KTR: హ్యాపీ బర్త్‌డే రేవంత్‌రెడ్డీ..హైదరాబాద్‌లోనే ఉన్నా!
ABN , Publish Date - Nov 09 , 2024 | 04:36 AM
‘ముందుగా మీకు హ్యాపీబర్త్‌డే.. నేను హైదరాబాద్‌లోనే ఉన్నా.. రేవంత్‌రెడ్డీ.. మీ ఏసీబీలాంటి ప్రభుత్వ ఏజెన్సీలను ఎప్పుడు పంపినా స్వాగతం. మీరు పంపేవాళ్లకు చాయ్.. ఉస్మానియా బిస్కెట్‌తోపాటు, వారు కట్ చేస్తామంటే మీ బర్త్‌డే కేక్‌ను కూడా నేనే ఇప్పిస్తా’ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఎక్స్ వేదికగా వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ ఏజెన్సీలు ఎప్పుడొచ్చినా స్వాగతం
పాలన తెలియని నీకు పగ్గాలు అప్పగిస్తే..
ప్రజల బతుకుల్లో మన్నుపోసినవ్: కేటీఆర్
మీ ఏజెన్సీలు ఎప్పుడొచ్చినా స్వాగతం.. మూసీ బాధితులు ఇక్కడుంటే నల్గొండకు ఎందుకెళ్లావ్?
పాలన తెలియని నీకు పగ్గాలు అప్పగిస్తే ప్రజల బతుకుల్లో మన్నుపోసినవ్: కేటీఆర్
హైదరాబాద్, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ‘ముందుగా మీకు హ్యాపీబర్త్‌డే.. నేను హైదరాబాద్‌లోనే ఉన్నా.. రేవంత్‌రెడ్డీ.. మీ ఏసీబీలాంటి ప్రభుత్వ ఏజెన్సీలను ఎప్పుడు పంపినా స్వాగతం. మీరు పంపేవాళ్లకు చాయ్.. ఉస్మానియా బిస్కెట్‌తోపాటు, వారు కట్ చేస్తామంటే మీ బర్త్‌డే కేక్‌ను కూడా నేనే ఇప్పిస్తా’ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఎక్స్ వేదికగా వ్యాఖ్యలు చేశారు. ‘అరెస్టు భయంతో నేను మలేషియాకు వెళ్తున్నానని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఎక్కడికీ వెళ్లలేదు. ఇక్కడే ఉన్నాను. మూసీ బాధితులు హైదరాబాద్‌లో ఉంటే నల్లగొండకు ఎందుకు వెళ్లావ్.. కూల్చిన ఇండ్లెక్కడ? కాలిన కడుపులెక్కడ? నువ్ తిరుగుతున్న ప్రాంతం ఎక్కడ? నీ కుట్రలకు అంబర్‌పేట్, అత్తాపూర్, గోల్నాక, దిల్‌సుఖ్‌నగర్ అతలాకుతలం అవుతుంటే.. అయ్యా సంబరాల రాంబాబు నువ్ చేస్తున్న పాదయాత్ర ఎక్కడ? మూసీ పరివాహక ప్రాంత రైతులను కలవడంలో మీ ఆంతర్యం ఏమిటి? మోకాలికి దెబ్బతగిలితే బోడిగుండుకు కుట్లు వేసినట్టు గుంపుమేస్త్రీ పాలన ఉంది.
నల్లగొండలో కాదు ఇటు వైపురా. బాధితులు ఉన్నచోట నీ పాదాలమీద యాత్ర చెయ్యి. పాలన తెలియని నీకు పగ్గాలు అప్పగిస్తే ప్రజల బతుకుల్లో మన్నుపోసినవ్. నాయకత్వమంటే కూల్చడం కాదు. నిర్మించడం. దారి తప్పడంకాదు దారి చూపడమని తెలుసుకో..’ అని కేటీఆర్ సీఎం రేవంత్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. సీఎం మూసీ పాదయాత్ర నేపథ్యంలో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాపాలన అంటూనే.. ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటనలు చేసిన ప్రతిసారి తమ పార్టీ నేతలను ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టుల పేరుతో నిర్బంధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే తమ నేతల హక్కులను కాలరాస్తున్నారని, అయినా.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు.. ఆ పార్టీ నేతల అవినీతిపై నిరంతరం ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. నిర్బంధంలోకి తీసుకున్న కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భూపాల్‌రెడ్డి, ఇతర నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.