పెట్రోల్ బంకుల్లో సౌకర్యాలు ఏవీ?
ABN , Publish Date - Nov 19 , 2024 | 12:46 AM
ఉరుకులు, పరుగుల జీవితం..యాంత్రిక జీవన విధానంలో పేద, మధ్య తరగతి వర్గాల్లో అధిక శాతం ప్రజలు ద్విచక్ర వాహనాలు వాడుతున్నారు.
నియమాలకు మంగళం..
చేతులెత్తేసిన యజమానులు
పెట్రోల్ బంకుల యజమానులు వినియోగదారులకు విధిగా అందించాల్సిన సేవలు కొన్ని ఉన్నాయి మీకు తెలుసా? తాగునీటి వసతి, మరుగుదొడ్లు, గాలి మిషన ఇలా.. ఈ సౌకర్యాలన్నీ బంకుల యజమానులు ఉచితంగా అందించాల్సినవే. పట్టణాలతో పాటు ఆయా ప్రాంతాల్లో ఈ నియమాలు అమలవుతున్నాయా? వినియోగదారులు ఈ విషయాన్ని గమనిస్తున్నారా?
యాదగిరిగుట్ట రూరల్, నవంబరు 18, (ఆంధ్రజ్యోతి): ఉరుకులు, పరుగుల జీవితం..యాంత్రిక జీవన విధానంలో పేద, మధ్య తరగతి వర్గాల్లో అధిక శాతం ప్రజలు ద్విచక్ర వాహనాలు వాడుతున్నారు. ఒక్కో ఇంట్లో రెండు మూడు బైకులు సైతం ఉన్నాయి. మధ్య తరగతిలో కొద్ది మెరుగైన ఆదాయం ఉన్నా వారు సొంత కారును కలిగి ఉంటున్నారు. ఏ వాహనం నడవాలన్నా పెట్రోల్, డీజిల్ తప్పనిసరి. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా అనేక మంది కొత్త బంకులను స్థాపిస్తూనే ఉన్నారు. పెట్రోల్ బంకుల్లో కనీస వసతులు అమలవుతున్నాయా? వినియోగదారులు ఆయా బంకుల యజమానులను ప్రశిస్తున్నారా? జిల్లా వ్యాప్తంగా 70పెట్రోల్ బంకులు ఉన్నాయి. సగం శాతం పెట్రోల్ బంకుల్లో మౌలిక సౌకర్యాలు అమలు కావడం లేదు. యాదగిరిగుట్ట మండలంలో మొత్తం ఆరు పెట్రోల్ బంకులు ఉండగా, పట్టణంలోనే నాలుగు పెట్రోల్ బంకులు ఉన్నాయి. పెట్రోల్ బంకులకు అనుమతి మంజూరు చేసేటప్పుడు యజమాలు 10 నియమాలను ఖచ్చితంగా పాటిస్తామని, అన్ని సౌకర్యాలు ఉండే విధంగా బంకులు నిర్వహిస్తామని సంబంధిత అధికారులకు రాతపూర్వకంగా హామీ ఇస్తున్నారు. అనంతరం వారి ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నారు.
మౌలిక వసతులు ఇలా..
ప్రధానంగా బంకుల యజమానులు వినియోగదారులకు ఎయిర్ మిషన్ ఏర్పాటు చేసి దాని ద్వార వినియోగదారులకు ఉచితంగా ఎయిర్ అందించాల్సి ఉంటుంది. డబ్బులు మాత్రం అడుగవద్దు. బంకు వద్ద ప్రథమ చికిత్సకోసం ప్రత్యేకంగా బాక్స్ ఏర్పాటు చేసి వాటిలో ఉండే మందులపై గడువు తేదీ తప్పకుండా ఉండాలనే నిబంధన ఉంది. గడువుతేదీ అయిపోతే వాటిని వెంటనే బాక్స్ నుంచి తొలగించాలి. తాగనీరు, ఉచిత ఫోన్ సౌకర్యం, మరుగుదొడ్లు, ఫిర్యాదు బాక్స్, పెద్ద అక్షరాలతో ధరల పట్టిక, ఫైర్‌సేఫ్టీ డివైజర్స్, బిల్లు ఇవ్వడం, క్వాంటిటీ, క్వాలిటీకోసం 5లీటర్ల క్యాన్ ఇలా ప్రతిబంకులో వినియోగ దారులకు సౌకర్యాలు ఉండాలని నియమాలు ఉన్నాయి. ఈ నియమాలకు ఆయా యజమానులు వాటికి మంగళం పాడుతున్నారు. గుట్టలో ప్రతి పెట్రోల్ బంకులో నామమాత్రంగానే కేవలం నాలుగైదు సౌకర్యాలు తప్ప అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న పెట్రోల్ బంకులు ఏఒక్కటీ లేవు. కొంతమంది నిర్వాహకులు వినియోగదారులతో సఖ్యత లేకుండా దురుసుగా వ్యవరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బంకుల్లో ఇంత తతంగం జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం పట్టింపులేనట్లుగా వ్యవరిస్తున్నారు. వినియోగదారులు మాత్రం అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి ప్రతీ పెట్రోల్ బంకును ఆకసిక్మంగా తనిఖీలు చేసి 10సౌకర్యాలను పాటించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక వినియోగదారులు కోరుతున్నారు.
బంకులపై ప్యవేక్షణ కొరవడింది
గుట్టలోని ఫెట్రోల్ బంకులపై సంబందిత అధికారుల పర్యవేక్షణ కొరవడింది. బంకుల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యరిస్తున్నారు. బంకుల నిర్వాహకుల ప్రవర్తన దురుసుగా ఉంటోంది. మర్యాద పూర్తిగా కొరవడింది. కొన్ని పెట్రోల్ బంకుల్లో కల్తీ, తక్కువ క్వాంటిటీ కూడా ఉంటోంది. వినియోగదారులు పూర్తిగా నష్టపోతున్నారు.
-శివరాత్రి నరేష్, వినియోగదారుడు, యాదగిరిగుట్ట మండలం
10 సౌకర్యాలు కల్పించాల్సిందే
ఫెట్రోల్ బంకుల నిర్వాహకులు తప్పకుండా వినియోగదారులకు 10 సౌకర్యాలు కల్పించాల్సిందే. బంకులపై తరచూ పర్యవేక్షణ చేస్తూనే ఉంటాం. సమ్యలు మా దృష్టికి ఎప్పుడూ రాలేదు. బంకుల యజమానులకు ప్రతీ లీటరుకు రూపాయి చొప్పున కమీషన్ ఉంటుంది. సౌకర్యాలు ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
-వనజాత, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి