Share News

బోనస్‌ లాస్‌

ABN , Publish Date - Nov 16 , 2024 | 01:05 AM

సన్నధాన్యం విక్రయాల్లో రైతులకు అన్యాయం జరుగుతోంది. పచ్చివడ్లు కొంటున్నామనే నెపంతో మిల్లర్లు కనీస మద్ధతు ధరకే పరిమితమవడంతో గతేడాది వచ్చిన ధర సైతం పొందలేకపోతుంటే, మరోవైపున మిల్‌పాయింట్ల వద్ద విక్రయిస్తుండటంతో ప్రభుత్వం ఇస్తామన్న బోనస్‌ కోల్పోతున్నారు.

బోనస్‌ లాస్‌
నల్లగొండ జిల్లా వేములపల్లిలో ధాన్యం లేక వెలవెలబోతున్న సన్నఽధాన్యం కొనుగోలు కేంద్రం

బోనస్‌ కోల్పోతున్న ధాన్యం రైతులు

సన్న రకాలన్నింటినీ మిల్లులకు తరలిస్తున్న రైతులు

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు వెలవెల

కనీస ధరతోనే సరిపెడుతున్న మిల్లర్లు

సన్నధాన్యం విక్రయాల్లో రైతులకు అన్యాయం జరుగుతోంది. పచ్చివడ్లు కొంటున్నామనే నెపంతో మిల్లర్లు కనీస మద్ధతు ధరకే పరిమితమవడంతో గతేడాది వచ్చిన ధర సైతం పొందలేకపోతుంటే, మరోవైపున మిల్‌పాయింట్ల వద్ద విక్రయిస్తుండటంతో ప్రభుత్వం ఇస్తామన్న బోనస్‌ కోల్పోతున్నారు. సన్నరకాల బియ్యానికి బహిరంగ మార్కెట్లో బాగా గిరాకీ ఉన్నప్పటికీ ఆ రకం ధాన్యానికి మాత్రం క నీసమద్ధతు ధరకు మించి ధర దక్కడం లేదు.

(ఆంధ్రజ్యోతిప్రతినిఽధి-నల్లగొండ)

ఈ సీజనలో సన్నరకాల ఽఽధాన్యమంతా మిల్లులకే వస్తుండడంతో ధరను కనీస మద్ధతు ధర క్వింటాకు రూ.2,320 నుంచి గరిష్ఠంగా రూ.2,450కు మించి కొనడం లేదు. గతేడాది ఇదే సీజనలో ఇవే రకం సన్నధాన్యానికి క్వింటాకు కనీసం రూ.2,600 నుంచి రూ.2,800 వరకు ధర ఇచ్చిన మిల్లర్లు, ఈసారి ధాన్యం ఎక్కువగా వస్తుండడంతో ధర పెరగకుండా నియంత్రిస్తున్నారు. మిర్యాలగూడ డివిజనలో విస్తరించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న రైస్‌మిల్లులకే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు తమ సన్నధాన్యం తీసుకువస్తుండటాన్ని ఆసరాగా చేసుకుని ధర పెరగకుండా నియంత్రిస్తున్న పరిస్థితి నెలకొంది.

