బాయిల్డ్ మిల్లుల వైపే మొగ్గు..
ABN , Publish Date - Nov 11 , 2024 | 01:18 AM
ఈ వర్షాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యాన్ని సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద బాయిల్డ్ రైస్ మిల్లులకే ఇచ్చేందుకు అధికారులు మొగ్గు చూపుతున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద రా రైస్‌మిల్లర్లకు ఇచ్చిన ధాన్యాన్ని సకాలంలో బియ్యంగా మార్చి ఇవ్వకపోవడమే కారణమని తెలుస్తున్నది.
- జిల్లాలో 118 మిల్లులకు ధాన్యం కేటాయింపు
- అందులో 110 బాయిల్డ్ మిల్లులే..
- డిఫాల్ట్ జాబితాలో 35కు పైగా మిల్లులు
- ఊపందుకున్న వరి ధాన్యం కొనుగోళ్లు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ఈ వర్షాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యాన్ని సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద బాయిల్డ్ రైస్ మిల్లులకే ఇచ్చేందుకు అధికారులు మొగ్గు చూపుతున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద రా రైస్‌మిల్లర్లకు ఇచ్చిన ధాన్యాన్ని సకాలంలో బియ్యంగా మార్చి ఇవ్వకపోవడమే కారణమని తెలుస్తున్నది. జిల్లాలో 35 నుంచి 40 రైస్ మిల్లులను డిఫాల్టర్ల జాబితాలో చేర్చారు. ప్రభుత్వం గ్రామగ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేస్తున్నది. ఆ ధాన్యాన్ని మర ఆడించి బియ్యాన్ని ఎఫ్‌సీఐకి పెట్టేందుకు, రాష్ట్ర పౌర సరఫరాల అవసరాల కోసం బియ్యం కోసం సీఎంఆర్ కింద రైస్ మిల్లర్లకు అప్పగిస్తున్నారు. క్వింటాలు ధాన్యం ఇస్తే 67 కిలోల బియ్యం మిల్లర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ధాన్యం మర ఆడించినందుకు ప్రభుత్వం చార్జీలు ఇస్తుంది. బియ్యం పట్టగా వచ్చే తవుడు, ఊక, నూకలన్నీ మిల్లర్లకే చెందుతాయి. ఎలాంటి షరతులు లేకుండా పౌర సరఫరాల శాఖాధికారులు ప్రతి సీజన్‌లో రైస్ మిల్లులకు ధాన్యాన్ని కేటాయిస్తున్నారు. జిల్లాలో 220కి పైగా రా రైస్ మిల్లులు, పారాబాయిల్డ్ రైస్ మిల్లులు ఉన్నాయి. వర్షాకాలంలో పండించే ధాన్యాన్ని ఎక్కువగా రా రైస్ మిల్లులకు కేటాయిస్తారు. యాసంగి సీజన్‌లో పండించే ధాన్యాన్ని బాయిల్డ్ మిల్లులకు ఇస్తుంటారు. మిల్లర్లకు ఇచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లింగ్ చేసి బియ్యం ఇవ్వాల్సి ఉండగా, కొందరు ఆ ధాన్యాన్ని బయట మార్కెట్‌లో విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. సీఎంఆర్ ఇవ్వడంలో తీవ్ర జాప్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 2020-21, 2021-22 సీజన్లలో జిల్లాలోని మంథని మండలం కూచిరాజ్‌పల్లి వద్దగల మారుతి, వెంకటసాయి, లక్ష్మిప్రసన్న రైస్‌మిల్లుల యజమానులు వారికిచ్చిన ధాన్యాన్ని బయట విక్రయించుకుని ప్రభుత్వానికి బియ్యం ఇవ్వలేదు. దీంతో ఆ మిల్లర్ల యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు రైస్ మిల్లులను వేలం వేసేందుకు రెవెన్యూ అధికారులు ఆర్‌ఆర్ యాక్టు కింద నోటీసులు జారీ చేశారు. 2022 యాసంగి సీజన్‌కు సంబంధించిన వడ్లను కూడా సకాలంలో బియ్యం ఇవ్వకపోవడంతో గత ఏడాది కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్ల ద్వారా ధాన్యాన్ని విక్రయించింది. కానీ ఇప్పటికీ కూడా చాలా మంది మిల్లర్లు ధాన్యాన్ని కాంట్రాక్టర్లకు ఇవ్వడం లేదు. దీంతో పూచీకత్తు లేనిదే సీఎంఆర్ కింద ధాన్యం ఇవ్వమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సీజన్ నుంచే సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ప్రకటించింది. దీంతో చాలా మంది రైతులు జిల్లాలో సన్నరకం ధాన్యాన్ని ఎక్కువగా పండించారు. అలాగే జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా సన్న రకం బియ్యం సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు కావాల్సిన బియ్యం కోసం సీఎంఆర్ కింద సన్న రకం ధాన్యాన్ని ప్రభుత్వం మిల్లర్లకు ఇస్తున్నది. బ్యాంకు గ్యారంటీ లేకుండా ధాన్యం ఇస్తే బ్లాక్ మార్కెట్‌కు తరలించే అవకాశాలు ఉండడంతో మిల్లర్లకు ప్రభుత్వం షరతులు విధించింది.
ఫ పూచీకత్తు ఇస్తేనే ధాన్యం కేటాయింపు..
సీఎంఆర్ కింద ధాన్యాన్ని కేటాయించాలంటే తప్పరిసరిగా బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని ప్రభుత్వం నిబంధన విధించింది. దీంతో మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ లేకుండానే ధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. గ్యారంటీ ఇవ్వకుండా జాప్యం చేసినా కూడా ప్రభుత్వం దిగి రాలేదు. చేసేదేమి లేక మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు తీసుకవస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 118 మంది రైస్ మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు ఇచ్చారు. ఇందులో 110 బాయిల్డ్ రైస్ మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు సమర్పించడం గమనార్హం. కేవలం 8 రా రైస్ మిల్లుల యజమానులు మాత్రమే బ్యాంకు గ్యారంటీలను సమర్పించారు. డిఫాల్ట్ జాబితాలో 35 నుంచి 40 మిల్లుల వరకు ఉన్నాయని, ఆ మిల్లులకు ధాన్యం ఇచ్చేది లేదని పౌర సరఫరాల శాఖాధికారులు స్పష్టం చేస్తున్నారు. డిఫాల్ట్ జాబితాల్లో ఉన్న మిల్లర్లు సీఎంఆర్ కింద ఇవ్వాల్సిన 100 శాతం బియ్యానికి బదులు 125 శాతం ఇస్తేనే ఆ జాబితా నుంచి తొలగించనున్నారు. సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించకుండా ఉండేందుకు బ్యాంకు గ్యారంటీ సమర్పించాలనే షరతులు విధించారు. మిల్లులకు ధాన్యం కేటాయింపులు అయిన తర్వాత నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి.