అసంపూర్తిగా ‘ఇంటిగ్రేటెడ్ మార్కెట్’
ABN , Publish Date - Nov 16 , 2024 | 11:15 PM
సమీకృత మార్కెట్ యార్డు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. రెండేళ్లలో పూర్తి కావల్సిన పనులు మూడేళ్లయినా ముందుకు సాగడం లేదు. కూరగాయలు, పండ్లు, మాసం ఇలా.. అన్నీ ఒకేచోట విక్రయాలు సాగేలా అప్పటి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా శంకర్‌పల్లి మున్సిపల్‌లో సమీకృత మార్కెట్ యార్డు పనులను ప్రారంభించింది.
మూడేళ్ల నుంచి పూర్తికాని నిర్మాణం
నిధుల లేమితో అర్ధంతరంగా
పనులు ఆపేసిన కాంట్రాక్టర్
పట్టించుకోని ప్రభుత్వం, అధికారులు
శంకర్‌పల్లి, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): సమీకృత మార్కెట్ యార్డు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. రెండేళ్లలో పూర్తి కావల్సిన పనులు మూడేళ్లయినా ముందుకు సాగడం లేదు. కూరగాయలు, పండ్లు, మాసం ఇలా.. అన్నీ ఒకేచోట విక్రయాలు సాగేలా అప్పటి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా శంకర్‌పల్లి మున్సిపల్‌లో సమీకృత మార్కెట్ యార్డు పనులను ప్రారంభించింది. ప్రస్తుతం నిధులు లేక మార్కెట్ యార్డు నిర్మాణ పనులు ప్రారంభ దశలోనే నిలిచిపోయాయి.
ఒకేచోట క్రయవిక్రయాలు జరిగేలా
మున్సిపాలిటీల్లో ఒకేచోట క్రయవిక్రయాలు కొనసాగేలా బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ యార్డుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే శంకర్‌పల్లి మున్సిపల్‌లో 30గుంటల భూమి కేటాయించి, రూ.2కోట్ల నిధులతో 2021 జూన్‌లో అప్పటి మంత్రి సబితారెడ్డి సమీకృత మార్కెట్ యార్డుకు శంకుస్థాపన చేశారు. కాగా, మొదట్లో సాగిన చకచకా పనులు సాగినా.. ఆపై వేగం మందగించింది.
మొదటినుంచీ అడ్డంకులే..
సమీకృత మార్కెట్ యార్డు నిర్మాణానికి మొదటి నుంచీ అడ్డంకులు ఎదురవుతున్నాయి. మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వానికి చెందిన ఎకరా స్థలం కూడా లేకపోవడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు సమీకృత మార్కెట్ నిర్మాణంలో తర్జనభర్జన పడ్డారు. అప్పటి మంత్రి సబితారెడ్డి రోడ్డు భవనాల శాఖ అధికారులతో మాట్లాడి ఒప్పించి శంకర్‌పల్లి మున్సిపల్‌లోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌ్‌సలో 30గుంటల భూమి కేటాయించారు. అయితే, ఆ స్థలాన్ని రోడ్డు భవనాల శాఖ అధికారులు మున్సిపాలిటీకి అయిష్టంగానే అప్పగించారని సమాచారం.
వెజ్, నాన్‌వెజ్ బ్లాకులుగా నిర్మాణం
మార్కెట్ యార్డును విభజించి ఒకటి వెజ్, మరొకటి నాన్‌వెజ్ బ్లాక్‌గా నిర్మాణం చేపట్టారు. రెండు బ్లాకుల్లో కలిపి సుమారు 80-100 దుకాణాల నిర్మాణం ఉండేటట్లు డిజైన్ చేశారు. 2021లో జూన్‌లో శంకుస్థాపన చేసినా వెజ్ బ్లాకులో ఒక అంతస్తు నిర్మాణం చేపట్టగా మరొక అంతస్తు నిర్మాణం పనులు పూర్తి చేయలేదు. కాగా, నాన్‌వెజ్ బ్లాక్ పిల్లర్ల దశలోనే మిగిలిపోయింది. వ్యాపారులు, కొనుగోలుదారులకు సదుపాయాలు కల్పించి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డును అందుబాటులోకి తెచ్చే ఆలోచనకు ఆదిలోనే ఆటంకం ఎదురైనట్లయింది.
నిధుల కొరతతోనే..
నిధుల కొరతతోనే మార్కెట్ యార్డు నిర్మాణం పూర్తి కావడం లేదని సమాచారం. సమీకృత మార్కెట్ నిర్మాణానికి ప్రారంభంలో రూ.2కోట్ల నిధులు కేటాయించగా, మంజూరైన నిధులతో కాంట్రాక్టర్ అయినంత వరకూ నిర్మాణాన్ని పూర్తిచేశారు. ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంతో మార్కెట్ యార్డు నిర్మాణ పనులు ఆదిలోనే శిథిలావస్థలోకి వెళ్లే పరిస్థితి దాపురించింది. రూ.కోటి నిధులు మంజూరైతే గానీ పనులు పూర్తయ్యేలా లేవు. ఇప్పటికైనా అధికారులు శ్రద్ధ వహించి నిర్మాణాన్ని పూర్తి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈవిషయమై శంకర్‌పల్లి మున్సిపల్ ఏఈ సాయికిరణ్‌ను వివరణ కోరగా నిధుల కొరతతోనే కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారని, ప్రభుత్వం మంజూరు చేయగానే పనులు ప్రారంభించి పనులు పూర్తి చేయిస్తామని ఆయన తెలిపారు.
నిధులు మంజూరు చేయాలి
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో మార్కెట్ యార్డు కోసం నిధులు మంజూరు చేసింది. నిధుల కొరతతో అర్ధాంతరంగా పనులను నిలిచివేశారు. ప్రస్తుతం నిలిచిన పనులు పూర్తయ్యేలా చూడాలి. సమీకృత మార్కెట్‌తో పట్టణ ప్రజలతో పాటు దుకాణదారులకు ఉపయోగకరంగా ఉంటుంది. పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు సైతం తొలగిపోతాయి.
- ఎజాస్ బీఆర్‌ఎస్ నాయకుడు, శంకర్‌పల్లి