ధరను నియంత్రిస్తోన్న మిల్లర్లు

ఈ వానాకాలం సీజనలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మెట్టప్రాంతాల్లో బోరుబావుల కింద, నాగార్జునసాగర్‌ ఆయకట్టు కింద కలిపి 12.68లక్షల ఎకరాల్లో వరి సాగుచేయగా, మొత్తం 29.28 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం ఉత్పత్తి వస్తుందని అంచనావేశారు. ఇందులో సన్నధాన్యం 16.08లక్షల మెట్రిక్‌టన్నులు కాగా, 13.20లక్షల మెట్రిక్‌ టన్నుల దొడ్డు ధాన్యం వస్తుంది. సన్నధాన్యం అత్యధికంగా సూర్యాపేట జిల్లా నుంచి 9లక్షల మెట్రిక్‌ టన్నులు, నల్లగొండ జిల్లా నుంచి 6.40లక్షల మెట్రిక్‌టన్నులు, యాదాద్రి జిల్లా నుంచి 70వేల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తవుతుంది. మొత్తం 16.10లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా సన్నధాన్యం వస్తుందని, ఈ ధాన్యమంతా మిల్లు పాయింట్లకే రానుందనే ధీమాతో మిల్లర్లు ధరను నియంత్రిస్తున్నారు. కనీస మద్ధతు ధర క్వింటాకు రూ.2,320 కాగా అంతకుమించి కొద్దోగొప్పో ఇస్తూ ఽగరిష్ఠంగా క్వింటాకు రూ.2,450 వరకు ఇస్తున్నారు. గతేడాది ఇదే సీజనలో క్వింటాకు రూ.2,600, రూ.2,800 వరకు ధర ఇచ్చారని, అదే రకం ధాన్యం, అదే స్థాయి నాణ్యతా ప్రమాణాలు ఈసారి కూడా పాటిస్తున్నప్పటికీ ధర ఎందుకు తగ్గిస్తున్నారని రైతులు నిలదీస్తే తేమశాతం 17వరకే ఉండాలని, అలాంటిది పచ్చివడ్లు తేమ 26, 28 వరకు ఉంటున్నాయని, అందువల్లే ధర ఇవ్వలేకపోతున్నామని మిల్లర్లు చెబుతున్నారు. అయితే వాస్తవానికి గతేడాది సాగర్‌ ఆయకట్టుకు నీరు లేకపోవడం, అక్కడ వరి సాగు తక్కువగా ఉండడంతో పాటు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేవలం 8 లక్షల మెట్రిక్‌టన్నులకు మించిరాలేదని, ఈసారి ఇందుకు దాదాపు రెట్టింపు ధాన్యం వస్తుండడంతో ధర పెరగకుండా సిండికేట్‌గా మారి కొనుగోళ్లు చేస్తున్నారనే చర్చ సాగుతోంది. అయితే మిర్యాలగూడ డివిజనలో ప్రస్తుతం సన్నధాన్యం కొనుగోలు చేస్తున్న మిల్లుల్లో ఉన్న అత్యాధునిక సాంకేతికతతో ధాన్యం తేమశాతంతో సంబంధం ఉండదని, ఎంత పచ్చి ఉన్నప్పటికీ బాయిల్డ్‌ చేసే విషయంలో ఇబ్బంది రాకపోగా, పచ్చివడ్లయితేనే బియ్యం నూక శాతం తక్కువగా వస్తుందని, బియ్యపుగింజ విరగడం ఉండదని, ధర తగ్గించడం కోసమే, 17శాతం తేమ నిబంధనను మిల్ల ర్లు తెరమీదకు తెచ్చి రైతును దగా చేస్తున్నారని రైతులు, సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

