Share News

Droupadi Murmu: భారతీయ సంస్కృతికి విశ్వవ్యాప్త గౌరవం!

ABN , Publish Date - Nov 23 , 2024 | 04:32 AM

పురాతన కాలం నుంచే భారతీయ సైద్ధాంతికత ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని, భారతీయుల మత విశ్వాసాలు, కళలు, సాంకేతిక పరిజ్ణానం, భాష, సాహిత్యం విశ్వవ్యాప్తంగా గౌరవం పొందాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.

Droupadi Murmu: భారతీయ సంస్కృతికి విశ్వవ్యాప్త గౌరవం!

  • విదేశీ దండయాత్రల వల్ల మన సంస్కృతి ధ్వంసమైంది

  • మనలోని బానిస భావాల్ని తొలగించుకుంటున్నాం

  • దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి భారతీయుడు

  • దేశమే మిన్న అనే భావనతో ఎల్లప్పుడూ ఉండాలి

  • భిన్నత్వంలో ఏకత్వం.. ఇంద్రధనుస్సు వంటిది: ముర్ము

  • లోక్‌మంథన్‌-2024ను ప్రారంభించిన రాష్ట్రపతి

  • గిరిజనుల జీవన విధానంపై చర్చ జరగాలి: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పురాతన కాలం నుంచే భారతీయ సైద్ధాంతికత ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని, భారతీయుల మత విశ్వాసాలు, కళలు, సాంకేతిక పరిజ్ణానం, భాష, సాహిత్యం విశ్వవ్యాప్తంగా గౌరవం పొందాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మనదేశంపై దండయాత్రలతో సామ్రాజ్యవాదులు, విదేశీ శక్తులు ఆర్థికంగా మనల్ని దోచుకోవడమే కాకుండా సామాజికంగా కూడా దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. మన భాష, సంస్కృతి, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను విధ్వంసం చేశారని చెప్పారు. మన సమాజాన్ని విడగొట్టేందుకు, ఐకమత్యాన్ని దెబ్బతీసేందుకు శతాబ్దాల పాటు ప్రయత్నాంచారని, మనలో బానిస మూలాలను చొప్పించారని పేర్కొన్నారు.. ఈ బానిసత్వ ఆలోచనలను ఇప్పుడు మనం తొలగించుకుంటున్నామని... రాజ్‌పథ్‌ పేరు కర్తవ్యపథ్‌గా.. దర్బార్‌ హాల్‌ పేరు గణతంత్ర మండ్‌పగా మారిందని గుర్తుచేశారు. శుక్రవారం, శిల్పకళావేదికలో లోక్‌మంథన్‌-2024 ఉత్సవాలను ముర్ము జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె, లోక్‌-అవలోకన్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె ప్రసంగించారు. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ బలం అని.. మన మూల సిద్ధాంతమైన ఏకత్వానికి భిన్నత్వం ఇంద్ర ధనసులాంటి సౌందర్యాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. ఐకమత్యం, సామరస్యమే మన సభ్యత, భవిష్యత్తు అని.. ఆ దిశగా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే ప్రతి భారతీయుడూ దేశమే అన్నింటికన్నా ముఖ్యం అన్న భావనను ప్రోది చేసుకోవాలని పేర్కొన్నారు. మన పూర్వీకులు అందించిన సంప్రదాయాలను బలోపేతం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని ఆమె అన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను బలోపేతం చేసే గొప్ప కార్యక్రమం లోక్‌మంథన్‌ అని, ఈ కార్యక్రమం సందర్భంగా అహల్యబాయ్‌ హోల్కర్‌, రాణి రుద్రమ, ఝాన్సీ లక్ష్మిబాయి వంటి వీర వనితల గురించి ప్రదర్శనలు నిర్వహించడం అభినందనీయం అని అన్నారు. అనంతరం రాష్ట్ర గవర్నర్‌ విష్ణుదేవ్‌ వర్మ మాట్లాడారు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు ప్రతి రాష్ట్రం దేశ సమైక్యతను ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. భారతదేశ సాంస్కృతిక విలువలు ఎన్నో కుట్రలను తట్టుకుని నిలిచాయన్నారు.


