ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తడి, పొడి చెత్తను వేరుచేయాల్సిందే

ABN, Publish Date - Nov 18 , 2024 | 12:40 AM

‘చెత్త బండి వచ్చింది..మీ ఇంటి ముందుకు వచ్చింది..తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వండి’ అంటూ ప్రతి రోజూ లేదా రోజు మార్చి రోజు మునిసిపల్‌ చెత్త బండి మైకు నుంచి వినిపించే విజ్ఞప్తి ఇది.

ప్రజలు సహకరించాలంటున్న మునిసిపల్‌ సిబ్బంది

మునిసిపాలిటీలో రోజువారీగా 33 మెట్రిక్‌ టన్నుల చెత్త సేకరణ

‘చెత్త బండి వచ్చింది..మీ ఇంటి ముందుకు వచ్చింది..తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వండి’ అంటూ ప్రతి రోజూ లేదా రోజు మార్చి రోజు మునిసిపల్‌ చెత్త బండి మైకు నుంచి వినిపించే విజ్ఞప్తి ఇది. మరి ప్రజలు మునిసిపల్‌ సిబ్బందికి సహకరిస్తున్నారా? మునిసిపల్‌ సిబ్బంది ఏమంటున్నారు? అనే విషయంపై ఆంధ్రజ్యోతి కథనం..

-భువనగిరి టౌన

పట్టణ పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా రాష్ట్ర మునిసిపల్‌ పరిపాలనా విభాగం దశాబ్దం క్రితం ఇంటింటా చెత్త సేకరణను ప్రారంభించింది. మునిసిపల్‌ పారిశుధ్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. అయితే ఈ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని మునిసిపల్‌ అధికారులు, సిబ్బంది కోరుతూనే ఉన్నారు. ఇం దుకు అనుగుణంగా తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించేందుకు పలు మార్లు ప్రతి ఇంటికి రెండేసి బుట్టలను అందించారు కూడా. అయినప్పటికీ ప్రజల్లో మార్పు మాత్రం రాలేదని చెత్త సేకరణ సిబ్బంది వాపోతున్నారు. ఈ మేరకు భువనగిరి మునిసిపాలిటీలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని నిర్ణయించారు. ఇందుకోసం చెత్త సేకరణకు ఇళ్లకు వెళుతున్న పారిశుధ్య సిబ్బంది తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వాలని సూచిస్తున్నారు. అయితే కొద్ది మంది మునిసిపల్‌ సిబ్బంది సూచనలను పరిగణలోకి తీసుకోగా మరికొద్ది మంది పాతవిధానంలోనే చెత్తను అందిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించే ఇళ్లనుంచే చెత్తను సేకరించాలని మునిసిపల్‌ పారిశుధ్య విభాగం నిర్ణయించింది.

భువనగిరిలో ఇలా..

భువనగిరి మునిసిపల్‌ పరిధిలోని సుమారు 15,200 గృహాలు, సుమారు వెయ్యి దుకాణాల నుంచి ప్రతీ రోజు మునిసిపల్‌ పారిశుధ్య సిబ్బంది ఇళ్ల వద్దే చెత్తను సేకరిస్తున్నారు. సుమారు 20 కిపైగా ఆటో ట్రాలీలు, 4 ట్రాక్టర్ల ద్వారా సేకరించిన చెత్తను పట్టణ శివారులోని కంపోస్ట్‌ యార్డుకు తరలిస్తున్నారు. ప్రతీ రోజు సుమారుగా 33 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోందని అంచనా. అయితే ఇళ్లలో ఉత్పత్తి అవుతున్న తడి, పొడి చెత్తను ప్రజలు కలబోతగా అందిస్తుండడంతో కంపోస్ట్‌ యార్డులో ఆ చెత్తను వేరు చేయాల్సిన పరిస్థితి మునిసిపల్‌ సిబ్బందికి భారంగా మారుతోంది. రోజువారీగా భారీగా వస్తున్న చెత్తను సకాలంలో వేరు చేయలేకపోతుండడంతో కంపోస్ట్‌ యార్డులో చెత్త భారీగా పేరుకుపోతున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ పేరుకుపోయిన చెత్తను బయో మైనింగ్‌ పేరిట వేరు చేసి తరలించేందుకు చేపట్టి ఏడాది గడుస్తున్నా పనులు నేటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. ఇళ్ల వద్దనే తడి, పొడి చెత్తను వేరుగా సేకరించాలని మునిసిపల్‌ అధికారులు నిర్ణయించారు. పైగా రాష్ట్ర మునిసిపల్‌ పరిపాలనా విభాగం కూడా ఇటీవలే తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

తడి, పొడి చెత్త సేకరణ ఇలా..

ఇళ్ల నుంచి సేకరించిన తడి చెత్త ద్వారా మునిసిపల్‌ సిబ్బంది గతంలో కంపోస్టు యార్డులోనే వర్మీ ఎరువును తయారు చేసేవారు. ఉత్పత్తి చేసిన వర్మి ఎరువును, పొడి చెత్తను కూడా బహిరంగ మార్కెట్‌లో విక్రయించడం ద్వారా మునిసిపాలిటీకి ఆదాయం లభించేది. కానీ కంపోస్ట్‌ యార్డులోనే తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు అదనపు కార్మికులను నియమించుకోవాల్సిన పరిస్థితి నెలకొనడంతో చెత్తను వేరు పర్చడానికి అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఇళ్ల వద్దనే తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని మునిసిపల్‌ యంత్రాంగం నిర్ణయించింది. మునిసిపల్‌ నిర్ణయాన్ని పాటించని ఇళ్ల నుంచి చెత్తను సేకరించరాదని పారిశుధ్య సిబ్బంది భావిస్తున్నారు. ఆహారపదార్థాలు, కొబ్బరి చిప్పలు, పండ్లు, తదితర కుళ్లిపోయే స్వభావం ఉన్న వాటిని తడి చెత్తగా పేర్కొంటారు. సీసం ముక్కలు, ప్లాస్టిక్‌ కవర్లు తదితర కృషించని వస్తువులను పొడి చెత్తగా పేర్కొంటారు.

తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వాలి

ఇళ్లలో ఉత్పత్తి అయ్యే చెత్తను తడి, పొడి చెత్తగా వేరుపరచి చెత్త సేకరణ సిబ్బందికి ఇవ్వాలి. ఈమేరకు కొంతకాలంగా చెత్త సేకరణ సిబ్బంది ఇంటింటా అవగాహన, ప్రచారం కల్పిస్తున్నారు. చెత్తను కలబోతగా అందిస్తుండడంతో కంపోస్టు యార్డులో చెత్త నిర్వహణ ఇబ్బందిగా మారుతోంది. చెత్తను వేరుపరచి అందివ్వడం ప్రజలు బాధ్యతగా భావించాలి. మునిసిపల్‌ సేవల్లో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నాం.

-పి.రామాంజుల్‌రెడ్డి, కమిషనర్‌, భువనగిరి మునిసిపాలిటీ

Updated Date - Nov 18 , 2024 | 12:40 AM