ఆటలు ఆడించేవారేరీ?
ABN, Publish Date - Nov 18 , 2024 | 12:43 AM
పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయుల (ఫిజికల్ డైరెక్టర్ల) కొరత విద్యార్థుల పాలిట పెనుశాపంగా మారింది.
జిల్లాలో వ్యాయామ ఉపాధ్యాయుల కొరత
క్రీడా నైపుణ్యంలో విద్యార్థుల వెనుకబాటు
దశాబ్దకాలంగా పోస్టులు భర్తీ కాని పరిస్థితి
యాదగిరిగుట్ట రూరల్, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయుల (ఫిజికల్ డైరెక్టర్ల) కొరత విద్యార్థుల పాలిట పెనుశాపంగా మారింది. క్రీడలను నేర్చుకుని నైపుణ్యాన్ని సాధించి ఆరంభంలో ఎదగాలనుకునే విద్యార్థులకు పునాధిలోనే ఆటంకం ఎదురవుతోంది. నియమానుసారంగా క్రీడలను నేర్పించి, నైపుణ్యాన్ని సాధించే క్రీడాకారులుగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఫిజికల్ డైరెక్టర్లు పాఠశాలలో లేకపోవడంతో నానాటికీ క్రీడల పట్ల ఆసక్తి సన్నగిల్లుతోంది. భవిష్యత్తులో క్రీడలకు విద్యార్థులు పూర్తిగా దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. జిల్లా వ్యాప్తంగా 182 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అందులో 22860మంది విద్యార్థులు చదువుతున్నారు. 182ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఉండగా కేవలం 67మంది ఫిజికల్ డైరెక్టర్లే ఉన్నారు. 115ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని ఎక్కువ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయుల కొరత కారణంగా క్రీడా మైదానాలు చెట్లు, పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. పాఠశాలల్లో, బయట ఆటలకు దూరం కావడంతో విద్యార్థుల్లో శారీరక, మానసిక దృఢత్వం లోపిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలను ప్రతిరోజూ ఆడిస్తే వారిలో జిజ్ఞాస, మానసిక ఉల్లాసం, ఉత్తేజం, ఐకమత్యం, పట్టుదల పెరుగుతాయని పలువురు పేర్కొంటున్నారు. క్రీడల్లో రాణించిన విద్యార్థులు, చదువులోనూ రాణిస్తారని మానసిక వేత్తలు చెబుతున్నారు. గెలుపు ఓటములను సమానంగా తీసుకునే మానసిక పరిపక్వత క్రీడా స్ఫూర్తితోనే అలవడుతుందని అనేక మంది నిరూపించారు. ప్రభుత్వం పాఠశాలలపై ప్రత్యేక దృష్టిపెట్టి డీఎస్సీ ద్వార ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులను భర్తీచేసి, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
క్రీడల నిధులు దుర్వినియోగం..
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో క్రీడా సామగ్రీకోసం కేటాయించిన రూ. 10వేలు దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలల్లో వారికి కావాల్సిన ఆటవస్తువులకు బిల్లులకు ఎలాంటి పొంతలేకుండా, కొన్ని సంవత్సరాల క్రితం కొనుగోలు చేసినవేనని పలువరు పేర్కొంటుండం అనుమానాలకు తావిస్తోంది.
యాదగిరిగుట్ట మండలంలో ఇలా..
యాదగిరిగుట్ట మండలంలోని మొత్తం 12ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నప్పటికీ వాటిలో కేవలం 5పాఠశాలలోనే ఫిజకల్ డైరెక్టర్లు ఉన్నారు. చోల్లేరు, దాతరుపల్లి, కాచారం, యాదగిరిపల్లి పోచమ్మ, గౌరాయిపల్లి, కాచారం గ్రామాల్లోని ఏడు ఉన్నత పాఠశాలల్లో ఇంతవరకు ఫిజికల్ డైరెక్టర్ల ఫోస్టింగ్ లేదు. కాచారం, గౌరాయిపల్లి, చొల్లేరు పాఠశాలల్లో క్రీడామైదానాలు పూర్తిగా చెట్ల పొదలతో నిండాయి.
క్రీడల్లో రాణించలేక పోతున్నాం
ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టు ఖాళీగా ఉండడంతో క్రీడల్లో రాణించలేకపోతున్నాం. సాయంత్రం సమయంలో ఎవరి ఇష్టం వచ్చిన ఆటలు ఆడుతున్నాం. వ్యాయామ ఉపాధ్యాయుడు ఉన్నట్లయితే వివిధ క్రీడల్లో ఇచ్చేవారు. ప్రతిభ ఉన్నవారిని వెలికి తీసి ఆయా క్రీడల్లో శిక్షణ ఇచ్చినట్లయితే భవిష్యతలో మంచి క్రీడాకారులు ఎదిగే అవకాశం ఉండేది.
-రాజు, 8వ తరగతి, కాచారం ప్రభుత్వ పాఠశాల, యాదగిరిగుట్ట మండలం
రగ్బీ అసోషియేషన్ ద్వార విద్యార్థులకు ఉచితశిక్షణ
విద్యార్థులకు రగ్బీ అసోసియేషన్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తూ క్రీడల్లో రాణించడానికి కృషి చేస్తున్నాం. సంస్థ ద్వారా ప్రజా ప్రతినిధులు, నాయకుల సహాకారంతో మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎదుగేందుకు కృషి చేస్తున్నాం. ఆసక్తి ఉన్నవారు ఉచిత శిక్షణ తీసుకోవచ్చు.
- బీబీనగర్ లక్ష్మణ్, రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు, యాదగిరిగుట్ట
Updated Date - Nov 18 , 2024 | 12:44 AM