యాదగిరీశుడి బాలాలయ ఖాళీ స్థలంపై కన్ను
ABN , Publish Date - Nov 19 , 2024 | 01:19 AM
యాదగిరీశుడి బాలాలయ ఖాళీ స్థలంపై అందరి దృష్టి పడింది. ప్రధానాలయం ప్రారంభానికి ముందు బాలాలయం ఏర్పాటు చేసిన ప్రదేశం ప్రస్తుతం ఖాళీగానే ఉంది. ఇక్కడ కల్యాణ మండపం, ధ్యాన మందిరం నిర్మించేందుకు 2023 ఆగస్టు 21న వైటీడీఏ వైస్ చైర్మన్ జి.కిషన్‌రావు, మైహోమ్ రామేశ్వరరావుతో కలిసి చిన్న జీయర్ స్వామి పూజలు చేశారు.
దుకాణాల నిర్మాణానికి అనుమతివ్వాలని వర్తకుల వినతి
భువనగిరి అర్బన్, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): యాదగిరీశుడి బాలాలయ ఖాళీ స్థలంపై అందరి దృష్టి పడింది. ప్రధానాలయం ప్రారంభానికి ముందు బాలాలయం ఏర్పాటు చేసిన ప్రదేశం ప్రస్తుతం ఖాళీగానే ఉంది. ఇక్కడ కల్యాణ మండపం, ధ్యాన మందిరం నిర్మించేందుకు 2023 ఆగస్టు 21న వైటీడీఏ వైస్ చైర్మన్ జి.కిషన్‌రావు, మైహోమ్ రామేశ్వరరావుతో కలిసి చిన్న జీయర్ స్వామి పూజలు చేశారు. అదేరోజు దివ్య విమాన రాజగోపురం తాపడం పనులకోసం(రామేశ్వరరావు) ఐదు కిలోల బంగారం కూడా సమర్పించారు. భక్తుల ఇబ్బందులు తొలగించేందుకు గతేడాది అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయం చినజీయర్ ప్రకటించారు. నిత్య కల్యాణోత్సవం నిర్వహించేందుకు ఇరుకుగా ఉండటంతో ఖాళీ ప్రదేశంలో కల్యాణమండపం, ధ్యాన మందిరాలను మైహోమ్ రామేశ్వరరావు దాతృత్వంతో నిర్మిస్తారని జీయర్ స్వామి స్పష్టంచేశారు. కానీ, ఈలోపు ప్రభుత్వం మారడంతో దేవాదాయశాఖ ఉన్నతాధికారుల అనుమతికోసం ఇక్కడి అధికారులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఫెన్సింగ్ వేసిన ఆ స్థలంపై వర్తకులు కన్నేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇక్కడ సీఎం రేవంత్‌రెడ్డి తొలిసారిగా ఈ నెల 8న మంత్రులు, వైటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇక్కడ చేపట్టాల్సిన నిర్మాణాలను సీఎం ప్రకటిస్తారని ఆశించిన భక్తులకు నిరాశే మిగిలింది. ఇప్పటికే పాత ఆచారాల పునరుద్దరణ పేరుతో డార్మెటరీ హాల్, విష్ణుపుష్కరిణి, కొబ్బరికాయలు కొట్టేస్థలం, కొత్తగా అఖండ దీపారాధన ఇలా ఒక్కొక్కటి కొండపైకి చేరుతుండగా, ఇదే అదునులో దుకాణాలు ఏర్పాటు చేయవచ్చని వర్తకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎలాగైనా ఖాళీ స్థలంలో పాగా వేయాలని వర్తకులు చూస్తున్నట్లు తెలుస్తోంది.
విప్ చుట్టూ వర్తకుల ప్రదక్షిణలు
ఖాళీ స్థలంలో దుకాణ సముదాయాలు ఏర్పాటు చేసుకునేందుకు వర్తకులు కన్నేశారు. ఇదే విషయమై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొండపైన 2026 సంవత్సరంవరకు కోర్టు అనుమతితో 10 దుకాణాలు కొనసాగనుండగా, కొత్తగా మరో 15 దుకాణాలకోసం వర్తకులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆలయ అధికారులు ఇక్కడ కల్యాణ మండపం, ధ్యాన మందిరం నిర్మించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందుకెళ్లనున్నట్లు ఈవో భాస్కర్‌రావు తెలిపారు. ప్రధాన రహదారి వెంట ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకోసం 166, వర్తకులకోసం 162 సముదాయాలు వేర్వేరుగా కొండకింద నిర్మించారు. ఇవి రూ.15కోట్ల నిధులు లేమితో 10శాతం పనులు నిలిచిపోయాయి. కొండపైనే వర్తకం చేసుకునేందుకు వర్తకులు మొగ్గు చూపుతుండగా కొండకింద నిర్మించిన గదులు ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది.
ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం : భాస్కర్‌రావు, ఈవో, యాదగిరిగుట్ట దేవస్థానం.
ప్రభుత్వం మారినందున దాతను కలిసేందుకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలకోసం ఎదురుచూస్తున్నాం. బాలాలయ ఏర్పాటు చేసిన ఖాళీ స్థలంలో కల్యాణమండపం, ధాన్య మందిరం నిర్మించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసేందుకు వీలుపడదు. భక్తుల సౌకర్యార్థం ఇక్కడ కల్యాణోత్సవ మండపం, ధ్యాన మందిరం నిర్మించేందుకు ఉన్నతాధికారులను సంప్రదిస్తాం.