Ponguleti: బీఆర్‌ఎస్ హయాంలో సర్వేతో దోపిడీ
ABN, Publish Date - Nov 19 , 2024 | 03:05 AM
అన్ని వ్యవస్థలను స్తంభింపజేసి బీఆర్‌ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిందని, దాని ద్వారా ప్రజల ఆస్తులను గుర్తించి వాటిని కొల్లగొట్టారని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఆరోపించారు.
నాటి వివరాలు ఎక్కడున్నాయో తెలియడం లేదు
ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే తాజా సర్వే: పొంగులేటి
హైదరాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): అన్ని వ్యవస్థలను స్తంభింపజేసి బీఆర్‌ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిందని, దాని ద్వారా ప్రజల ఆస్తులను గుర్తించి వాటిని కొల్లగొట్టారని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఆరోపించారు. చాలా గొప్ప సర్వే చేశామని చెప్పిన బీఆర్‌ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగానే వివరాలను బయటపెట్టలేదని అన్నారు. నాటి సర్వే ద్వారా బీఆర్‌ఎస్ నాయకులు ఆస్తులు పెంచుకున్నారని విమర్శించారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఎక్కడ ఉన్నాయో తమకూ తెలియడం లేదని పేర్కొన్నారు. సర్కారు చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే)పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో పొంగులేటి సచివాలయంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రగతికి ఏం చేయాలి? భవిష్యత్తులో ప్రజలకు ఏం అవసరం? అనేది తెలుసుకునేలా సర్వేను శాస్ర్తీయంగా చేపట్టామన్నారు.
ప్రజల వ్యక్తిగత, కుటుంబ అవసరాలు ఏమిటి, పంచాయతీలు, వార్డులు, డివిజన్లు, నియోజకవర్గాల అవసరాలు ఏమిటి, మారుమూల ప్రాంతాల్లోని ఇబ్బందులు ఏమిటి? తదితర 75 అంశాలపై దృష్టిసారించేందుకే సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 1,16,14,349 కుటుంబాలకు గాను ఆదివారం వరకు 58.3 శాతం (67,72,246) కుటుంబాల సర్వే పూర్తి చేసినట్లు చెప్పారు. నెలాఖరు నాటికి పూర్తిచేస్తామని వివరించారు. విద్యావేత్తలు, మేధావులు సహా అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వస్తుంటే.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మాత్రం సర్వే అసత్య ప్రచారం చేస్తోందని పొంగులేటి మండిపడ్డారు. సంక్షేమ పథకాలు తొలగిస్తారంటూ గందరగోళానికి గురిచేస్తోందని విమర్శించారు. పేదలకు అందించే ఏ పథకాన్నీ సర్వే అనంతరం ఉపసంహరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని, ఎవరూ ఆందోళనకు గురికావొద్దని సూచించారు. కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత వివరాలు ఇచ్చినందుకు అభినందనలు తెలిపారు. కర్ణాటకలో సర్వేను కాంగ్రెస్ ప్రభుత్వం గోప్యంగా ఉంచడంపై ప్రశ్నించగా అక్కడి విషయాలు పూర్తిగా తెలియవని మంత్రి చెప్పారు.
Updated Date - Nov 19 , 2024 | 03:05 AM