గండాలు దాటనున్న గౌరవెల్లి
ABN , Publish Date - Aug 01 , 2024 | 11:44 PM
పెండింగ్ పనుల పూర్తికి కేబినెట్ ఆమోదం
రూ.437 కోట్ల విడుదలకు నిర్ణయం
17 ఏళ్ల కల సాకారమవుతుందని రైతుల ఆనందం
సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు పొన్నం కృతజ్ఞతలు
హుస్నాబాద్, ఆగస్టు 1 : మెట్ట ప్రాంత వరప్రదాయిని గౌరవెల్లి రిజర్వాయర్ గండాలు ఇక తొలగిపోనున్నాయి. ఇక్కడి పొలాల్లో గోదావరి జలసవ్వడులను చూడాలనే ఈ ప్రాంత రైతాంగ నిరీక్షణ ఫలించబోతుంది. 17 ఏళ్ల క్రితం నుంచి ఈ రిజర్వాయర్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దాదాపు రిజర్వాయర్ పనులు పూర్తయి నీటిని నింపే అవకాశం ఉన్నా వ్యవసాయ భూములకు నీరందించే కాలువలు లేక.. రిజర్వాయర్ ముంపు బాధితుల సమస్యలు పరిష్కరించకపోవడంతో పెండింగ్‌లోనే ఉంటూ వస్తున్నది. ఈ క్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ ఎన్నికల్లో గెలిచిన వెంటనే రిజర్వాయర్‌ను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్ గౌరవెల్లి రిజర్వాయర్ పెండింగ్ పనుల పూర్తికి సవరించిన అంచనా ప్రతిపాదనల ప్రకారం రూ.437 కోట్లు కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. ఇక గౌరవెల్లి రిజర్వాయర్ పనులు శరవేగంగా జరుగుతాయని రైతులు సంతోషపడుతున్నారు.
2007లో శంకుస్థాపన
వర్షాధారంపై ఆధారపడి వ్యవసాయం సాగించే మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్, హుజూరాబాద్ నియోజకవర్గాలతో పాటు వరంగల్ జిల్లాలోని పలు గ్రామాలకు సాగు నీరందించాలని శ్రీరాంసాగర్ ఇందిరమ్మ వరద కాలువ గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్ల నిర్మాణానికి 2007 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హుస్నాబాద్‌లో శంకుస్థాపన చేశారు. ఒప్పందం ప్రకారం ఈ రిజర్వాయర్ల పనులు ఐదేళ్లలో పూర్తి చేయాల్సి ఉండగా రీ డిజైన్ ఇతర కారణాలతో 17 ఏళ్లుగా పనులు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ ఈ రిజర్వాయర్‌ను సందర్శించి దీనిని రీ డిజైన్ చేశారు. 1.4 టీఎంసీలు ఉన్న గౌరవెల్లి రిజర్వాయర్‌ను 8.23 టీఎంసీలకు పెంచారు. దీంతో అదనంగా భూసేకరణ చేయాల్సి వచ్చింది. ఎలాంటి అనుమతులు లేకుండా రిజర్వాయర్ ఎత్తు పెంచారని నిర్వాసితులు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఇప్పటికీ కూడా ఎన్‌జీటీలో ఈ కేసు ఉంది.
పూర్తయిన ట్రయల్ రన్
8.23 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయలోకి 2 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే 32 మెగావాట్ల సామర్థ్యం ఉన్న చైనా నుంచి వచ్చిన మూడు మోటార్లను బిగించారు. 2022 జూలై 31వ తేదీన అందులోని ఒక మోటార్‌తో 10 నిమిషాల పాటు ట్రయల్ రన్ నిర్వహించారు. మరో రెండు రోజుల అనంతరం అధికారులు రెండో మోటారు, మరో రెండు రోజులకు మూడో మోటారు ట్రయల్‌రన్ చేశారు. గౌరవెల్లి రిజర్వాయర్‌లోకి నీటిని మిడ్‌మానేరు ద్వారా బెజ్జంకి మండలం తోటపల్లి ఆన్‌లైన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి గౌరవెల్లి రిజర్వాయర్‌లోకి తీసుకవస్తారు. మొదటి డిజైన్ ప్రకారం రూ.409 కోట్లతో చేపట్టిన ఈ సొరంగం పనులు పూర్తయిన అనంతరం రీ డిజైన్‌లో భాగంగా అదనంగా మరో రూ.380 కోట్లతో పనులు చేశారు. తోటపల్లి ఆన్‌లైన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో రేగొండ వద్ద గౌరవెల్లి రిజర్వాయర్ ఉంటుంది. ఇందులో 12 కిలోమీటర్ల మేర సొరంగం ఉంటుంది. 5.6 మీటర్ల టన్నెల్‌షి్‌పతో 32 క్యూబిక్‌తో నీటిని తీసుకెళ్లే విధంగా సొరంగం నిర్మించారు. 50 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పు, 110 మీటర్ల లోతుతో సర్జ్‌పూల్ (నీళ్ల సంపు), 61మీటర్ల పొడవు, 17 మీటర్ల వెడల్పు, 130 మీటర్ల లోతుతో పంపుహౌజ్‌ను నిర్మాణం చేశారు. ట్రయల్ రన్‌తో రిజర్వాయర్‌లో ఒక టీఎంసీ నీటిని కూడా నింపారు.