  • గిరిజనుల జీవనవిధానంపై చర్చ జరగాలి: కిషన్‌రెడ్డి

దేశమే అన్నింటికన్నా శ్రేష్టం అన్న భావనతో లోక్‌మంథన్‌ పనిచేస్తుందని ఉత్సవ రిసెప్షన్‌ కమిటీ ఛైర్మన్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. భారతీయ పరంపర, సంస్కృతి, కళలు, సామాజిక ఐక్యత, భారతీయ జ్ఞాన-విజ్ఞాన సంపద, విద్య, వైద్యవిధానం, పర్యావరణ పరిరక్షణ, విభిన్న క్షేత్రాల్లో లోక్‌ విచార్‌, లోక్‌ వ్యవహార్‌, లోక్‌ వ్యవస్థకు సంబంధించిన అంశాలపై లోక్‌మంథన్‌లో చర్చ జరుగుతోందని వివరించారు. గిరిజనుల జీవన విధానంపై చర్చ జరగాల్సిన అవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. ప్రాచీన కాలం నుంచే వారు జల్‌, జంగల్‌, జమీన్‌తో మమేకమయ్యారని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క మాట్లాడారు. భిన్న సంస్కృతులు, జీవన విధానాల సమ్మేళనం హైదరాబాద్‌ అని అన్నారు. ఇది మినీ ఇండియా అని.. ప్రపంచంలో అత్యున్నత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి పనిచేయాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రజ్ఞా ప్రవాహ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి నందగోపాల్‌, లోక్‌మంథన్‌-2024 వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, డాక్టర్‌ టి. హనుమాన్‌చౌదరి, తదితరులు పాల్గొన్నారు.


  • అలరించిన కార్యక్రమాలు

లోక్‌మంథన్‌ కళా ప్రదర్శనల్లో భాగంగా ఆ కళాకారులు ప్రదర్శించిన చిడతల రామాయణం చిన్నారులకు కూడా అర్థమై అందులో వారిని లీనం చేస్తూ సాగింది. కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ మండలం తుమ్మనపల్లి గ్రామానికి చెందిన బృందం చేసిన ఈ ప్రదర్శన విద్యార్ధులను విశేషంగా ఆకట్టుకుంది. జై శ్రీరామ్‌ నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. రామలక్ష్మణులు రాజ్యం వీడి వనవాసానికి బయలు దేరండంతో ప్రారంభించిన వీరి కథ రావణ సంహారం వరకూ ఆకట్టుకునే రీతిలో సాగింది. ఇక ఎంతటి వారినైనా లీనం చేసుకునే అద్భుతమైన కళ జానపదం. కొంటెతనం, అలక.. అన్నీ తమ పాటల ద్వారానే చూపుతూ నల్లగొండకు చెందిన జడ కోలాటం బృంద ప్రదర్శన విద్యార్థులను ఆనంద పారవశ్యంలో ముంచెత్తింది. పరమేశ్‌ కోలాటం బృందానికి చెందిన 15 మంది సభ్యుల బృందం గతంలో నగరంలో చాలాసార్లు ప్రదర్శనలు చేసినప్పటికీ విద్యార్థుల నుంచి మాత్రం అపూర్వ స్పందన వ్యక్తమైంది. ఇక హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్డా నుంచి వచ్చిన వన్షిఖా సంగ్రియత్‌ యువ మంత్‌ బృందం జానపద నృత్యం ద్వారా శివపార్వతుల కళ్యాణం ప్రదర్శన ద్వారా వీక్షకులను భక్తిమార్గంలోకి తీసుకువెళ్లారు.

Updated Date - Nov 23 , 2024 | 04:40 AM