వెలవెలబోతున్న ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు

నల్లగొండ జిల్లాలో సన్నధాన్యం కొనుగోళ్లకు 81 ఽకేంద్రాలు ఏర్పాటు చేసి పది రోజులు గడుస్తున్నా రైతులెవరూ ఇప్పటివరకు ఈ కేంద్రాలకు ధాన్యం తీసుకురావడం లేదు. ఈ కేంద్రాల్లో విక్రయిస్తేనే రైతులకు క్వింటాకు రూ.500 బోనస్‌ వస్తుంది. మిల్లుల్లో విక్రయిస్తే బోనస్‌ రాదని, తెలిసినా రైతులు పచ్చివడ్లు కొంటున్నారని, డబ్బులు వెంటనే చెల్లిస్తున్నారనే కారణాలతో మిల్‌పాయింట్ల వద్దనే నేరుగా ధాన్యం విక్రయిస్తున్నారు. నల్లగొండ జిల్లాతో పాటు సూర్యాపేట జిల్లాలో పండిన సన్నధాన్యం కూడా దాదాపుగా మిర్యాలగూడ డి విజనలో ఉన్న మిల్లుల వద్దకే తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ప్రతి రోజూ మూడు నుంచి నాలుగువేల ట్రాక్టర్ల ధాన్యం వస్తోంది. మరో పక్షం రోజుల వరకు ఇదే ఒరవడి కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు సన్నధాన్యం 1000 క్వింటాళ్ల వరకు కూడా రాలేదు. అయితే మిల్లులకు మాత్రం ఇప్పటివరకు దాదాపు 3లక్షల మెట్రిక్‌టన్నుల వరకు ధాన్యం వచ్చిందని చెబుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నధాన్యం కొనాలన్నా 17శాతానికి లోబడి తేమశాతం, గింజపొడవు 6మిల్లీమీటర్లకు లోబడి ఉండడంతో పాటు, తాలు, తేమ ఉండకూడదని చెబుతున్నారని, సన్నవడ్లను ఆరబెడితే తూకం తేడా వస్తుందని, అందువల్లే మిల్లులకు నేరుగా అమ్ముతున్నామని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం సన్నధాన్యాన్ని రైతులు ఎక్కడ అమ్ముకున్నా వారికి బోనస్‌ ఇవ్వాలని నల్లగొండ జిల్లా రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, రైతుసంఘం నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

మహేంద్ర చింట్లు రకం

ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పేచీలు

సన్నధాన్యమంతా మిల్లులకే వస్తుండడంతో వాటిల్లో మహేంద్ర చింట్లు రకం ధాన్యం కొనబోమని రైస్‌మిల్లర్లు పేచీ పెడుతున్నారు. ఈ రకం ధాన్యం మిల్లింగ్‌ తర్వాత వచ్చే బియ్యంలో వైట్‌ బెండ్‌(కొంత భాగం పిండిపదార్ధం) ఎక్కువగా ఉంటుందని, తెల్లగీత వలె వస్తుందని, పిండిపదార్థం ఎక్కువగా ఉండడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడుతుందని మిల్లర్లు చెబుతున్నారు. అన్నం కూడా ముద్దగా మారుతుందని, అందువల్ల వినియోగదారులు ఈ బియ్యం కొనడానికి ఇష్టపడడం లేదని, మార్కెటింగ్‌లో ఇబ్బందుల వల్ల ఈ రకం ధాన్యం కొనలేమని మిల్లర్లు తేల్చిచెబుతుండడంతో మిల్లుల వద్ద ఈ రకం ధాన్యం తెచ్చేరైతులకు, మిల్లర్లకు మధ్య ఘర్షణ తలెత్తుతుంది. ఇదే రకం ధాన్యాన్ని గత రెండేళ్లుగా అఽధిక ధర ఇచ్చిమరీ కొన్నారని, ఇప్పుడెందుకు సాకులు చెబుతున్నారని మిల్లర్లని రైతులు నిలదీస్తున్నారు. ఈ విషయమై తాజాగా మిల్లర్లతో జిల్లా కలెక్టర్‌ ఇలాత్రిపాఠి నిర్వహించిన సమావేశంలోనూ చర్చకు రాగా, ఆమె సన్నధాన్యం ఏరకమైనా నాణ్యతగా ఉంటే కొనాల్సిందేనని సూచించడంతో ఈ ఒక్క సీజనకు నాణ్యత ఉంటే కొంటామని మిల్లర్లు అంగీకరించారు. తేమ ఎక్కువ ఉందని, ఇతరత్రా సాకులు చెబుతూ ఈరకం ధాన్యానికి కనీస మద్ధతు ధర క ంటే క్వింటాల్‌కు రూ.200 వరకు ధర తగ్గిస్తున్నారని, గత్యంతరం లేక ఇచ్చివెళుతున్నామని రైతులు చెబుతున్నారు.

Updated Date - Nov 16 , 2024 | 01:05 AM