రైతు బంధు విడుదల చేయాలి
ABN, Publish Date - Oct 20 , 2024 | 10:50 PM
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కుర్వ విజయ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి కుర్వ విజయ్‌కుమార్
మంత్రి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నాయకుల నిరసన
గద్వాల టౌన్/మల్దకల్/అయిజ/కేటీదొడ్డి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కుర్వ విజయ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసాపై చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ మోసకారితనాన్ని బయట పెట్టాయన్నారు. రైతు భరోసా నిధుల విడుదలలో ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ ఆదివారం విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చూపుతున్న సాకులు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు, సాంకేతిక కారణాలు అంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ రైతులను మోసగించేవేనన్నారు. కౌలు రైతులకు ఇస్తామన్న రైతుభరోసా, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్న హామీ గురించి ప్రభుత్వానికి పట్టింపే లేకుండా పోయిందన్నారు. వరి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు దానిపై స్పష్టత ఇవ్వలేదన్నారు. కాగా, బీఆర్‌ఎస్ గుర్తుతో ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అభివృద్ధి పేరుతో పార్టీ మారుతున్నట్లు చెప్పడం ప్రజలకు వెన్నుపోటు పొడవడమేనన్నారు. పార్టీ మారి మూడు నెలలు దాటినా ఆయన చెప్పిన అభివృద్ధి ఎక్కడ ఉందో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. నాయకులు బీచుపల్లి, బింగిదొడ్డి మక్తాలి, ప్రతాప్‌రెడ్డి, రవి, నీలిపల్లి నరసింహా, తిరుమలేష్, మల్దకల్, లక్ష్మన్న ఉన్నారు.
మల్దకల్ మండల కేంద్రంలోని బస్టాండు చౌరస్తాలో బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు భరోసాను విడుదల చేకుంటే కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ ముట్టడిస్తామని హెచ్చరించారు. నాయకులు పరుశరాముడు, రాజు, రాము, సిద్దు, నరసింహులు, రాజు, బ్రహ్మ, విష్ణు, సిద్దు, నాగరాజు, ఆంజనేయులు ఉన్నారు.
అయిజ మండల కేంద్రంలోని చౌరస్తాలో మునిసిపల్ చైర్మన్ దేవన్న, బీఆర్‌ఎస్వీ కన్వీనర్ కురువ పల్లయ్య ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టే ప్రయత్నం చేయడాన్ని గమనించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీఆర్‌ఎస్ నాయకులు ఆంజనేయులు, వీరేష్, రమేష్ పాల్గొన్నారు.
కేటీదొడ్డి మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంటనే రైతుభరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రహ్లాదనాయుడు, గోవిందు, జగదీష్, నరసింహులు, రవి పాల్గొన్నారు.
Updated Date - Oct 20 , 2024 | 10:50 PM