KTR: రియల్ వ్యాపారం కోసమే మూసీ డ్రామా
ABN, Publish Date - Oct 28 , 2024 | 04:50 AM
‘‘రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే మూసీ పునరుజ్జీవం పేరిట డ్రామా ఆడుతున్నారు. మూసీ పేరు చెప్పి కాంగ్రెస్ దోపిడీకి సిద్ధమైంది. మూసీ బ్యూటిఫికేషన్‌కు మేము వ్యతిరేకం కాదు.. లూటిఫికేషన్‌కు మాత్రమే వ్యతిరేకం’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
పునరుజ్జీవం పేరిట కాంగ్రెస్ దోపిడీ
పథకాలకు పైసల్లేవంటున్న సర్కార్‌కు
‘మూసీ’కి లక్షన్నర కొట్లు ఎక్కడివి?: కేటీఆర్
మల్లాపూర్, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ‘‘రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే మూసీ పునరుజ్జీవం పేరిట డ్రామా ఆడుతున్నారు. మూసీ పేరు చెప్పి కాంగ్రెస్ దోపిడీకి సిద్ధమైంది. మూసీ బ్యూటిఫికేషన్‌కు మేము వ్యతిరేకం కాదు.. లూటిఫికేషన్‌కు మాత్రమే వ్యతిరేకం’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆదివారం నాచారం ఎస్టీపీని ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగడంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ కృషి ఎంతో ఉందని, రూ.20వేల కోట్లతో మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రచించామని చెప్పారు.
ఇప్పుడు రేవంత్ సర్కార్ లక్షన్నర కొట్లతో మూసీ సుందరీకరణ అంటోందని, దీని వెనుక ఢిల్లీకి మూటలు పంపడమే లక్ష్యంగా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఎస్టీపీల (మురుగు నీటి శుద్ధి కేంద్రాలు) వల్ల మురుగు నీరు శుద్ధి అవుతోందన్నారు. అప్పుడు ఎస్టీపీల కోసం సుమారు రూ.4వేల కోట్లు నిధులు కేటాయించామని, ఆనా డు నిర్మించిన ఎస్టీపీలనే ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తున్నారన్నారు. రుణమాఫీకి, రైతుబంధుకు ప్రభుత్వం వద్ద పైసలు లేవని మంత్రులు అంటున్నారని, అలాంటప్పుడు మూసీ పునరుజ్జీవనానికి రూ.లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీల అమలుపై నోరెత్తని కాంగ్రెస్ ప్రభుత్వం.. మూసీ అభివృద్ధి గురించి ప్రయత్నాలు చేస్తోందని, దీని వెనక ఉన్న విషయమేంటో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
Updated Date - Oct 28 , 2024 | 04:50 AM