నకిలీ నారుకు కళ్లెం..!
ABN , Publish Date - Nov 17 , 2024 | 11:23 PM
నకిలీ నారుకు కళ్లెం వేయడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందుకోసం నర్సరీలను చట్టం పరిధిలోకి తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటినుంచి నర్సరీ నిర్వహణకు లైసెన్సు తప్పనిసరి చేసింది.
జిల్లాలో అనుమతి లేని నర్సరీలపై చర్యలు
150కి పైగా నర్సరీలు, అనుమతి ఉన్నవి 26
రెన్యువల్ లేకుండానే కొనసాగుతున్న కొన్ని నర్సరీలు
నాణ్యత లేని నారు కొనుగోలు చేసి నష్టపోతున్న రైతులు
నర్సరీలకు లైసెన్సులు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
రిజిస్ర్టేషన్ లేని వాటికి నోటీసులు జారీ చేస్తున్న ఉద్యానశాఖ అధికారులు
నకిలీ నారుకు కళ్లెం వేయడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందుకోసం నర్సరీలను చట్టం పరిధిలోకి తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటినుంచి నర్సరీ నిర్వహణకు లైసెన్సు తప్పనిసరి చేసింది. గతంలో ఉన్న చట్టాన్ని సవరిస్తూ కొత్తగా తీసుకు వచ్చిన దానిని పకడ్బందీగా అమలు చేసేందుకు ఉద్యాన శాఖకు బాధ్యతలు అప్పగించింది. లైసెన్సు లేకుండా నర్సరీని నిర్వహిస్తే చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
రంగారెడ్డి అర్బన్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) :నర్సరీలన్నీ ఉద్యానవన శాఖ పరిధిలోకి వచ్చేశాయి. జిల్లాలో 150కిపైగా నర్సరీలు ఉండగా, అందులో 26 నర్సరీలు మాత్రమే ప్రభుత్వం నుంచి అనుమతి పొంది ఉన్నాయి. మిగతావి అక్రమంగా కొనసాగుతున్నాయి. అనుమతి పొందిన వాటిల్లో కూడా కొన్ని నర్సరీలు లైసెన్సు రిన్యూవల్ చేసుకోలేదు. దీంతో అనుమతి లేకుండా కొనసాగుతున్న నర్సరీలపై ఇకనుంచి ఉద్యానవన శాఖ అధికారులు ఉక్కుపాదం మోపేందుకు రెడీ అవుతున్నారు. అలాగే ఎదుగుదల లేని మొక్కలు విక్రయించినా, కల్తీ నారు అంటగట్టినా కటకటాలు లెక్కించాల్సిందే. జిల్లాలో నకిలీ విత్తన మాఫియాను అణచివేసే క్రమంలో నర్సరీలకు రిజిస్ర్టేషన్(లైసెన్స్) తప్పనిసరి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. స్థానికంగా రైతులు ఎక్కువగా పూలు, పండ్లు, కూరగాయలు సాగు చేస్తుంటారు. అలాగే మిరప, టమాట, వంకాయ, చిక్కుడు, పచ్చిమిర్చి, క్వాలీఫ్లవర్, పాలకూర, తోటకూర, మెంతంకూర తదితర పంటలు ఎక్కువగా పండిస్తారు. పంటల సాగును దృష్టిలో ఉంచుకుని నర్సరీల నిర్వాహకులు నారును పెంచుతున్నారు. అయితే జిల్లాలో ఎక్కువగా లైసెన్సు లేకుండా నర్సరీలు నిర్వహిస్తున్నారు. వీటిని గుర్తించి నిర్వాహకులకు ఉద్యానశాఖ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు అందుకుని రిజిస్ర్టేషన్ చేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యహరించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ముందుకు సాగుతున్నారు.
ఇవీ నిబంధనలు
నర్సరీ ప్రధాన ద్వారా వద్ద అక్కడ లభించే నారు, మొక్కల సంఖ్య, ధరల పట్టి తెలుగులో రాసి పెట్టాలి. విత్తనం ఎక్కడి నుంచి సేకరించారు. బిల్లు వివరాలు, లాట్, బ్యాచ్ నెంబరు, విత్తన పరీక్ష వివరాల పత్రాలు, విత్తనం తయారు చేసిన తేది, గడువు తేది, నారు, మొక్కలు అమ్మిన తేది తదితర వివరాలు విధిగా నమోదు చేయాలి. నాణ్యమైన నారు, మొక్కల తయారీకి సరైన పొలం ఎన్నుకోవడంతో పాటు చుట్టూ కంచె ఏర్పాటు చేయాలి. పిల్ల, తల్లి మొక్కల బ్లాక్‌లను వేరుగా ఉంచాలి. వీటితోపాటు కార్యాలయం, స్టోర్ వసతులు ఉండాలి. షేడ్‌నెట్ హౌస్ సమకూర్చుకోవాలి. నారు వయస్సు, నాణ్యత ప్రమాణాలపై ప్రత్యేక నిబంధనలు పాటించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై చట్ట ప్రకారం రూ.5వేల జరిమానా, ఏడాది జైలుశిక్ష, లేదంటే రెండూ విధించవచ్చు. రైతులు రిజిస్ర్టేషన్ ఉన్న నర్సరీల నుంచే నారు కొనుగోలు చేయాలి. బిల్లు తీసుకుని జాగ్రత్తగా భద్రపర్చుకోవాలి.
