అవస్థల్లో హాస్టళ్లు
ABN, Publish Date - Aug 11 , 2024 | 11:32 PM
ప్రభుత్వాలు మారుతున్నా.. విద్యార్థులు చదువుకునే రెసిడెన్షియల్ పాఠశాలల్లో మార్పు రావడం లేదు. నిరుపేద విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కరువవ్వడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇరుకు గదులు, డోర్లు లేని బాత్‌రూంలు, అపరిశుభ్ర పరిసరాలు, నాణ్యత లేని ఆహారం ఇలా...అనేక సమస్యలతో విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించలేకపోతున్నారు.
అద్దె భవనాల్లోనే నిర్వహణ
ప్రహరీలు లేక రాత్రిళ్లు పాములు, జంతువుల సంచారం
మెష్ డోర్లు లేక దోమల విజృంభణ
పలు హాస్టళ్లలోనే తరగతులు
ఇరుకు గదుల్లోనే డార్మెంటరీలు
జిల్లావ్యాప్తంగా 35 రెసిడెన్షియల్ పాఠశాలలు
8 వేల మందికి పైగా విద్యార్థులు
మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులకు తిప్పలు
ప్రభుత్వాలు మారుతున్నా.. విద్యార్థులు చదువుకునే రెసిడెన్షియల్ పాఠశాలల్లో మార్పు రావడం లేదు. నిరుపేద విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కరువవ్వడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇరుకు గదులు, డోర్లు లేని బాత్‌రూంలు, అపరిశుభ్ర పరిసరాలు, నాణ్యత లేని ఆహారం ఇలా...అనేక సమస్యలతో విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించలేకపోతున్నారు.
సిద్దిపేట టౌన్, ఆగస్టు 11: సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ట్రైబల్, మైనారిటీ విద్యార్థుల కోసం 35 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేశారు. వీటిల్లో దాదాపు 8 వేలకు పైగా విద్యార్థులున్నారు. కొన్నింటికి మాత్రమే సొంత భవనాలుండగా, చాలా మేరకు అద్దె భవనాల్లోనే హాస్టళ్లు కొనసాగుతున్నాయి. తలుపులులేని బాత్‌రూంలు, డార్మెంటరీ గదులు ఇరుగా ఉండడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సంక్షేమ హస్లళ్లు కాస్త అవస్థల హస్టళ్లుగా మారిపోతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు.
ఇరుకుగదులే దిక్కు
దాదాపుగా అద్దె భవనాల్లోనే రెసిడెన్షియల్ పాఠశాలలు కొనసాగుతుండడంతో పలు సమస్యలు తిష్టవేశాయి. దుబ్బాకలో క్రీడా స్టేడియంలోనే జ్యోతిరావుపూలే గురుకులాన్ని నిర్వహిస్తున్నారు. క్రీడా ప్రాంగణంలోని ఓ షట్టర్‌ను స్టోర్ రూంగా వాడుతున్నారు. ఆ గదిలోని బండలు పగలడంతో బియ్యం, సామగ్రి చెడిపోతున్నాయి. విద్యార్థులకు కనీసం డైనింగ్ హాల్ కూడా ఏర్పాటుచేయలేదు. కొండపాక మండలం దుద్దెడలో అద్దె భవనంలో బాలుర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల కొనసాగుతున్నది. పడుకునే గదిలోనే పాఠశాల తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ డైనింగ్ హాల్ ఇరుకుగా ఉండటం వల్ల కొద్దిమంది ఒకసారి, మరికొద్ది మంది మరొకసారి భోజనం చేస్తున్నారు. చేర్యాలలోని గురుకుల పాఠశాల, కళాశాలలో మరుగుదొడ్లు, మూత్రశాలలకు ఇనుపడోర్లు పాడైపోవడంతో మరమ్మతులు చేపట్టడంతో జాప్యం జరుగుతున్నది. విద్యార్థులే ఆయాలుగా మారి డార్మెంటరీ గదులను శుభ్రం చేసుకుంటున్నారు. డైనింగ్ హాల్ లేకపోవడంతో చెట్లనీడ కింద విద్యార్థులు భోజనాలు చేస్తున్నారు.
జిల్లాలోని పలు రెసిడెన్షియల్ పాఠశాలలు అద్దె భవనంలో ఉండటంతో వాటికి ప్రహరీ, గేటు లేక రాత్రుళ్లు అడవి జంతువులు సంచరిస్తున్నాయి. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని పాఠశాలలో ప్రధానంగా కిటికీలు ధ్వంసం కావడం, కిటికీలున్న చోట దోమతెరలు లేకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. మరుగుదొడ్లకు తలుపులు(డోర్లు) లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సిద్దిపేటలో బాలుర మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాలలో ప్రతిరోజూ మెనూ ప్రకారం ఆహారం అందించడంలేదని విద్యార్థులు తెలిపారు. కొన్నిసార్లు నాణ్యతగా ఉండడం లేదని, కొన్నిసార్లు విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. వర్గల్ మండలం చౌదర్‌పల్లిలోని బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆవరణలో విద్యుత్ లైట్లు లేకపోవడంతో, రాత్రివేళలో కళాశాల వరకు వెళ్లాలంటే విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని పలు రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు కాస్మొటిక్, దుప్పట్లు, యూనిఫామ్ ఇంతవరకు అందజేయలేదు. పలుచోట్ల విద్యార్థులే ఒకరికొకరు వడ్డించుకుంటున్నారు. మిట్టపల్లి రెసిడెన్షియల్ హాస్టల్ ఆవరణలో గడ్డి విపరీతంగా పెరిగింది. పాములు, ఇతర కీటకాలు కూడా కనిపించే పరిస్థితి లేదు. ఆవరణ మొత్తం చెత్తాచెదారంతో నిండడంతో విద్యార్థులు డెంగీ, విషజ్వరాల బారిన పడే అవకాశలున్నాయి.
సదుపాయాలు కల్పనలో విఫలం
పేద విద్యార్థుల కోసం ఏర్పాటైన రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం, అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు, పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలకు పక్కా భవనాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి విద్యార్థులకు అందాల్సిన కాస్మొటిక్ చార్జీలు, దుప్పట్లు, యూనిఫామ్‌లు, హాస్టళ్ల ఆవరణ చుట్టూ విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని, బాత్‌రూంలకు డోర్లు బిగించాలని కోరుతున్నారు.
Updated Date - Aug 11 , 2024 | 11:32 PM