Komatireddy Venkat Reddy: మామ చాటు అల్లుడిగా.. 10 వేల కోట్లు దోచుకున్నావ్!
ABN , Publish Date - Dec 19 , 2024 | 04:21 AM
మామ చాటు అల్లుడిగా 10 వేల కోట్లు దోచుకున్నావ్ అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుపై రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు.
కాళేశ్వరం.. కమీషన్లు.. హరీశ్‌రావు
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శ
అసెంబ్లీకి మద్యం తాగి వస్తున్నారు.. బ్రీత్ అనలైజర్లు పెట్టాలి: హరీశ్‌రావు
సభకు డుమ్మా కొట్టి తాగి ఫామ్‌హౌస్‌లో పన్నడు
కాంగ్రెస్ ప్రత్యారోపణ,అసెంబ్లీలో రచ్చ
హైదరాబాద్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): మామ చాటు అల్లుడిగా 10 వేల కోట్లు దోచుకున్నావ్ అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుపై రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం.. కమీషన్లు.. హరీశ్‌రావు.. అని ఎద్దేవా చేశారు. బుధవారం శాసనసభ ప్రారంభమైన వెంటనే సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానమిచ్చారు. కరీంనగర్-కామారెడ్డి-ఎల్లారెడ్డి రహదారిని జాతీయ రహదారిగా మార్చే అంశంపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ.. ‘రోడ్డుపై గుంతలు చూపిస్తే ఒక్కో గుంతకు ఒక వెయ్యి రూపాయలు బహుమతిగా ఇస్తామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కానీ, రోడ్లన్నీ గుంతలమయంగానే ఉన్నాయి. గత ప్రభుత్వం కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఇతర ప్రాజెక్టులను, రహదారులను పూర్తిగా విస్మరించింది’ అని ఆరోపించారు.
ఫామ్‌హౌ్‌సకు నాలుగు లైన్ల రహదారి వేసుకున్నారన్నారు. రూ.లక్ష కోట్లు విలువచేసే ఔటర్ రింగ్ రోడ్డును గత ప్రభుత్వం రూ.7 వేల కోట్లకు అమ్ముకుందని విమర్శించారు. బీఆర్‌ఎస్ సభ్యులు మంగళవారం చేతులకు బేడీలతో సభకు హాజరుకావటాన్ని ప్రస్తావిస్తూ.. రేపో మాపో నిజంగానే పోలీసులు వచ్చి మిమ్మల్ని బేడీలు వేసి తీసుకెళ్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. మంత్రి వ్యాఖ్యలపై హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలోకి కొందరు ఉదయాన్నే తాగి వచ్చినట్టుంది.. అసెంబ్లీలోనూ బ్రీత్ అనలైజర్ ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలు ప్రతిపక్ష నాయకుడి హోదా కట్టబెడితే.. అసెంబ్లీకి రాకుండా డుమ్మా కొట్టి తాగి ఫామ్ హౌస్‌లో పడుకుంటున్నాడు.. అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. దీనిపై బీఆర్‌ఎస్ సభ్యులు నిరసన తెలుపుతూ స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. మద్యంపై హరీశ్‌రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు సభాపతి ప్రకటించారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలూ ధరణి బాధితులే: పొంగులేటి
ధరణి స్థానంలో భూభారతి బిల్లును రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేలాది పుస్తకాలు చదివిన మేధావి తెచ్చిన ధరణితో వేలాదిమంది అవస్థలు పడ్డారన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో 1398 ఎకరాల గిరిజనుల భూమిని ధరణిలో అటవీ భూమిగా పేర్కొన్నారని ఉదహరించారు. ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ ఎంపీటీసీ తన దృష్టికి తెచ్చారని, ఇలాంటి ఉదాహరణలు రాష్ట్రంలో కోకొల్లలుగా ఉన్నాయని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. కేసీఆర్ ఎవరినీ సంప్రదించకుండా గడిలో కూర్చుని ఏకపక్షంగా ధరణిని రాత్రికిరాత్రి అమలు చేశారని విమర్శించారు.
మహిళలకు ఉచిత ప్రయాణం.. ప్రతిపక్షాల ఓర్వలేనితనం: సీతక్క
మంగళవారం నల్ల షర్టులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. బుధవారం ఆటోడ్రైవర్ల యూనిఫాంలో వచ్చారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించటం వల్ల ఆటోడ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను సభ దృష్టికి తెచ్చేందుకే ఇలా వచ్చామని వారు తెలిపారు. సభ సజావుగా జరగకుండా, కేవలం ఆందోళనలు చేయాలన్న లక్ష్యంతోనే సభకు వస్తున్నారంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. దొంగల్లా రోజుకో వేషం మారుస్తున్నారని విమర్శించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఆటోడ్రైవర్లపై ప్రేమ ఉంటే అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఓలా, ఊబర్‌లను ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు.
ఎందుకు వచ్చామనిపిస్తోంది?: ఎమ్మెల్యే మదన్‌మోహన్
కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ.. ప్రతిపక్షాల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘21 ఏళ్లుగా అసెంబ్లీలో ఉన్నానని హరీశ్ చెబుతుంటారు. ఇంత సీనియార్టీ ఉన్నా సభా మర్యాదలు పాటించడం లేదు. నిన్న సభలో ప్రవేశపెట్టిన పర్యాటక విధానంపై మాట్లాడాలని 3 రోజులుగా సిద్ధమయ్యా. కానీ మాట్లాడే అవకాశమే దక్కలేదు. సభను విపక్ష సభ్యులుమాటిమాటికి అడ్డుకుంటున్నారు. బయట ప్రజల్లోకి వెళ్తే సిగ్గుపోతోంది’ అని పేర్కొన్నారు.