వందెకరాల్లో నూతన హైకోర్టు
ABN, Publish Date - Jan 27 , 2024 | 05:01 AM
కేసులు వేగవంతంగా పరిష్కారం కావాలంటే మౌలిక సదుపాయాలు తక్షణావసరమని, ఇందులో భాగంగానే నూతన హైకోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రాజేంద్రనగర్‌లో వంద ఎకరాల భూమి కేటాయించిందని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే చెప్పారు.
కొత్త జిల్లాల్లో కోర్టుల నిర్మాణానికి భూకేటాయింపు
గణతంత్ర వేడుకల్లో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే
హైదరాబాద్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): కేసులు వేగవంతంగా పరిష్కారం కావాలంటే మౌలిక సదుపాయాలు తక్షణావసరమని, ఇందులో భాగంగానే నూతన హైకోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రాజేంద్రనగర్‌లో వంద ఎకరాల భూమి కేటాయించిందని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే చెప్పారు. హైకోర్టులో శుక్రవారం జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన ప్రసంగిస్తూ కోర్టుల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు జరుగుతున్న కృషిని వెల్లడించారు. కొత్తగా ఏర్పడిన 23 జ్యుడీషియల్ జిల్లాల్లో సైతం ప్రభుత్వం భూములు కేటాయించిందని చెప్పారు. గతంలో హైకోర్టు రూపొందించన న్యాయ నిర్మాణ్ డాక్యుమెంట్ ప్రకారం నూతన హైకోర్టు, నూతన జిల్లా కోర్టులు నిర్మిస్తామని తెలిపారు. హైకోర్టులో ప్రొసీడింగ్స్ లైవ్ స్ర్టీమింగ్ చేయడంతోపాటు హైబ్రిడ్ మోడ్‌లో సేవలు అందిస్తున్నామని వివరించారు. హనుమకొండ, వరంగల్, జగిత్యాల, కరీంనగర్ వంటి జిల్లాల్లో శుక్రవారం నుంచే ఈ-ఫైలింగ్ సేవలు ప్రారంభించామని ప్రకటించారు. అన్ని జిల్లా కోర్టుల్లో 37 ఈ-సేవా కేంద్రాలను త్వరలో ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. సుప్రీంకోర్టు, హైకోర్టుకు సంబంధించిన ముఖ్యమైన తీర్పులను తెలుగు భాషలోకి తర్జుమా చేయించే కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు.
జడ్జి పదవుల్లో బడుగులకు తీవ్ర అన్యాయం
అంతకుముందు ప్రసంగించిన హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వర్‌రావు హైకోర్టు న్యాయమూర్తుల పదవుల్లో వెనుకబడిన, బలహీనవర్గాల న్యాయవాదులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘బలహీన వర్గాల న్యాయవాదులకు వయస్సు తక్కువ ఉంటే 55 ఏళ్లు రానివ్వండని పదవులు నిరాకరిస్తున్నారు. 55 ఏళ్లు దాటిన తర్వాత ఏజ్‌బార్ అయిందని తిరస్కరిస్తున్నారు. కానీ ఉన్నత వర్గాల న్యాయవాదులకు ఈ విషయాలు ఏవీ అడ్డురావడం లేదు’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు చీఫ్ జస్టిస్, న్యాయమూర్తులు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, బార్ కౌన్సిల్ ఛైర్మన్ నర్సింహారెడ్డి, వైస్ ఛైర్మన్ సునీల్‌గౌడ్, అదనపు ఏజీలు తేరా రజినీకాంత్ రెడ్డి, ఇమ్రాన్‌ఖాన్ పాల్గొన్నారు.
Updated Date - Jan 27 , 2024 | 09:01 AM