సాదాబైనామా సృష్టించి రికార్డులు మార్చి
ABN , Publish Date - Nov 19 , 2024 | 01:17 AM
ధరణి వెబ్‌సైట్‌లో రికార్డుల నమోదు సందర్భంగా అధికారులు, ఉద్యోగులు చేసిన తప్పిదాలు ఒక్కోటిగా వెలుగులోకి వస్తున్నాయి. బాధితులు ఫిర్యాదులు చేస్తుండడంతో ధరణిలో రికార్డుల అప్‌డేషన్‌లో జరిగిన అక్రమాలు, ఉద్యోగుల చేతివాటం బయట పడుతోంది. తాజాగా నల్లగొండ జిల్లా నల్లగొండ మండలం జీకే అన్నారంలో సాదాబైనామా డాక్యుమెంట్ ఆఽధారంగా భూ యజమానురాలికి సంబంధం లేకుండానే ఆమె తన భూమిని విక్రయించినట్టుగా 13-బీ ఫారం ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన విషయం తెరపైకి వచ్చింది.
పక్కన భూమిలో కలిపి తప్పుడు రిజిస్ట్రేషన్
గుట్టకింద అన్నారంలో 18 గుంటల భూమి అక్రమంగా అప్పగింత
తహసీల్దార్ కార్యాలయ అధికారులు, ఉద్యోగుల సహకారం!
చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు బాధితురాలి ఫిర్యాదు
విచారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి
నల్లగొండ, నవంబరు 18 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ధరణి వెబ్‌సైట్‌లో రికార్డుల నమోదు సందర్భంగా అధికారులు, ఉద్యోగులు చేసిన తప్పిదాలు ఒక్కోటిగా వెలుగులోకి వస్తున్నాయి. బాధితులు ఫిర్యాదులు చేస్తుండడంతో ధరణిలో రికార్డుల అప్‌డేషన్‌లో జరిగిన అక్రమాలు, ఉద్యోగుల చేతివాటం బయట పడుతోంది. తాజాగా నల్లగొండ జిల్లా నల్లగొండ మండలం జీకే అన్నారంలో సాదాబైనామా డాక్యుమెంట్ ఆఽధారంగా భూ యజమానురాలికి సంబంధం లేకుండానే ఆమె తన భూమిని విక్రయించినట్టుగా 13-బీ ఫారం ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన విషయం తెరపైకి వచ్చింది. తహసీల్దార్ కార్యాలయ సిబ్బందితో కలిసి సాదాబైనామా సృష్టించిన వ్యక్తి భూమిని అతడి పేరున రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, కార్యాలయ అధికారులు, ఉద్యోగులు ప్రలోభాలకు లొంగి తనకు అన్యాయం చేశారని బాధితురాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది.
పక్కభూమిలో కలిపి రిజిస్ట్రేషన్
నల్లగొండ మండలం గుట్టకింద అన్నారం గ్రామంలో పురం స్వరూపకు సర్వే నెంబర్లు 44/ఆలో 18 గుంటలు, 65/ఈలో 26 గుంటలు, 66/ఈలో 4 గుంటలు, 67/ఈలో 3 గుంటలు కలిపి మొత్తం 1.11 ఎకరాల భూమి ఉంది. ఆమె ఈ భూమిని తండ్రి బోధనం నర్సిరెడ్డి నుంచి 31 మే 2008న కొనుగోలు చేసింది. అప్పటి ప్రభుత్వం అందజేసిన పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్‌డీడ్ కూడా పొందారు. అనంతరం ప్రభుత్వం ఇచ్చిన ధరణి పాస్‌బుక్ కూడా ఈ భూమికి స్వరూప యజమానురాలిగా గుర్తిస్తూ జారీ అయింది. అయితే ఈ భూమి సరిహద్దుల్లో ఉండే బోధనపు వెంకటరెడ్డికి చెందిన సర్వేనెంబర్ 43, 44లోనే ఇతర సబ్‌డి విజన్ల నెంబర్లలో ఉన్న 1.10 గుంటల భూమితో పాటు, స్వరూపకు చెందిన 44/ఆలో ఉన్న 18 గుంటల భూమిని 2012, మే 10న సాదాబైనామా ద్వారా అదే గ్రామానికి చెందిన బోధనపు సత్తిరెడ్డి కొనుగోలు చేశారని, నల్లగొండ తహసీల్దార్ కార్యాలయం నుంచి 8.7.2018న బీ/458/2018 నెంబర్ ద్వారా ప్రొసీడింగ్స్ ఇచ్చారు. 31-బీ ఫారమ్ ద్వారా ఈ బదిలీ సక్రమమేనని నిర్ధారిస్తూ అప్పటి తహసీల్ధార్ కా ర్యాలయం ద్వారా ఈ భూమిని సత్తిరెడ్డి పేర రికార్డుల్లోకి మార్చారు. దీంతో విషయం తెలుసుకున్న స్వరూప తాను ఎవరికీ భూమి విక్రయించలేదని, ఇదంతా తహసీల్దార్ కార్యాలయపు అధికారులు, ఉద్యోగులతో కలిసి అక్రమంగా సాదాబైనామా సృ ష్టించి తనకు అన్యాయం చేశారని, ఈ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్ మొదలుకొని కలెక్టర్ వరకు ఫిర్యాదు చేసింది. తాజాగా ఈ నెల 4వ తేదీన కూడా ఆమె కలెక్టర్‌కు మరోదఫా ఫిర్యాదు చేసింది.
ఈ అక్రమ రిజిస్ట్రేషన్‌పై విచారణ జరిపి బాధ్యులైన వారిపై, తప్పుడు రిజిస్ట్రేషన్‌కు సహకరించిన అధికారులుపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని స్వరూప కోరింది. ఈ విషయమై నల్లగొండ తహసీల్దార్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ నిమిత్తం సంప్రదించగా ఆయన స్పందించలేదు.
తప్పుడు సాదాబైనామా సృష్టించారు : పురం స్వరూప, గుట్టకింద అన్నారం
నేను 2008లో మా నాన్న భూమిని కొనుగోలు చేశా. ఆ భూమికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు, పాత ప్రభుత్వపు పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్‌డీడ్ ఉన్నాయి. ధరణిలోనూ మా భూమి వివరాలు అప్‌డేట్ చేసి పాస్‌బుక్ ఇచ్చారు. అయితే 18 గుంటల భూమిని మేం విక్రయించకున్నా, నాకు సంబంధం లేకుండానే సత్తిరెడ్డి అనే వ్యక్తికి విక్రయించినట్టు ఫేక్ సాదాబైనామా సృష్టించి 31-బీ ద్వారా అతడికి రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ సమయంలో భూవిక్రయదారులు, కొనుగోలుదారులుంటేనే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ, నాకు సంబంధం లేకుండానే భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. ఈ నకిలీ రిజిస్ట్రేషన్‌కు తహసీల్ కార్యాలయ అధికారులు, ఉద్యోగులు సహకరించడం వల్లే నాకు అన్యాయం జరిగింది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్‌పై కలెక్టర్ విచారణ చేయించి న్యాయం చేయాలి.