Kaleshwaram project: 2 వరకు గడువు..
ABN , Publish Date - Jul 27 , 2024 | 03:24 AM
కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి, గోదావరి ఎగువన ఉన్న రిజర్వాయర్లను నింపాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి కాళేశ్వరం నీటిని ఎత్తిపోయాలి
లేదంటే 50వేల మంది రైతులతో కదిలి మోటార్లు రన్ చేస్తాం
రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ హెచ్చరిక
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో కన్నెపల్లి, మేడిగడ్డ సందర్శన
వరంగల్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి, గోదావరి ఎగువన ఉన్న రిజర్వాయర్లను నింపాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయ కక్షలకు పోయి రైతులను ఆగం చేయొద్దని కోరారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో కలిసి శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్‌హౌస్, మేడిగడ్డ బ్యారేజీలను కేటీఆర్ సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వర్షాలు పూర్తి స్థాయులో లేక రైతులు ఇబ్బంది పడుతుంటే.. ప్రభుత్వం భేషజాలకు పోయి కాళేశ్వరం నీటిని ఎత్తిపోయడం లేదని ఆరోపించారు. కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ప్రభుత్వానికి ఆగస్టు 2 వరకు గడువు ఇస్తున్నామని, లేదంటే అసెంబ్లీ సమావేశాలు ముగిశాక కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
అసెంబ్లీ, మండలిలో తమ సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని.. స్పందించకుంటే వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, పాలేరు, సూర్యాపేట, భువనగిరి, సిద్దిపేట, కామారెడ్డి, నిజమాబాద్, కరీంనగర్ నుంచి 50 వేల మందికి పైగా రైతులను కన్నెపల్లి పంప్ హౌస్‌కు తరలించి, వారితో మోటార్లను ఆన్ చేస్తామని ప్రకటించారు. మహారాష్ట్రలోని బాబ్లీ నుంచి గోదావరిలోకి ఇప్పట్లో వరద కష్టమేనని, దీంతో కాళేశ్వరం ఎగువన గోదావరి ఎడారిగా మారిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కన్నెపల్లిలో 17 మోటార్లు కండిషన్‌లోనే ఉన్నాయని, ఎల్లంపలి, శ్రీరాంసాగర్, మిడ్‌మానేరు, ఎల్‌ఎండీ, కొండపోచమ్మ, మల్లన్నసాగర్, నిజాంసాగర్, వరద కాలువకు ఎత్తిపోస్తే 100 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందన్నారు. 30 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నప్పటికీ కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయొచ్చని ఇంజనీర్లు చెబుతున్నారని, ప్రస్తుతం 10లక్షలకు పైగా క్యూసెక్కుల ప్రవాహం ఉందని, మోటార్లు రన్ చేసి రోజుకు 3 టీఎంసీల గోదావరి నీటిని లిఫ్ట్ చేయొచ్చన్నారు.
నీటి నిల్వపై ఎన్‌డీఎ్‌సఏవి పచ్చి అబద్ధాలు
కేసీఆర్ పంచభక్ష పరమాన్నాలను పళ్లెంలో పెట్టి ఇస్తే.. ఎలా వినియోగించుకోవాలో ప్రభుత్వానికి తెలియడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం వందకు పైగా విభాగాలతో ముడిపడి ఉందని, మేడిగడ్డలో చిన్న లోపాన్ని చూపించి మొత్తం ప్రాజెక్టే పనికిరాదనేలా ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మేడిగడ్డ నుంచి 10.60 లక్షల క్యూసెక్కుల వరద వెళ్తున్నా బ్యారేజీకి ఎలాంటి ముప్పు తలెత్తని విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, మేడిగడ్డ లోపాన్ని అడ్డుపెట్టుకుని కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూశారని అన్నారు. కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోస్తే కేసీఆర్‌కు ఎక్కడ పేరు వస్తుందోననే అక్కసుతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయొద్దని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆఽథారిటీ ఇచ్చిన నివేదికలు పచ్చి అబద్ధమని కొట్టిపడేశారు. గోదావరిలో నీళ్లున్నాయని, బటన్ ఒత్తితే తీసుకెళ్లవచ్చునని, లేనిదల్లా రాజకీయ సంకల్పమేనని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో గోదావరి నిండుకుండాలా ఉండేదని, ఇప్పుడు ఎండిపోయిందని అన్నారు. కాగా, కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వరాలయంలో కేటీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. గోదావరిలో ప్రాణహిత కలిసే త్రివేణి సంగమం వద్దకు వెళ్లి ప్రాణహిత ప్రవాహన్ని పరిశీలించారు. కన్నెపల్లిలో మోటార్లను పరిశీలించారు. ఇంజనీర్లతో మాట్లాడారు.