Share News

నాయకులు, పార్టీ కార్యకర్తలు అధైర్యపడొద్దు

ABN , Publish Date - Jan 10 , 2024 | 12:29 AM

బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దని, విభేదాలు వీడి ప్రజలతో కలిసి ఐకమత్యంగా ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత కోరారు.

 నాయకులు, పార్టీ కార్యకర్తలు అధైర్యపడొద్దు
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత

యాదగిరిగుట్ట రూరల్‌, జనవరి 9: బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దని, విభేదాలు వీడి ప్రజలతో కలిసి ఐకమత్యంగా ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత కోరారు. మంగళవారం మండలంలోని వంగపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్‌ నియోజకవర్గస్థాయి విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారం కోల్పోయామని నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దని, చిన్న చిన్న విభేదాలు ఉంటే వాటిని విడనాడి అందరం కలిసి పార్టీని బలోపేతం చేద్దామని అన్నారు. గతంలో శంకుస్థాపన చేసిన వాటన్నింటికీ జీవో ద్వారా నిధులు మంజూరయ్యాయని, వాటికి నిధులు లేక పనులు నిలిపేశారని, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖజానా ఖాళీ అయిందని అనడం పచ్చి అబద్ధమని అన్నారు. పదేళ్లు సీఎంగా పరిపాలన చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేకుండా వాటిని అమలు చేసి ప్రజలందరికీ అందించారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోగానే కొంతమంది పార్టీనుంచి వెళ్లిపోయినట్లు ఆరోపణలు వచ్చాయని, తాలు గింజలు ఉంటే గాలికి రాలిపోతాయని, గట్టి గింజలు మొలకెత్తుతాయని తెలిపారు. అలాంటి వారే బీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టుకొమ్మలని, వాళ్లే గులాబీ జెండాలు ఎగరేస్తారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఓటమిని దృష్టిలో పెట్టుకుని చేసిన తప్పును సరిదిద్దుకొని అందరూ కలిసిపోవాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన దరఖాస్తులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, ఏ పథకం ఎక్కడ రాయాలో తెలియకుండా ప్రజలందరూ ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో పార్టీ తరపున ఎవరు నిలబడ్డా అందరం కలిసి గెలిపించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడుస్తున్నప్పటికీ రైతు బంధు పథకంతో రైతులకు డబ్బులు చెల్లించలేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో భువనగిరి ఎంపీ టికెట్‌ తమకు కేటాయిస్తే పోటీచేసేందుకు సిద్ధమని అన్నారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు సుదగాని హరిశంకర్‌గౌడ్‌, జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, వైస్‌ చైర్మన్‌బిక్కూనాయక్‌ మాట్లాడారు. సమావేశంలో ఆలేరు మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌మోత్కుపల్లి జ్యోతి, మాజీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, జడ్పీటీసీ తోటకూరి అనురాధ బీరయ్య, మండల సెక్రటరీ జనరల్‌ కసావు శ్రీనివా్‌సగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2024 | 12:29 AM