ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పింఛన్‌ ఇవ్వండి సారూ..!

ABN, Publish Date - Aug 06 , 2024 | 11:30 PM

తొగుట, ఆగస్టు 6: ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా వారికి నెలనెలా పింఛన్‌ వచ్చేది. కానీ, రాష్ట్రం విడిపోయాక ఏపీలోకి వెళ్లిన వారికి పింఛన్‌ అందుతోంది.

ఉమ్మడి రాష్ట్రంలో అమలు

తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొండిచేయి

ఉమ్మడి జిల్లాలో 79 మంది ఎదురుచూపు

2008 జూన్‌ 30లోపు రిటైర్‌ అయిన వీఆర్వోలు, కార్యదర్శుల ఆవేదన

తొగుట, ఆగస్టు 6: ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా వారికి నెలనెలా పింఛన్‌ వచ్చేది. కానీ, రాష్ట్రం విడిపోయాక ఏపీలోకి వెళ్లిన వారికి పింఛన్‌ అందుతోంది. అదేం పాపమో కానీ, తెలంగాణలోని వారు మాత్రం ట్రిబ్యూనల్‌ ఆదేశాల మేరకు తమకు పింఛన్‌ ఇవ్వాలని కాళ్లరిగేలా తిరుగుతున్నారు 2008 జూన్‌ 30 కంటే ముందు రిటైర్‌ అయిన వీఆర్వోలు, గ్రామపంచాయతీ కార్యదర్శులు. గ్రామాల్లో రెవెన్యూ, శాంతిభద్రతలను చక్కదిద్దేందుకు పనిచేసిన పట్వారీ, పటేల్‌ వ్యవస్థను 1984లో అప్పటి సీఎం ఎన్టీఆర్‌ రద్దు చేశారు. ఉపాధి కోల్పోయిన వేలాదిమంది సుదీర్ఘ పోరాటం చేయగా, 1992లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 1992లో అర్హులైన వారిని ప్రభుత్వం వీఏఓలుగా నియమించింది. అప్పట్లో రూ.600 గౌరవవేతనంతో తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేశారు. చివరకు పదోతరగతి, ఇంటర్మీడియట్‌ చదివిన వారిని 2002 జనవరి ఒకటి నుంచి పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పేస్కేల్‌ ఇచ్చారు. వారిని వీఆర్వోలుగా, కార్యదర్శులుగా నియమించారు. అయితే, 2002లో ప్రభుత్వ ఉద్యోగులుగా నియమితులైన వీరిలో చాలామంది 2008 జూన్‌ 30లోగా ఉద్యోగ విరమణ పొందారు. అయితే వారికి కనీసం ఏడేళ్ల సర్వీస్‌ లేదంటూ ఫింఛన్‌ ఇచ్చేందుకు నిరాకరించారు. ఇలాంటి వారు ఉమ్మడి ఏపిలో 2,225 మంది ఉండగా, తాము రెండు నుంచి మూడు దశాబ్దాలుగా సేవలందించామని, తమకు కనీస పింఛన్‌ మంజూరు చేసేందుకు గతంలో 1992 నుంచి 2002 మధ్య కాలాన్ని కలపాలని ఏపీ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్‌ ఆదేశాలు, 1980 ఆర్‌పీఆర్‌ జీవోలను పరిశీలించిన తర్వాత ఫైల్‌ నెం.28496/అ/2013 ప్రకారం పాత సర్వీ స్‌ను పరిగణలోకి తీసుకుని 2,225 మందికి కనీస పింఛన్‌ సౌకర్యం కల్పిస్తూ 2014 ఫిబ్రవరి 2న ఫైల్‌పై అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సంతకం చేశారు.

ఏపీలో అమలు... !

ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలను అమలుచేయాలని విభజన చట్టంలో పొందుపరిచిన మేరకు ఫైల్‌ 28496/అ/2013 ప్రకారం ఏపీకి చెందిన 1,733 మందికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పింఛన్‌ సౌకర్యం కల్పిస్తూ 2014 నవంబర్‌ 20న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జీవో నంబర్‌ 388 జారీచేశారు. దీంతో ఆ ప్రాంతంలోని రిటైర్డు వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు పింఛన్‌ పొందుతున్నారు. తెలంగాణలో మాత్రం వారికి పింఛన్‌ ఇవ్వడం లేదు. రాష్ట్రంలో మొత్తం 492 మంది ఉండగా, ఒక్క ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనే 79 మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందులో చాలామంది చనిపోయారు కూడా. అయినా వారికి పింఛన్‌ దక్కడం లేదు. గత ప్రభుత్వం వీరి గోడును పట్టించుకోకపోవడంతో 2017లో ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవో 388 ప్రకారం తమకు న్యాయం చేయాలని రిటైర్డ్‌ ఉద్యోగులు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో 2021 మార్చి 15న హైకోర్టు పాత సర్వీ్‌సను పరిగణలోకి తీసుకుని వారికి పింఛన్‌ అందించాలని ఆదేశాలు జారీచేసినా ఇప్పటివరకు అధికారులు సహేతుక కారణాలు చూపకుండా ఫైల్‌ను పెండింగ్‌ ఉంచినట్లు రిటైర్డు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 జనవరి 12న ప్రజాభవన్‌లో రిటైర్డైన వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు పింఛన్‌ జీవోపై జారీచేయాలని కోరుతూ దరఖాస్తు చేశారు. అదేనెల 30న రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిని కలిసి తమకు పింఛన్‌ మంజూరీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని రిటైర్డైన వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు.

నా భర్త చనిపోయే వరకు పింఛన్‌ కోసం ఎదురు చూసిండు..

ఎన్నోఏళ్లు నా భర్త ప్రజలకు సేవచేసిండు. రిటైర్డ్‌ అయిన తర్వాత పింఛన్‌ కోసం అధికారుల చుట్టూ తిరిగి.. చనిపోయే దాక ఆశతో ఎదురుచూసిండు.. మాఊరు మల్లన్నసాగర్‌లో ముంపునకు గురైంది. దాంతో ఎలాంటి ఆదెరువు లేకుండా పోయింది. ఇప్పుడు దిక్కులేని పక్షుల వలే మిగిలినం. ప్రభుత్వం ఇప్పటికైనా మాపై దయతలచి భర్త పింఛన్‌ మంజూరీ చేస్తే నాకు ఆసరాగా ఉంటుంది.

- దాతారు సులోచన (రిటైర్డ్‌ వీఆర్వో సుధాకర్‌రావు సతీమణి), ఏటిగడ్డ కిష్టాపూర్‌, తొగుట మండలం

ఇప్పుడైనా న్యాయం జరిగేనా

ఉమ్మడి రాష్ట్రంలో పింఛన్‌ ఇవ్వాలని జీవో విడుదలైనప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమస్య పరిష్కారం కోసం ప్రజాభవన్‌లో దరఖాస్తు చేయడంతోపాటు, రెవెన్యూ మంత్రి శ్రీనివా్‌సరెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశాం. మాకు కాంగ్రెస్‌ ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్మకంతో ఎదురుచూస్తున్నాం.

- నర్సింహారావు, రిటైర్డ్‌ వీఆర్వోలు పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

మాకు న్యాయం చేయండి

పింఛన్‌ కోసం 9ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నాం. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పందన లేకుండాపోయింది. చాలా ఏళ్ల పాటు మిరుదొడ్డి మండలం వీరారెడ్డిపల్లిలో వీఆర్వోగా పనిచేసి రిటైర్డ్‌ అయ్యాను. ఇప్పుడు కుటుంబ పరిస్థితి బాగాలేదు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం మాకు పింఛన్‌ మంజూరీచేసి న్యాయం చేయండి.

- అమ్మన రాంరెడ్డి, రిటైర్డ్‌ వీఆర్వో (చెల్లాపూర్‌, దుబ్బాక మండలం)

మా మొర ఆలకించండి

తొగుట మండలం బండారుపల్లి పంచాయతీ కార్యదర్శిగా పనిచేసి రిటైర్డ్‌ ఆయ్యాను. అప్పటి నుంచి పింఛన్‌ కోసం కనిపించిన అధికారులను, నాయకులను కలిసిన. ఇప్పటివరకు మాకు న్యాయం జరగలేదు. అవసాన దశలో ఉన్నా... మా మొర ఆలకించండి. చనిపోయేవరకైనా నాకు పింఛన్‌ ఇప్పించండి.

- రాంకిషన్‌రావు, రిటైర్డ్‌ పంచాయతీ కార్యదర్శి

Updated Date - Aug 06 , 2024 | 11:30 PM

Advertising
Advertising
<