‘స్వచ్ఛదనం-పచ్చదనం’ను సక్రమంగా నిర్వహించడం లేదు
ABN, Publish Date - Aug 09 , 2024 | 12:21 AM
కాంగ్రెస్ సిద్దిపేట నియోజవర్గ ఇన్‌చార్జి హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్
సిద్దిపేట టౌన్, ఆగస్టు8: ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని మున్సిపల్ పాలకవర్గం, అధికారులు సక్రమంగా నిర్వహించడం లేదని కాంగ్రెస్ సిద్దిపేట నియోజవర్గ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ ఆరోపించారు. గురువారం పట్టణంలోని 7వ వార్డులో స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమంలో భాగంగా వార్డు కౌన్సిలర్ శ్రీదేవిబుచ్చిరెడ్డితో కలిసి పర్యటించారు. ఈ మేరకు వారు మొక్కను నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన పథకాలు మున్సిపల్ కౌన్సిల్‌లోని కొందరికి నచ్చడం లేదని, అలాంటప్పుడు వాళ్లు తప్పుకోవాలని హితవుపలికారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మంజుల ఇప్పటికైనా ప్రభుత్వం చేపడుతున్న పథకాలను విజయవంతంగా నిర్వహించేలా చొరవ చూపాలన్నారు. ఆమె భర్త రాజనర్సు కావాలనే కార్యక్రమాలు జరగకుండా అడ్డుపడుతున్నారని, అలాంటప్పుడు మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు ముద్దం లక్ష్మి, గోపికృష్ణ, మంద పాండు, తప్పెట శంకర్, కలీమొద్దీన్, వహాబ్, అజ్మత్, జనార్దన్, రాజిరెడ్డి, వనజ, సాయిప్రతాప్, సతీష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Aug 09 , 2024 | 12:21 AM