Mahesh Kumar Goud: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సంప్రదింపుల్లో ఉన్నారు
ABN , Publish Date - Oct 27 , 2024 | 03:31 AM
ప్రతిరోజూ కేటీఆర్ పక్కనే ఉండి సలహాలిచ్చే ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. తామెవ్వరినీ పార్టీలోకి రావాలని ఆహ్వానించడం లేదని, వారే అక్కడ ఉండలేక వస్తానని అంటున్నారని చెప్పారు.
కేటీఆర్ పక్కనున్నోళ్లే మాట్లాడుతున్నారు
ఆయన తప్పులకు పదేళ్లు జైల్లో పెట్టాలి
మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కమిటీలు
ప్రతిపక్ష నేతగానూ కేసీఆర్ ఫెయిల్
పొంగులేటి పేల్చే బాంబుకోసం నిరీక్షణ
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్
న్యూఢిల్లీ, అక్టోబర్ 26 (ఆంధ్రజ్యోతి): ప్రతిరోజూ కేటీఆర్ పక్కనే ఉండి సలహాలిచ్చే ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. తామెవ్వరినీ పార్టీలోకి రావాలని ఆహ్వానించడం లేదని, వారే అక్కడ ఉండలేక వస్తానని అంటున్నారని చెప్పారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. సెమీ్‌సలో గెలిచామని అయితే తమకు ఫైనల్ 2028లో రాబోయే ఎన్నికలేనని చెప్పారు. అప్పుడు దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ సీఎంగానే కాదని, చివరికి ప్రతిపక్ష నేతగానూ ఫెయిల్ అయ్యారని ఆయన ఎద్దేవా చేశారు.
ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, భూ ఆక్రమణలు, విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం.. ఇలా అన్ని అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ గానే ఉందని, అన్నింటిపై సమగ్ర విచారణ జరుగుతోందని తెలిపారు. కేటీఆర్ చేసిన తప్పులకు రెండు, మూడేళ్ల జైలుశిక్ష సరిపోదని, కనీసం పదేళ్లయినా జైలులో ఉండాలన్నారు. విద్యుత్ చార్జీలు పెంచుతారనేది అసత్య ప్రచారమేనని కొట్టి పారేశారు. తెలంగాణలో కాంగ్రెస్ కొత్త కమిటీలకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మహేశ్‌గౌడ్ తెలిపారు. పాత, కొత్త కలయికలతో, సమన్వయంతో ముందుకెళతామని, సమర్థులకే పీసీసీ, డీసీసీ కమిటీల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కొత్త కమిటీలను ప్రకటించే అవకాశం ఉందన్నారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సన్నిహితుడి హత్యతో మనస్తాపానికి గురయ్యారని, అందుకే అలా మాట్లాడుతున్నారని చెప్పారు. భవిష్యత్తు తరాల కోసమే హైడ్రా, మూసీ పునరుజ్జీవం కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రజలకు అన్ని విషయాలు వివరించి, జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు వెళతామని చెప్పారు. మంత్రి పొంగులేటి ఏ పొలిటికల్‌బాంబు పేలుస్తారో చూడాలన్నారు. ఆయన ఎందుకు అలాంటివ్యాఖ్యలు చేశారో తెలియదని, కానీ.. ఆయన మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఏమైనా అవినీతిని బయటికి తీస్తారేమోనని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేలను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ మర్యాద పూర్వకంగా కలిశారు.