లైసెన్స్‌కు కావాల్సిన పత్రాలు
- దరఖాస్తుదారుడి చిరునామా కోసం టెలిఫోన్, కరెంట్ బిల్లు, ఓటరు, ఆధార్ కార్డు ఏదైనా ఉండాలి.
- నర్సరీ చిరునామా ఫొటోతో సహా ఉండాలి.
- భూమి పట్టదారు పాసుపుస్తకం జిరాక్స్, లీజు డాక్యుమెంట్ పత్రాలు.
- నర్సరీ లేఅవుట్, మ్యాప్-ప్రభుత్వ ఆమోదిత సర్వేయర్ లేదా ఏజెన్సీతో పొంది ఉండాలి.
- నర్సరీలో మౌలిక సదుపాయాల పూర్తి వివరాలు ఉండాలి.
- మూడేళ్ల ఉత్పత్తి వివరాలు తెలపాలి.
- నర్సరీ డిజిటల్ ఫొటో కాఫీ పొందుపర్చాలి.
- చలానా నకలు రసీదు జత చేయాలి.
రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు వివరాలు..
- నర్సరీల రిజిస్ట్రేషన్‌కు సంబంధిత జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమశాఖ అధికారిని సంప్రదించాలి.
- పండ్ల మొక్కల ఉత్పత్తికి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.5వేలు.
- కూరగాయలు, పూలు, ఔషధ, సుగంధద్రవ్యాల నర్సరీ రిజిస్ట్రేషన్ ఫీజు 2-4 లక్షల ఉత్పత్తి వరకు రూ.వెయ్యి, 4 లక్షలకు మించి ఉత్పత్తికి రూ.2,500 చెల్లించాలి.
- రిజిస్ట్రేషన్ తర్వాత పండ్ల మొక్కలకు మూడేళ్లకు ఓసారి రూ.1,500 కట్టి లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలి.
- కూరగాయలు, పూలు, ఔషధ, సుగంధ ద్రవ్యాల మొక్కలకు ఏటా 4లక్షల కన్నా తక్కువైతే రూ.500, 4 లక్షల కన్నా ఎక్కువైతే రూ.వెయ్యి కట్టి లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలి.
రిజిస్ర్టేషన్ కోసం...
ఇబ్రహీంపట్నం, యాచారం, బాలాపూర్, అబ్ధుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, మాడ్గుల, మంచాల మండలాలకు చెందిన రైతులు ఉద్యానవన శాఖ అధికారి నవీన (8977714219)ను సంప్రదించాలి. చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి, షాబాద్, శేరిలింగంపల్లి, గండిపేట మండలాలకు చెందిన రైతులు ఉద్యానశాఖ అధికారి కీర్తి కృష్ణ (8977714222)ను సంప్రదించాలి. ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మహేశ్వరం, కందుకూరు, శంషాబాద్, రాజేంద్రనగర్ రైతులు ఉద్యానశాఖ అధికారి సౌమ్య (8977714221) ను సంప్రదించాలి. అలాగే షాద్‌నగర్, కేశంపేట్, కొత్తూరు, నందిగామ, చౌదరిగూడెం,కొందుర్గు మండలాలకు చెందిన రైతులు ఉద్యానశాఖ అధికారి హిమబిందు (8977714220)ను సంప్రదించాలి.
నోటీసులు జారీ చేస్తున్నాం
అనుమతి లేకుండా కొనసాగుతున్న నర్సరీలకు నోటీసులు జారీ చేస్తున్నాం. 30 రోజుల్లోగా రిజిస్ర్టేషన్ చేసుకోకుంటే చట్టపరమైన చర్యలు తప్పవు. ప్రతీ నర్సరీ యజమాని రిజిస్ర్టేషన్ చేయించుకుని లైసెన్స్ పొందాల్సిందే. నాణ్యమైన నారును మాత్రమే రైతులకు విక్రయించాలి. విక్రయ సమయంలో తప్పక రసీదు ఇవ్వాలి. యజమానులు రికార్డుల్లో వివరాలు పొందుపర్చాలి.
సురేష్, జిల్లా ఉద్యానశాఖ అధికారి