలు జరిపి మందులు ఇచ్చారు. ఎనిమిది మందిని గుర్తించారు. ఇదే క్రమంలో ఈ సంవత్సరం ఈ నెల 11న సర్వే ప్రారంభించారు. సర్వే ఈ నెల 24 వరకు కొనసాగనుంది. కుష్ఠు వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే అంగవైకల్యానికి దారి తీస్తుంది. ముందుగానే గుర్తిస్తే అంగవైకల్యం రాకుండా అరికట్టడం సులువు అవుతుందని భావిస్తున్నారు. వ్యాధిని అరికట్టడం చాలా సులువుగా మారినా ప్రజల్లో, కుటుంబ సభ్యుల్లో వారి పట్ల చిన్నచూపు కనిపిస్తోంది.
జిల్లాలో 484 సర్వే బృందాలు
జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 5 లక్షల 52 వేల జనాభా ఉంది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 4.35 లక్షల జనాభా ఉంది. వీటి ఆధారంగా 14 రోజులపాటు 484 బృందాలుగా వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పరీక్షలు చేస్తున్నారు. జిల్లాలోని 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 2 అర్బన్ హెల్త్ సెంటర్‌లు, నాలుగు 24 గంటల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సిరిసిల్ల జిల్లా ఆసుపత్రి, వేములవాడ ఏరియా ఆసుపత్రి, 89 ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో ఆశావర్కర్ల బృందాలు సర్వే చేస్తున్నాయి. ఒక్కో బృందానికి ఆరోగ్య కేంద్రాల పరిధిలో నోడల్ సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు పర్యవేక్షించారు. దీంతోపాటు కుష్ఠు వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి కరపత్రాలు, బ్యానర్ల ద్వారా ప్రచారం చేశారు.
జిల్లాలో 490 మంది అనుమానితుల గుర్తింపు
జిల్లాలో జాతీయ కుష్ఠు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా వ్యాధి గ్రస్థులను గుర్తించే దిశగా కొనసాగుతున్న ఇంటింటి సర్వేలో ఇప్పటి వరకు లక్షా 55 వేల 870 మందికి పరీక్షలు చేశారు. ఇందులో 490 మందిని అనుమానితులుగా గుర్తించారు. వీరిలో ఐదుగురికి బహుళ ఔషద చికిత్సను అందిస్తున్నారు. మిగతా అనుమానిత వ్యక్తులకు త్వరలో పూర్తిస్థాయిలో పరీక్షలు చేయనున్నారు. జిల్లాలో ప్రస్తుతం 24 మంది చికిత్స పొందుతున్నారు. కుష్ఠు వ్యాధిని గుర్తించిన వారికి అవసరమైన మందులు ఇచ్చారు. శాశ్వత అంగవైకల్యానికి గురికాకుండా అవసరమైన వారికి హైదరాబాద్‌లో శస్త్ర చికిత్స చేయిస్తున్నారు. శస్త్ర చికిత్స అనంతరం వారికి పౌష్టికాహారం, ఇతర అవసరాలకు రూ.5 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ప్రభుత్వ పరంగా పింఛన్లతోపాటు ఎంసీఆర్, మందుల కిట్లు అందిస్తున్నారు. జిల్లా ఇన్‌చార్జి వైద్యా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత, ఆధ్వర్యంలో సర్వే కొనసాగుతోంది. డిప్యూటీ పారామెడికల్ అధికారి చేపూరి శ్రీనివాస్, కూనసురేష్, రేవూరి కాశీనాథం, రెబెల్లి శ్రీనివాసస్వామి పర్యవేక్షిస్తున్నారు.
లెప్రసీ లక్షణాలు
ఫ కుష్టు వ్యాది మైక్రో బాక్టీరీయమ్ లేప్రేతో వస్తుంది. ఒకరి నుంచి ఒకరికి అంటుకోదు.
ఫ వ్యాధిక్రిములు శరీరంలోకి ప్రవేశించిన తరువాత రెండు నుంచి ఏడు రోజుల్లో లక్షణాలు బయటపడుతాయి. ఈ వ్యాధితో చర్మం, మ్యూకస్ మెంబ్రేన్ నరాలు రోగానికి గురవుతాయి. రోగ నిరోధకశక్తిని బట్టి లక్షణాలు మారుతుంటాయి. రోగి సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఉండడంతో దుమ్ము దూళీ, ఊపిరిద్వారా లోపలికి చేరుకొని రోగనిరోధకశక్తి తగ్గుతుంది. జబ్బును చాలా ముందుగా తేలికగానే తెలుసుకోవచ్చు. రంగు తగ్గిన మచ్చలు, చుట్టూ ఉన్న చర్మంతో పోలిస్తే మచ్చలు పాలిపోయినట్లు ఉంటాయి. మచ్చలు గుండ్రటి అకారంలో ఉండి వేడి, నొప్పి, స్పర్శ తెలియకపోవడం ప్రధానంగా స్పర్శ జ్ఞానం కనిపించదు. చర్మం మీద మచ్చల ప్రాంతానికి వచ్చే నాడులు వాపు తేలడం, మోకాలి వెలుపల పక్కన, మోచేయి లోతట్టున, మెడలోనూ లావెక్కిన నాడులు కనిపిస్తాయి. నొప్పి, దురద, పుండ్లు వచ్చి మానకపోవడం, ముఖం మీద చర్మం మందంగా తేలి ఉండడం, కనుబొమ్మలు వెంట్రుకలు రాలిపోవడం, పాదాలు, చేతులు శక్తి హీనమై వంకరలు తిరుగుతుంటాయి. తెల్లమచ్చలు ఉన్నచోట స్కిన్ క్లిప్ పరీక్ష చేసి క్రిములను గుర్తించి వైద్యాన్ని అందిస్తారు. కుష్ఠు లక్షణాలు ఉన్నావారు కంటి విషయంలోనూ, అవయవాలపై జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా సురక్షితమైన మందులను అందిస్తున్నారు.
సకాలంలో గుర్తిస్తే తగ్గించుకోవచ్చు
- డాక్టర్ రజిత, జిల్లా ఇన్‌చార్జి వైద్యాధికారి
కుష్ఠు వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలి. సకాలంలో గుర్తిస్తే మందులతో సులువుగా తగ్గించుకోవచ్చు. వ్యాధి లక్షణాలను గుర్తించి వారికి మందులు అందించడానికి ఈ నెల 24 వరకు సర్వే కొనసాగుతుంది. సర్వే బృందాలు ఇంటింటికి వెళ్లి లక్షణాలను గుర్తిస్తున్నారు. చికిత్సతోపాటు మందులు కూడా అందిస్తున్నాం. చర్మంపై తెల్లని, ఎర్రని రాగి వర్ణంలో స్పర్శ లేకుండా మొద్దుబారిన మచ్చలు ఉన్నా , ముఖంపై నూనె పోసినట్లు, చెవులపై బొడిపెలు కలిగి ఉండడం, ముక్కు నొక్కబడి ఉండడం, నరాల్లో నొప్పి తిమ్మిర్లు వంటివి ఉంటే వైద్య బృందాలను సంప్రదించాలి. వ్యాధిని ప్రారంభదశలోనే గుర్తించి చికిత్స అందిస్తే అంగవైకల్యం రాకుండా నిరోధించవచ్చు.