1.06 లక్షల ఎకరాలకు సాగు నీరు
గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తయితే 1.06 ఎకరాలకు సాగునీరు అందనుంది. హుస్నాబాద్ నియోజకవర్గంలో 57,852 ఎకరాలు, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో 48,148 ఎకరాలకు సాగునీరందుతుంది. ఈ రిజర్వాయర్‌కు రెండు ప్రధాన కాలువలు ఉండగా కుడి కాలువ ద్వారా 90 వేల ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 16వేల ఎకరాలు సాగవుతాయి.
కాలువల నిర్మాణానికి అడ్డంకులు తొలిగినట్లేనా ?
రిజర్వాయర్ నుంచి వ్యవసాయ భూములకు సాగునీరందించేందుకు కాలువలను నిర్మించాల్సి ఉంది. వీటి నిర్మాణానికి మొత్తం 2800 ఎకరాలు అవసరం ఉందని అధికారులు అంచనా వేశారు. దీంతో పాటు రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యలు పరిష్కారించాల్సి ఉంది. ఈ రిజర్వాయర్ సామర్థ్యం పెంచడంతో పాటు, పర్యావరణ అనుమతులతో పాటు ఇతర అనుమతులు లేకుండా నిర్మించారని ముంపు గ్రామమైన గుడాటిపల్లి నిర్వాసితులు జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) ఆశ్రయించారు. దీంతో అనుమతులు వచ్చే వరకు రిజర్వాయర్ పనులు చేపట్టవద్దని అప్పుడు ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. అయితే, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తే ఆ కేసును ఉపసంహరించుకుంటామని నిర్వాసితులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం నిధులు విడుదల చేయనుండటంతో నిర్వాసితుల సమస్యలు పరిష్కారమై పనులకు అడ్డంకులు తొలుగుతాయని భావిస్తున్నారు.
కాంగ్రెస్ నాయకుల సంబురాలు
గౌరవెల్లి రిజర్వాయర్‌కు నిధులు కేటాయిస్తూ కేబినెట్‌లో ఆమోదం తెలపడం పట్ల హుస్నాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు సంబురాలు నిర్వహించారు. టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ చూపి నిధుల కేటాయింపునకు కృషి చేశారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి, నాయకులు చిత్తారి రవీందర్, బంక చందు, కోమటి సత్యనారాయణ, కౌన్సిలర్లు చిత్తారి పద్మ, వల్లపు రాజు, సరోజన, స్వర్ణలత, వీరన్ననాయక్, వెన్న రాజు తదితరులున్నారు.
రాబోయే సీజన్‌లో గౌరవెల్లి ద్వారా నీరందిస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్
రాబోయే సీజన్‌లోపు గౌరవెల్లి ద్వారా సాగు నీరందిస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. కాలువలకు సంబంధించి రూ.437 కోట్లు బడ్జెట్‌లో ఆమోదించినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇతర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి సీఎం వైఎ్‌సఆర్ శంకుస్థాపన చేశారని, అప్పుడే 80 శాతం పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత కుర్చీ వేసుకొని ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పి పదేళ్లయినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వాసితులపై నిరంకుశత్వంగా వ్యవహరించిందని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి ఈ ప్రాజెక్టును సందర్శించి అధికారంలోకి రాగానే పూర్తి చేస్తామని హామీ ఇచ్చి, ప్రస్తుతం నిధుల కేటాయింపులు చేశారని పేర్కొన్నారు. ఇక కాలువల నిర్మాణం వేగం చేస్తామని, నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.